వీళ్లూ.. మారరంతే!
ABN, Publish Date - Sep 03 , 2024 | 12:05 AM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో ఉన్నతాశయంతో ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నారు. రవాణా, హ్యాండ్లింగ్ చార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు నదుల్లో వరద నీరు ఉండడంతో ఇంకా కొత్త రీచలు మొదలుపెట్టలేదు. దీంతో జిల్లా అంతటా కలసి రెండుచోట్ల మాత్రమే ఇసుక విక్రయ కేంద్రాలు ఉన్నాయి.
వైసీపీ పోకడలను అనుసరిస్తున్న కొందరు కూటమి నేతలు
సీఎం చంద్రబాబు వద్దు వద్దన్నా... ఇసుక, గ్రావెల్‌పై కన్ను
టిప్పర్, ట్రాక్టర్ల నుంచి అదనంగా రూ.3వేలు వసూళ్లు
వీఎనపల్లె, కొండాపురంలో కూటమి నేతల దందా
చంద్రబాబు ఆశయాన్ని నీరుగార్చుతున్న కూటమి నేతలు
సీరియ్‌సగా యాక్షన తీసుకోకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు
ఐదేళ్లు అఽధికారంలో ఉన్న వైసీపీకి భూకుంభకోణాలు, ఇసుక, మట్టి, రౌడీయిజం పెద్ద డ్యామేజీ. ఇవే ఆ పార్టీని ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టాయి. దీనిని గుణపాఠంగా తీసుకోవాల్సిన కొందరు కూటమి నేతలు.. వైసీపీ వారు చేసిన పనులనే ఆదర్శంగా తీసుకున్నారు. వక్రమార్గంలో నడుస్తున్నారు. ఇసుక టిప్పర్లు, ట్రాక్టర్ల నుంచి అదనంగా రూ.3వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దంటూ సీఎం చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్నా.. మేం ఇంతే.. మేం మారం అన్న రీతిలో కొందరు కూటమి నేతలు వ్యవహరించడం చూసి సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు.
(కడప-ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో ఉన్నతాశయంతో ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నారు. రవాణా, హ్యాండ్లింగ్ చార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు నదుల్లో వరద నీరు ఉండడంతో ఇంకా కొత్త రీచలు మొదలుపెట్టలేదు. దీంతో జిల్లా అంతటా కలసి రెండుచోట్ల మాత్రమే ఇసుక విక్రయ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా అవసరాలకు సరిపడా ఇసుక అందుబాటులో లేకపోవడం ఒక ఎత్తయితే రెండు కేంద్రాలే ఉండడంతో జిల్లా సరిహద్దుల్లోకి వెళ్లేసరికి రవాణా చార్జీ ఎక్కువ అవుతుంది. ఇలాంటి చోట కూడా కొందరు కూటమి నేతలు ఇసక అక్రమాలకు పాల్పడుతున్నారు. వీఎనపల్లె, కొండాపురంలో ఇసుక రీచలు, స్టాకు పాయింట్ల వద్ద టిప్పరు, లారీలకు అదనంగా రూ.3వేలు వసూలు చేస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో గాడి తప్పిన రాషా్ట్రన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు చంద్రబాబునాయుడు రేయింబవళ్లు కష్టపడుతుంటే కొందరు కూటమి నేతలు చేసే పనులు పార్టీకి తీరని నష్టం చేకూరుస్తున్నాయని పలువురు టీడీపీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మేమింతే
వీరపునాయునిపల్లె మండలంలోని సంగమేశ్వరదేవస్థానం సమీపంలో వీరబల్లె ఇసుక స్టాకు పాయింటు వద్ద అధికార పార్టీ నాయకుల చిలక్కొట్టుడుపై ఇటీవలే ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. కలెక్టరు శివశంకర్ సీరియస్ కావడంతో హుటాహుటిన అధికార యంత్రాంగం అక్కడికి వెళ్లింది. ఓ వీఆర్వో మేం డబ్బులు ఇవ్వలేదు.. అనే అర్జీని ముందుగానే తయారు చేసుకుని దానిపై టిప్పరు డ్రైవర్లతో సంతకాలు పెట్టించుకున్నారు. రెండు మూడురోజుల పాటు అదనపు వసూళ్లు నిలిపివేశారు. తిరిగి సోమవారం నుంచి మొదలుపెట్టారు. ఇసుక బుకింగ్ స్టాకు పాయింట్ వద్ద కాకుండా అనిమెల సచివాలయంలో బుక్ చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో కూటమి నేతలు సచివాలయం వద్ద మకాం వేసి ఇసుక కోసం వచ్చినవారి నుంచి ఆధార్‌కార్డులు తీసుకుని మీరు అక్కడికి వెళ్లిపోండి, మేమే కూపన్లు తీసుకువస్తాం అని చెబుతున్నారు. ప్రభుత్వానికి టన్నుకు రూ.340 వంతున చెల్లిస్తారు. టిప్పరుకు 21 టన్నులు ఇసుక వేస్తారు. ఒక్కో టిప్పురుకు అదనంగా రూ.2వేల నుంచి రూ.3వేలు తీసుకుంటున్నారు. కడప, కమలాపురం, పులివెందులకు వెళ్లే వాహనాలకు అయితే రూ.2వేలు మైదుకూరు, బద్వేలు, పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన, ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, కొమ్మరోలు, మార్కాపురం వెళ్లే వాహనాలకు రూ.3వేలు పైచిలుకు వసూలు చేసినట్లు చెబుతున్నారు. వారికి 2వేలు, మాకు 3వేలు ఏంటని కొందరు అడిగితే... మీ దగ్గర ఇసుక ధర ఎక్కువ అందుకే అని చెబుతున్నారు. ఆదివారం సాయంత్రమే ఓ అధికారి టిప్పర్ల యజమానుల నుంచి అదనంగా డబ్బులు తీసుకుని కూపన్లు ఇచ్చారని సమాచారం. ఈ విషయం కూటమి నేతలకు తెలియడంతో వీరూ అదేపని మొదలు పెట్టారు. ఓ మండల కీలక నేత సుమారు 40 కూపన్లు రాయించుకున్నట్లు చెబుతున్నారు. ఈయనకు ఒక్కరికే సోమవారం సుమారు లక్షకు పైగా జేబులోకి వెళ్లిందంటారు.
కొండాపురంలోనూ ఇంతే
కొండాపురంలోని ఏటూరు వద్ద వారం కిందటే ఇసుక రీచ ప్రారంభం అయింది. ఏటూరు వద్ద 5,600 టన్నుల ఇసుక ఉండగా, పి.అనంతపురం స్టాకు పాయింటులో 2,100టన్నులు ఉంది. ఇక్కడ కూడా వీఎనపల్లె తరహాలోనే కూటమి నేతలు రూ.3వేలు వసూలు చేస్తున్నారని అంటున్నారు. టిప్పరు, లారీకి అదనంగా రూ.3వేలు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. డబ్బులు కడితేనే కూపన్లు ఇస్తున్నారు. జిల్లాలో కేవలం ఈ రెండు చోట్లనే ఇసుక లభ్యత ఉంది. జిల్లా సరిహద్దు అయిన కలసపాడు, పోరుమామిళ్ల, కాశినాయన, బద్వేలు, గోపవరం ప్రాంతాలకు వెళ్లేసరికి రవాణా చార్జీతో కలిపి సుమారు రూ.35వేలకు పైగా పడుతుంది. అయితే ఇప్పుడు కూటమి నేతలు వేసిన ట్యాక్స్ జనాలకు భారంగా మారుతోంది. కడపలో టిప్పరు ఇసుక ఇప్పుడు రూ.21వేలకు చేరింది.
చర్యలు తీసుకోవాల్సిందే
చంద్రబాబు ప్రభుత్వంపై జనాల్లో సానుకూలత ఉంది. మరింత ఫీల్ గుడ్ కోసం చంద్రబాబు కష్టపడుతుంటే కొందరు కూటమి నేతలు చిల్లర పనులు చేస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తున్నారు. వేటిల్లో వేలు పెడితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందో వాటిల్లోనే వేలు పెట్టి సొంత జేబులు నింపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే చెడ్డపేరు వస్తుంది. అటు పార్టీ పరంగా చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమాలను ప్రోత్సహిస్తున్న అధికారుల తీరుకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - Sep 03 , 2024 | 12:05 AM