Kesineni Swetha: టీడీపీకి రాజీనామా ప్రకటించడంపై కేశినేని శ్వేత ఎమోషనల్ పోస్ట్
ABN, Publish Date - Jan 08 , 2024 | 04:01 PM
తెలుగుదేశం పార్టీకి (TDP) రాజీనామా చేస్తానంటూ సోమవారం ఉదయం ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత ‘ఎక్స్’ వేదికగా తొలిసారి స్పందించారు. ‘‘ టీడీపీతో నా ప్రయాణం ముగిసిందని బరువెక్కిన హృదయంతో తెలియజేస్తున్నాను. నాకు మార్గనిర్దేశనం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు సార్‌కి, లోకేశ్ అన్నకి ధన్యవాదాలు’’ అని అన్నారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీకి (TDP) రాజీనామా చేయబోతున్నట్టు సోమవారం ఉదయం ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత ‘ఎక్స్’ వేదికగా తొలిసారి స్పందించారు. ‘‘ టీడీపీతో నా ప్రయాణం ముగిసిందని బరువెక్కిన హృదయంతో తెలియజేస్తున్నాను. నాకు మార్గనిర్దేశనం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు సార్‌కి, లోకేశ్ అన్నకి ధన్యవాదాలు. ప్రేమాభిమానంతో మద్ధతుగా నిలుస్తున్న విజయవాడ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. కేశినేని నాని కార్యాలయం ద్వారా నా సేవలను కొనసాగిస్తాను’’ అని ఆమె ‘ఎక్స్’లో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా నాలుగు ఫొటోలను ఆమె షేర్ చేశారు. రెండు ఫొటోల్లో చంద్రబాబు పక్కన శ్వేత కనిపించారు. మరో ఫొటోలో చంద్రబాబు, కేశినేని నాని, శ్వేత ఒకేచోట మాట్లాడుతూ కనిపించారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో ఉన్న మరో ఫొటోని ఆమె పంచుకున్నారు. ఈ ఫొటో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఇదిలావుండగా కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత సోమవారం ఉదయం రాజీనామా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 11వ డివిజన్ కార్పొరేటర్‌గా రాజీనామా చేశానని, రాజీనామా ఆమోదం పొందాక టీడీపీకి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. తాము ఎప్పుడూ టీడీపీని వీడాలని భావించలేదని, పార్టీయే తమను వద్దనుకున్నప్పుడు కొనసాగడం సబబుకాదని ఆమె వ్యాఖ్యానించారు. ఇక కేశినేని నాని (MP Kesineni Nani) కూడా టీడీపీకి రాజీనామా చేశాక కార్యకర్తలతో మాట్లాడి భవిషత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆమె తెలిపారు.
Updated Date - Jan 08 , 2024 | 04:55 PM