రెవెన్యూ మాయాజాలం
ABN, Publish Date - Aug 29 , 2024 | 11:08 PM
జిల్లా కేంద్రమైన రాయచోటిలో ప్రభుత్వ భూములు రోజురోజుకు దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను రేటు పెట్టి అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చాయి.
ప్రభుత్వ స్థలాలు దర్జాగా కబ్జా
కబ్జా స్థలాల్లో పెద్ద భవంతుల నిర్మాణం
రాయచోటి (కలెక్టరేట్), ఆగస్టు 29 : జిల్లా కేంద్రమైన రాయచోటిలో ప్రభుత్వ భూములు రోజురోజుకు దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను రేటు పెట్టి అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చాయి. వీఆర్‌వోల దగ్గర నుంచి తహసీల్దార్ వరకు అందరూ రాయచోటికి పోస్టింగ్‌లు వేయించుకుని తమ మాయాజాలంతో రికార్డులను తమకు అనుకూలమైన వారి పేరు మీద మార్చేసి జేబులు నింపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు (2001) ఈ కార్యాలయంలో రైతుకు పాసుబుక్కు ఇవ్వాలంటే రూ.2 వేలు లంచం తీసుకోవడానికి తహసీల్దార్ తిరుపతికి వెళ్లి అక్కడే తీసుకునేవాడని అప్పుడు పనిచేసిన రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే గతంలో పనిచేసిన ఓ తహసీల్దార్ పాసుబుక్కుకు కనీసం లక్ష రూపాయలు వసూలు చేయండి అని ఆదేశాలు ఇచ్చేవారని అప్పట్లో ప్రచారం జోరుగా సాగింది. ఇదే అదునుగా తీసుకున్న రెవెన్యూ అధికారులు అప్పటి నుంచి రాయచోటిలో పోస్టింగ్‌ల కోసం చోటామోటా నాయకుల చుట్టూ తిరిగి వారు అడిగినంత డబ్బులు ఇచ్చి ఇక్కడికి ఉద్యోగం వేయించుకుని ఉన్నంతకాలం అందినకాడికి దోచుకుని అనంతరం గుట్టుచప్పుడు కాకుండా పక్క మండలాలకు బదిలీలపై వెళ్లిపోతున్నారు. 2011-14 వరకు ఉన్న తహసీల్దార్‌ను అడ్డుపెట్టుకుని ఓ అర్‌ఐ మండలంలోని ప్రభుత్వ భూములను ఇష్టానుసారం ఆన్‌లైన్ చేసి కోట్లలో అక్రమ సంపాదనకు పాల్పడ్డాడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. 2014లో వచ్చిన తహసీల్దార్ నాయకుల మాట వినడం లేదని అయనను ఏడాది తిరగకముందే పంపించేశారు. ఆ తరువాత వచ్చిన బలమైన సామాజికవర్గానికి చెందిన ఓ తహసీల్దార్ మున్సిపాలిటీలో ఉన్న డీకేటీ భూములను చోటామోటా నాయకులకు ఆన్‌లైన్ చేసి రూ.50 కోట్లు సంపాదించాడని, ఒక సర్వే నెంబర్‌లో పెద్ద మొత్తంలో బేరం కుదుర్చుకుని ఏవో కారణాల వల్ల పని పూర్తి కాకపోవడంతో రూ.25 లక్షలు తిరిగి ఇచ్చేశాడని ప్రచారం జరిగింది. తర్వాత వచ్చిన తహసీల్దార్ కూడా అదే బాటలోనే నడిచి కోట్లాది రూపాయలు సంపాదించాడని అరోపణలు ఉన్నాయి. రాయచోటిలో ప్రభుత్వ భూములు అక్రమించాలంటే రెవెన్యూ అధికారులకు మామూళ్లు ముట్టచెప్పి తరువాత ఆక్రమణదారులు సీన్‌లోకి వెళుతున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లా కేంద్రం అయినప్పటి నుంచి ఏజీ గార్డెన్, శుభకతుల్లా కాలనీ, రవ్వల గుట్ట, బిజిలిగుట్ట, తదితర ప్రాంతాల్లో ఒక్కో ఫ్లాట్‌కు 3-5 లక్షలు గుట్టుచప్పుడు కాకుండా వీఅర్‌వోల ద్వారా రెవెన్యూ సిబ్బంది మామూళ్లు తీసుకున్నారని కొందరు బహిరంగంగానే చెబుతున్నారు. రవ్వలగుట్ట దగ్గర పునాదులు వేస్తున్న ఓ వ్వక్తి నుంచి ఓ వీఆర్‌వో పెద్దమొత్తంలో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2007లో ఈ ప్రాంతంలో దాదాపు 500 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉండేవి. 2024 వచ్చేసరికి 57 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. మిగిలిన భూమి అంతా రియల్‌ఎస్టేట్ వారి చేతుల్లోకి వెళ్లిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ అస్తులు అక్రమించిన వారిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పర్యవేక్షణాలోపం
రాయచోటి జిల్లా కేంద్రం అయినప్పటి నుంచి మున్సిపాలిటీ పరిధిలో భూకబ్జాలు ఎక్కువగా జరుగుతున్నాయి. శని, ఆదివారాలలో మాత్రమే పునాదులు వెలుస్తున్నాయి. వీరబల్లి, సుండుపల్లి, లక్కిరెడ్డిపల్లి, చిన్నమండ్యం ప్రాంతాలకు చెందిన వారు ఏదో ఒక అధికారి పేరు చెప్పి దర్జాగా పునాదులు వేసేస్తున్నారు. అసలు వీరికి పట్టాలు ఎవరు ఇచ్చారు, ఏ ఆధారంతో ఇళ్లు కడుతున్నారు, వీరి వెనుక ఉన్నది ఎవరు అన్న విషయాలు ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. గతంలో ఇక్కడికి వచ్చిన తహసీల్దార్లు సీటు వదిలి బయటికి రాకపోవడం, క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతోంది అని వీఆర్‌వోలను గట్టిగా మందలించకపోవడం వల్లే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి.
భూఅక్రమార్కులకు కళ్లెం వేయాలి
- సాంబశివ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
రాయచోటి జిల్లా కేంద్రం అయింది కాబట్టి ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టేందుకు చాలా భూమి అవసరం ఉంది. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిని చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు జిల్లా స్థాయి అధికారులు చొరవ చూపాలి. రాయచోటిలో ప్రభుత్వ భూమి చాలా ఉండేది. ఇప్పుడు అ భూమి రియల్‌ఎస్టేట్ వారి చేతుల్లోకి పోయి మొత్తం అన్యాక్రాంతం అయిపోయింది. ఇక్కడికి వచ్చే ప్రతి అధికారి రియల్‌ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయి రాయచోటిని భూఅక్రమార్కులకు అడ్డాగా మార్చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకు అందరూ మామూళ్లకు అలవాటు పడడం వల్లే పరిస్థితి ఇలా తయారైందని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. 2019 వరకు పట్టణంలో ప్రభుత్వ స్థలాలు చాలా వరకు ఖాళీగా ఉండేవి. ప్రస్తుతం పూర్తిగా కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయాయి. ఇక్కడికి వచ్చే వీఆర్‌వోలు మామూళ్లు తీసుకుని వారికి నచ్చిన స్థలంలో పునాదులు వేసుకోమని ఉచిత సలహాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. పత్రికల్లో కబ్జాలపై వార్తలు వచ్చినప్పుడు మాత్రమే రెవెన్యూ వారు హడావుడి చేస్తారు. కూటమి ప్రభుత్వంలో అయినా ప్రభుత్వ స్థలాలను కాపాడాలి.
అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
-ఎం.పుల్లారెడ్డి, తహసీల్దార్, రాయచోటి
ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు. నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను. ఇక్కడ జరిగిన విషయాలపై నాకు పూర్తిగా అవగాహన లేదు. రెండు రోజుల క్రితం అక్రమ కట్టడాలు చేపడుతున్నారని సమాచారం రావడంతో వెంటనే వెళ్లి వాటిని ఆపించేశాము. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
Updated Date - Aug 29 , 2024 | 11:08 PM