ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తెలుగు ప్రాచీనతను కాపాడుకోవాలి

ABN, Publish Date - Aug 29 , 2024 | 11:39 PM

తెలుగు భాష చాలా ప్రాచీనమైనదని, దీని ప్రాచీనతను మనందరం కాపాడుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. తొలి తెలుగు శాసనాలున్న కలమల్లలో గురువారం జరిగిన తెలుగుభాషా దినోత్సవానికి అయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

తెలుగు భాషా దినోత్సవ వేడుకలో మాట్లాడుతున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ప్రతి ఒక్కరూ తెలుగులోనే మాట్లాడాలి

తెలుగు సాహిత్యానికి ప్రొద్దుటూరు పెట్టింది పేరు

పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

తెలుగు భాష గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి : కలెక్టర్‌

కళకళలాడిన కలమల్ల

విజయవంతమైన తెలుగు భాషా దినోత్సవం

ఎర్రగుంట్ల, ఆగస్టు 29: తెలుగు భాష చాలా ప్రాచీనమైనదని, దీని ప్రాచీనతను మనందరం కాపాడుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. తొలి తెలుగు శాసనాలున్న కలమల్లలో గురువారం జరిగిన తెలుగుభాషా దినోత్సవానికి అయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఎర్రగుంట్ల వరకు రైలులో వచ్చిన ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గాన కలమల్లకు చేరుకున్నారు. అక్కడ అధికారులు, ఎన్డీయే నేతలు, తెలుగుదనం ఉట్టి పడే వేషధారణలో చిన్నారులు, జానపద కళాకారులు ఆయనను స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రాచీన సాంస్కృతిక, కవుల, సాహితీవేత్తల, తెలుగు చరిత్రపై ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆయన తిలకించారు. తొలి తెలుగు శాసనాలను పరిశీలించారు. చిన్నారుల నృత్యప్రదర్శనలను, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. అనంతరం తెలుగుభాషా దినోత్సవానికి జ్యోతి ప్రజ్వలన చేశారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఇంట్లో, వీధిలో, బడిలో, గుడిలో అమ్మఒడిలో, నారుమడిలో మాతృభాషనే మాట్లాడాలన్నారు. సెల్లులు, టీవీలను పరిమితంగా వాడితే ఉపయోగమని, లేదంటే జబ్బులొస్తొయన్నారు. అవసరమైన వరకే ఎలక్ర్టానిక్‌ మిషనరీని వాడాలని, ప్రతిదానికి గూగుల్‌పై ఆధార పడరాదన్నారు. చివరకు భర్త పేరును కూడా గూగుల్‌లో చూసి చెబుతామనే స్థితికి రాకూడదన్నారు. మన భాష సంస్కృతికి చుక్కాని లాంటిదని, అది మనతో ఆగిపోరాదన్నారు. శాసనాల సంరక్షణకు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు, ఉత్తరప్రత్యుత్తరాలన్నీ తెలుగుభాషలోనే ఇవ్వాలన్నారు. కలమల్ల శాసనాలకు మరింత గుర్తింపు తెచ్చేందుకు పర్యాటక కేంద్రంగా మార్చాలన్నారు. తెలుగు సాహిత్యానికి ప్రొద్దుటూరు పెట్టింది పేరన్నారు. అందుకు పెన్నానీరు కారణమై ఉండవచ్చన్నారు. అనేకమంది పండితులు ఈ ప్రాంతంలో ఉన్నారని, గొప్ప గొప్ప సాహిత్యాలు రాశారని తెలుగుభాషకు, తెలుగు రాష్ట్రాలకు గొప్ప పేరు తెచ్చారన్నారు. మనందరం తెలుగువాళ్లం, తెలుగులోనే మాట్లాడుదామని పిలుపునిచ్చారు. విజ్ఞానం అందరికి అందాలనే సంకల్పంతో వ్యవహారిక భాషా ఉద్యమానికి గిడుగు రామ్మూర్తి శ్రీకారం చుట్టారన్నారు. ఆయన పుట్టిన రోజును తెలుగుభాషా దినోత్సవంగా చేసుకోవడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి పంతులకు నివాళులర్పించారు.

పండితుల గడ్డ కడప : కలెక్టర్‌

కడప జిల్లాలో ఎంతోమంది పండితులు ఉన్నారని కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌ అన్నారు. పండితుల గడ్డ కడప అన్నారు. సుమతి శతకం రాసిన బద్దెన ఇక్కడి వాడే అన్నారు. సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమయ్యే రీతిలో నన్నెచోడుడు, వేమన, మొల్ల.. ఇలా అనేక మంది తెలుగు సాహిత్యానికి విశేషంగా కృషిచేశారన్నారు. తొలి తెలుగు శాసనాలు లభించిన చోటే తెలుగుభాషా దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి పిలవగానే ముఖ్యఅతిథిగా వచ్చిన వెంకయ్యనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక, ఆర్థిక విధానాలపై తెలుగును ఎలా సంస్కరించుకోవాలో ఆలోచించుకోవాలన్నారు. ప్రతి సబ్జెక్టులో తెలుగును ఎలా తీసుకురావాలో ఏవిధంగా తీసుకెళ్లాలో ఆలోచించాలన్నారు. తెలుగు భాషను పిల్లల ద్వారా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై దృష్టిపెట్టాలన్నారు. ముందుగా వారి పేర్ల అర్థాలు వారికి తెలిసేలా చేయాలన్నారు.

తెలుగు ఎంతో పవిత్రమైంది : ఆదినారాయణరెడ్డి

తల్లిపాలు ఎంత పవిత్రమో.. తెలుగు భాష కూడా అంతే పవిత్రమైనదని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు చదువుకుంటున్న రవారిలో 27శాతం మంది మాత్రమే తెలుగు చదివే వారు ఉన్నారన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో తెలుగులోనే చదివానన్నారు. కలమల్లలో క్రీ.శ.575లో చోళరాజులు శాసనాలు వేశారని అందుకే కలమల్ల ఇంతటి ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. కడప జిల్లా ఒకప్పుడు ఫ్యాక్షన జిల్లాగా ఉండేదని, ఇప్పుడు ఆ సంస్కృతి పోయిందన్నారు. కొప్పర్తిలో పరిశ్రమలు, జిల్లాకు పవర్‌ప్లాంట్లు వస్తున్నాయని వేలమందికి ఉపాధి దొరుకుతుందన్నారు.

కళకళలాడిన కలమల్ల

తొలి తెలుగు శాసనాలు వెలుగు చూసిన కలమల్ల గ్రామంలో గిడుగు రామ్మూర్తి 160వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం నిర్వహించడంతో ఈ గ్రామం గురువారం ఆద్యంతం కళకళలాడింది. బహుభాషా కోవిదుడు పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎమ్మెల్యే, కలెక్టర్‌ లాంటి అతిరథులు గ్రామానికి రావడంతో పెద్దఎత్తున స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పందిర్లు వేశారు. సభా ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. మహిళలు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్దఎత్తున సభా ప్రాంగణం వద్దకు చేరుకుని ప్రసంగాలు విన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గ్రామానికి చెందిన మహిళల కోలాటం, చిన్నారుల నృత్యాలు, కవితలు, పద్యాలాపన, పోతురాజు విన్యాసం, ఎన్టీయార్‌ పాటకు అభినయం వంటి కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సాహితీవేత్తలకు సన్మానం

తెలుగుభాషా దినోత్సవంలో భాగంగా జిల్లాకు చెందిన పలువురు సాహితీవేత్తలను వెంకయ్యనాయుడు సన్మానించారు. శతావధాని నరాల రామారెడ్డి, తవ్వా ఓబుల్‌రెడ్డి, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, డాక్టర్‌ బి.సంజీవమ్మ, షేక్‌ హుసేన సత్యాగ్ని తదితరులను శాలువా కప్పి, పూలమాల, జ్ఞాపికతో సత్కరించారు. అలాగే వెంకయ్యనాయుడును ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కలెక్టర్‌ శివశంకర్‌, భాషోపాధ్యాయ సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. గ్రామానికి చెందిన బీజేపీ, కూటమి నాయకులు సుబ్బరామయ్య, బాబు, తారకనాథరెడ్డి, రమణారెడ్డిలు వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో జేసీ అదితిసింగ్‌, డీఈవో అనురాధ, జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి, టీడీపీ ఇనచార్జి చదిపిరాళ్ల భూపేశరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి, డిప్యూటీ డీఈవో రాజగోపాల్‌రెడ్డి, ఎంపీడీవో భాగ్యలక్ష్మి, తహసీల్దార్‌ శోభనబాబు, సర్పంచి చిత్రాల హెబ్సీబా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి, ఓంటేరు శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు ముక్తియార్‌, ఈవీ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2024 | 11:52 PM

Advertising
Advertising