ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వసూళ్లలో ఆ సారు దిట్ట...!

ABN, Publish Date - Sep 21 , 2024 | 11:50 PM

ఆయనో జిల్లా అధికారి.. మామూళ్లు.. లంచాలు వసూలు చేయడంలో ఆయన దిట్టగా పేరుగాంచారు. అర్హతతో సంబంధం లేకుండా లక్ష రూపాయలు లంచం ఇచ్చిన వాళ్లకు ఏఈ (ఎంఐసీ) పోస్టులు అమ్ముకుంటున్నాడు. నెలనెలా తనకు ఇచ్చే మామూళ్లను తన కింద పని చేసే అటెండర్లు, కంప్యూటర్‌ ఆఫరేటర్ల ఫోన్‌పే నెంబర్లకు వేయించుకుంటాడు.

ఎన్నికల ఫలితాల రోజు లక్కిరెడ్డిపల్లె ఇసుక స్టాకు పాయింటు నుంచి ఇసుకను తరలిస్తున్న దృశ్యం (ఫైల్‌)

అర్హతతో పనిలేకుండా రూ.లక్ష కొడితే ఏఈ పోస్టు

కింది స్థాయి సిబ్బంది అకౌంట్లలోకి వసూళ్ల డబ్బు

విచారణకు వచ్చిన రెవెన్యూ అధికారిపై తిట్లపురాణం

కింది స్థాయి సిబ్బంది పరిస్థితి ఆ దేవుడెరుగు..

గత ప్రభుత్వంలో చక్రం తిప్పి.. ఇప్పుడూ కొనసాగుతూ...

(రాయచోటి-ఆంధ్రజ్యోతి): ఆయనో జిల్లా అధికారి.. మామూళ్లు.. లంచాలు వసూలు చేయడంలో ఆయన దిట్టగా పేరుగాంచారు. అర్హతతో సంబంధం లేకుండా లక్ష రూపాయలు లంచం ఇచ్చిన వాళ్లకు ఏఈ (ఎంఐసీ) పోస్టులు అమ్ముకుంటున్నాడు. నెలనెలా తనకు ఇచ్చే మామూళ్లను తన కింద పని చేసే అటెండర్లు, కంప్యూటర్‌ ఆఫరేటర్ల ఫోన్‌పే నెంబర్లకు వేయించుకుంటాడు. తనకు మామూళ్లు ఇవ్వని సిబ్బందిని తన ఇష్టానుసారం బదిలీలు చేసి.. బెదిరించి.. తన దారికి తెచ్చుకుంటాడు. ఈయన అక్రమాలపై అప్పట్లో జిల్లా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశిస్తే విచారణకు వచ్చిన ఓ రెవెన్యూ డివిజనల్‌ అధికారిపై పత్రికల్లో రాయలేని విధంగా తిట్లపురాణం అందుకున్నారు. రెవెన్యూ డివిజనల్‌ అధికారినే తిట్టాడంటే.. ఇక తన కింద పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది పరిస్థితి ఏంటో మనం ఇట్లే అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నాయకులతో.. సార్‌ నేను మీ వాడిని.. మీరు చెప్పినట్లే చేస్తా అని ఆ నాయకుల అక్రమాలకు వంత పాడి చక్రం తిప్పిన ఈయన... ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనూ.. సార్‌ నేను మీ వాడిని.. మీరు చెప్పినట్లు చేస్తా.. అంటూ ఇంకా కొనసాగుతున్నారు.. అన్నమయ్య జిల్లా ఏర్పడినప్పటి నుంచి జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌గా సాంబశివయ్య పనిచేస్తున్నారు. ఈయన బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఈయనపైన ఆనేక ఆరోపణలు ఉన్నాయి. సిబ్బందితో వ్యవహరించే తీరు సక్రమంగా లేదని పలువురు ఆరోపించారు. విధి నిర్వహణలోనూ సమర్థవంతంగా పనిచేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. సిబ్బంది నుంచి నెలనెలా మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన బాగోతంలో మచ్చుకు కొన్ని..

- జిల్లా వ్యాప్తంగా ఒక్కో ఏఈ, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ కనీసం రూ.10 వేలు మామూళ్లు సమర్పించుకోవాలి. ఈ డబ్బును తన బ్యాంకు అకౌంటు లేదా ఫోన్‌పే నెంబరుకు వేయించుకోడు. వివిధ మండలాల్లో పనిచేసే అటెండర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్ల ఫోన్‌పే నెంబర్లకు వేయిస్తాడు. తర్వాత వాళ్ల దగ్గర నుంచి క్యాష్‌ తీసుకుంటాడు. ఈ లెక్కన ఈయన సంపాదన సుమారు రూ.లక్షలకుపైనే ఉంటుందని గృహనిర్మాణ శాఖ సిబ్బందే గుసగుసలాడుతున్నారు. ఈయనకు మామూళ్లు ఇవ్వని వాళ్లపై బదిలీ అస్త్రం ప్రయోగిస్తాడు. దీంతో చచ్చినట్లు ఆయనకు మామూళ్లు సమర్పించుకోవాల్సిందేనని పలువురు సిబ్బంది వాపోతున్నారు. (జిల్లాలో పనిచేస్తున్న పలువురు అటెండర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్ల ఫోన్‌పే డీటైల్స్‌ పరిశీలిస్తే.. వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇంకా కొన్ని ఆయన కుటుంబ సభ్యుల అకౌంట్లలో వేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.)

- జిల్లాలో దాదాపు 40 మంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు అవుట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్నారు. ఒక్కో మండలానికి ఒక ఎంఐసీ (మండల ఇన్‌చార్జ్‌) ఉంటాడు. ఈ పోస్టుకు అర్హత బీటెక్‌, లేదా పాలిటెక్నిక్‌ చదవాలి. అయితే పలువురికి దొంగ సర్టిఫికెట్లతో ఎంఐసీ ఉద్యోగాలు ఇచ్చేశారు. గతంలో ఉన్న కలెక్టర్‌ ఈ సర్టిఫికెట్లపై విచారణ జరిపించి బోగస్‌ సర్టిఫికెట్లుగా గుర్తించి ఉద్యోగాలు ఇవ్వనీయకుండా నిలుపుదల చేయించారు. అయితే ప్రస్తుతం ఉన్న కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించి అనర్హులకు, తప్పుడు సర్టిఫికెట్లు ఉన్న వారికే మళ్లీ ఉద్యోగాలు ఇప్పించాడు. తెలివిగా కలెక్టర్‌తో సంతకం పెట్టించి.. తాను ఇరుక్కోకుండా నియామక పత్రాలు ఇప్పించినట్లు గృహ నిర్మాణ శాఖలో కోడై కూస్తోంది. ఇలా ఇప్పటికే కొందరి వద్ద రూ.లక్ష వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంకా మరో ముగ్గురికి ఇచ్చేందుకు ఫైల్‌ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇతని కాలంలో గృహనిర్మాణ శాఖలో జరిగిన అన్ని రకాల ఉద్యోగాల నియామకాలపై విచారణ జరిపించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

- గత ప్రభుత్వంలో పలువురు వైసీపీ నాయకులకు తలలో నాలుకలా మెలిగారనే ఆరోపణలు ఉన్నాయి. తనకు సంబంధం లేని విధుల్లోనూ జోక్యం చేసుకుని స్వయంగా మండల ఇన్‌చార్జ్‌లతో సంబంధాలు నెరిపాడనే ఆరోపణలు ఉన్నాయి. తన కింద పని చేసే ఈఈ, డీఈ స్థాయి అధికారులను కనీసం క్యాంపులకు వెళ్లకుండా చేసి డమ్మీలుగా చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా అధికారి క్యాంపుకెళ్లి క్షేత్రస్థాయిలో జరిగే అక్రమాలపై విచారిస్తే వెంటనే ఆ విషయాన్ని అప్పటి ఎమ్మెల్యేలకు చెప్పి ఆ అధికారులను బండబూతులు తిట్టించే వాడని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతనే వైసీపీ నాయకులకు ఎలా దోచుకోవాలో.? ఏం చేస్తే..డబ్బు మిగులుతుందో? చెప్పేవాడని సమాచారం. ఇందులో భాగంగానే గతంలో గాలివీడు, లక్కిరెడ్డిపల్లె మండలాలకు ఇసుక స్టాక్‌ పాయింట్‌ అవసరం లేకపోయినా అక్కడ పెట్టించాడు. ఆ ఇసుకను వైసీపీ నాయకులు కొందరు దర్జాగా అమ్ముకున్నారు. లక్కిరెడ్డిపల్లె మండలంలో ఎన్నికల ఫలితాల రోజు కొందరు వైసీపీ నాయకులు 120 ట్రాక్టర్లు తరలించారు. ఆ విషయం అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇంతవరకు ఈ సంఘటనపై ఎటువంటి విచారణ, కేసు నమోదు కాలేదు. ఇతను దాదాపుగా ఎక్కడికి క్యాంపులు వెళ్లడు. ఎప్పుడూ జిల్లా కార్యాలంయలోనే ఉంటాడని సిబ్బంది పేర్కొంటుంటారు. అయినా నెలనెలా కారు బాడుగ పేరుతో రూ.40 వేలు తీసుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.


నోరు తెరిస్తే..బూతులే

ఆయన నోరు తెరిస్తే అన్నీ బూతులే మాట్లాడతాడని గృహనిర్మాణశాఖ సిబ్బంది హడలిపోతున్నారు. ఈయన కింద పనిచేసే చిన్న స్థాయి ఉద్యోగులనే కాకుండా పెద్ద స్థాయి అధికారులను కూడా అందరి ముందూ.. లం.. కొ.. అంటూ తిడతాడని సిబ్బంది వాపోతున్నారు. నోటికి ఎంత మాట వస్తే.. అంత మాట ఆనేస్తాడని సిబ్బంది పేర్కొంటున్నారు. గతంలో ఆయనపైన వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. ఓ ఆర్డీవో విచారణకు వచ్చారు. దీనిపైన ఈ అధికారి ఆర్డీవోను.. లం....కొ.. అంటూ. అందరి ముందు తిట్టాడు. ఈ విషయం ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సదరు ఆర్డీవోతో పాటు కలెక్టర్‌ దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. ఈ విషయమై రెవెన్యూ ఉద్యోగులు రగిలిపోతున్నట్లు సమాచారం. ఈయన మీద గత ప్రభుత్వంలోనూ ఆరోపణలు వచ్చాయి. అయినా అతనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కొందరు ఎమ్మెల్యేల అండ ఉండడంతోనే అతనిపై చర్యలు తీసుకోలేదని పలువురు పేర్కొంటున్నారు. దీంతో ఈయన మరింత రెచ్చిపోయి ఎవరికి చెప్పినా.. నాకు ఏం కాదు.. పత్రికల్లో వచ్చినా..ఎవరూ ఏం చేయలేరు. అంటూ బహిరంగంగానే చెప్పేవాడని తెలిసింది. విజయవాడలోని ఎండీ కార్యాలయంలో కొందరు ఉన్నతాధికారుల సహకారం ఉండడంతోనే ఇతను చెలరేగిపోయేవాడని పలువురు ఆరోపిస్తున్నారు. విజయవాడలోని కొందరు అధికారులకు నెలనెలా తిరుపతి లడ్డు.. కల్యాణం వడలు, డబ్బు పంపిస్తాడని ఆరోపణలు ఉన్నాయి. కాబట్టే.. ఇతను కూటమి ప్రభుత్వం వచ్చినా.. ఇంకా జిల్లాలోనే ఉన్నాడని పలువురు పేర్కొంటున్నారు. ఇతనిపైన ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. వాళ్లపైన కక్ష కట్టి వేధిస్తాడని ఆ శాఖలోని సిబ్బంది భయపడుతున్నారు.

కొసమెరుపు: ఇతని విద్యార్హత పాలిటెక్నిక్‌. దీంతో ఇతను పీడీ పోస్టులో ఉండటానికి అర్హుడు కాదు. బీటెక్‌ చదివిన వాళ్లే అర్హులు.. అయినా ఇప్పటికీ ఇన్‌చార్జ్‌ పీడీగానే విధుల్లో ఉండటం గమనార్హం. దీనిపైన వివరణ కోసం ఆయన ఫోన్‌ నెంబర్‌కు ఆంధ్రజ్యోతి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు.

Updated Date - Sep 21 , 2024 | 11:50 PM