లైన్ క్లియర్
ABN , Publish Date - Jul 25 , 2024 | 12:41 AM
ఆర్థిక బడ్జెట్‌లో రాజధానికి ప్రాధాన్యమిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ మరనాడే అమరావతి రైల్వేకు వరాలు కురిపించింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అమరావతి రైల్వేలైనుకు పచ్చజెండా ఊపడంతో పాటు విజయవాడ రైల్వేస్టేషన్ రీ డెవలప్‌మెంట్‌కు అంగీకరించడంపై రాజధానివాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

రూ.2,047 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం
56 కిలోమీటర్ల నిడివి కలిగిన డీపీఆర్ పూర్తి
ప్రాజెక్టుకు నీతి ఆయోగ్ అనుమతి
ఎంపీ కేశినేని చిన్ని ప్రశ్నకు సమాధానం
అమరావతి స్టేషన్ ఏర్పాటుకు చర్యలు
విజయవాడ స్టేషన్ రీ డెవలప్‌మెంట్‌కు రెడీ
విజయవాడ-గూడూరు థర్డ్‌లైన్ పనులకు రూ.500 కోట్లు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అమరావతి నూతన రైల్వేలైనుకు కదలిక వచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.2,047 కోట్లు కేటాయించింది. మొత్తం 56 కిలోమీటర్ల నిడివితో కూడిన లైనుకు సంబంధించి డీపీఆర్ కూడా పూర్తయింది. ఈ ప్రాజెక్టుకు నీతి ఆయోగ్ అనుమతించింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ విషయాన్ని బుధవారం విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఆనంద్ పాటిల్ తెలిపారు. రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు, తెలుగు రాష్ర్టాల డీఆర్‌ఎంలతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ర్టానికి సంబంధించిన కేటాయింపులను వివరించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డీఆర్‌ఎం నరేంద్ర ఆనంద్ పాటిల్ మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఏపీకి రూ.9,152 కోట్ల కేటాయింపులు జరిపారని తెలిపారు. విజయవాడ-గూడూరు థర్డ్‌లైన్‌లో భాగంగా విజయవాడ నుంచి గుంటూరు వరకు నిర్మిస్తున్న మూడో లైన్ పనులు పురోగతిలో ఉన్నాయని, ఈ పనుల కోసం రూ.500 కోట్లు కేటాయించారని చెప్పారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా విజయవాడ డివిజన్‌లో 23 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. విజయవాడ రైల్వేస్టేషన్ అభివృద్ధికి ప్రణాళికలు జరుగుతున్నాయన్నారు. ఆగస్టు 10 నాటికి అవసరమైన చోట పాసింజర్ రైళ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఐఆర్‌సీటీసీ నేతృత్వంలో వంటశాలల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోందని, విజయవాడ పరిధిలో 27 వంటశాలలు ఏర్పాటు చేస్తారని చెప్పారు. పూర్తిస్థాయిలో విద్యుదీకరణ, జనరల్ బోగీల తయారీకి జనరల్ బడ్జెట్‌లో కేటాయింపులు చేయటం జరిగిందన్నారు.
50 ఏళ్లకు అనుగుణంగా రైల్వేస్టేషన్ అభివృద్ధి
ఎంపీ కేశినేని చిన్ని బుధవారం పార్లమెంట్‌లో అమృత్ భారత్ పథకానికి సంబంధించి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ మరిన్ని వివరాలు వెల్లడించారు. అమృత్ భారత్ స్టేషన్ కింద విజయవాడ రైల్వేస్టేషన్‌ను రీ-డెవలప్ చేయటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రద్దీగా ఉండే విజయవాడ రైల్వేస్టేషన్‌ను రాబోయే 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించా మన్నారు. అభివృద్ధి పనులతో పాటు అమరావతి రైల్వేస్టేషన్ నిర్మాణ పనులు కూడా ఒకేసారి చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తు న్నామన్నారు.