మమేకమై..
ABN, Publish Date - Dec 21 , 2024 | 01:07 AM
ఓవైపు రైతులు.. మరోవైపు విద్యార్థులు.. ఇంకోవైపు స్థానికులు.. ఇలా ప్రతి ఒక్కరి సమస్యలు సావదానంగా వింటూ, పరిష్కార మార్గాలను చూపిస్తూ, నేనున్నాననే భరోసానిస్తూ జిల్లాలో శుక్రవారం సీఎం చంద్రబాబు పర్యటన సాగింది. గంగూరులోని రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించి, ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించి, ఈడుపుగల్లులోని రెవెన్యూ సదస్సులో పాల్గొని.. ప్రధానమైన సమస్యలను ప్రస్తావించిన సీఎం వాటికి పరిష్కార మార్గాలను చూపించారు. ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సమస్యలు వింటూ.. సావదానంగా పరిష్కరిస్తూ..
పెనమలూరులో సీఎం చంద్రబాబు పర్యటన
గంగూరు రైతుసేవా కేంద్రం, రైస్‌మిల్ పరిశీలన
కంకిపాడు మండలంలో రెవెన్యూ సదస్సు.. అర్జీల స్వీకరణ
ధాన్యం తేమశాతంలో వ్యత్యాసాలు రాకుండా చర్యలు
రైతులతో ముఖాముఖీ మాట్లాడి ఆపన్నహస్తం
గంగూరు రైతుసేవా కేంద్రంలో తనిఖీలు
రైతులకు ఇబ్బంది కలిగించొద్దంటూ అధికారులకు ఆదేశాలు
ధనేకుల ఇంజనీరింగ్ కాలేజీలో సీఎం సందడి
మచిలీపట్నం/కంకిపాడు, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు, రైతుసేవా కేంద్రంలో పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పరిశీలించారు. తొలుత ఆయన పెనమలూరు మండలంలోని గంగూరు రైతుసేవా కేంద్రానికి చేరుకున్నారు. అక్కడి రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా రైతులు సీఎంతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే ఖాతాల్లో నగదు జమ అవుతోందన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగటంతో ఖర్చులు తగ్గుతున్నాయని, దిగుబడులు పెరుగుతున్నాయని తెలిపారు. యంత్రాల ద్వారా వరికోతలు కోయటంతో ఎకరాకు ఐదారువేల ఖర్చులు కలిసొస్తున్నాయని, వరిగడ్డిని వృథా చేయకుండా బయోఫ్యూయల్ ప్లాంట్‌కు విక్రయిస్తే ఎకరాకు రూ.5 వేల వరకు ఆదాయం వస్తుందని సీఎం తెలిపారు. ధాన్యానికి సకాలంలో నగదు జమ అవుతుందా, లేదా అనే అంశంపై రైతుల నుంచి ముఖ్యమంత్రి వివరాలు రాబట్టారు. రైతుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
రైతుసేవా కేంద్రం పరిశీలన
గంగూరులోని రైతుసేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన షెడ్యూలింగ్‌ను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన ధాన్యం ఎంతమేర దిగుబడి వచ్చిందో కూడా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. తేమశాతం కొలిచే విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. తేడాలు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుసేవా కేంద్రంలో వీఏవో లాగిన్‌ను ఓపెన్ చేసి ఆకునూరి సాంబశివరావు అనే రైతు ధాన్యం విక్రయాలకు సంబంధించిన వివరాలను నమోదు చేయించారు. రైతులకు సంచుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గంగూరులోని వెంకటాద్రి రైస్‌మిల్‌ను సీఎం పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మిల్లులో తేమశాతం లెక్కింపు పరికరాన్ని తనిఖీ చేశారు. నమోదవుతున్న పాయింట్లకు, రైస్‌మిల్లులో నమోదువుతున్న తేమశాతానికి తేడాలు వస్తున్నాయనే అంశంపై రైతుల నుంచి ఫిర్యాదులు చేస్తున్నాయని, ఈ సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. వేబ్రిడ్జి వద్ద కాటా వేసే విధానం, ఎస్టీవో జనరేట్ చేయటం, మిల్లుకు ఎంత ధాన్యం వచ్చింది, నగదు చెల్లింపు ఎంత.. తదితర వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్యాకింగ్ చేసే విధానాన్ని కూడా పరిశీలించారు.
ఈడుపుగల్లులోని స్థలాలను 22ఏ నుంచి తొలగిస్తాం
ఈడుపుగల్లు పంచాయతీలోని బీసీ కాలనీలో 176 మందికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారని, వీటిని 22ఏలో చేర్చి ప్రభుత్వ భూమి అని చెబుతున్నారని, ఈ స్థలాలను కచ్చితంగా 22ఏ జాబితా నుంచి తొలగించి చట్టపరంగా పట్టాలు అందజేస్తామని సీఎం తెలిపారు. వీరమాచనేని బేబీసరోజినీ, పర్వతనేని శ్రీకృష్ణ జగన్మోహనరావు, యార్లగడ్డ మాధురి తదితరులు తమ భూములకు సంబంధించి రీ సర్వే జరిగిన సమయంలో భూమి తక్కువగా చూపారని, వాటిని సరిచేయాలని అర్జీలు అందజేశారని, ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, వర్ల కుమార్‌రాజా, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, వ్యవసాయశాఖ కార్యదర్శి వీరపాండియన్, కమిషనర్ జిలానీ, రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ ధిల్లీరావు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్, కలెక్టర్ బాలాజీ, జేసీ గీతాంజలిశర్మ, డీఎస్‌వో పార్వతి, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, పౌరసరఫరాలశాఖ డీఎం పద్మాదేవి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు పిన్నమనేని వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
మీడియాతో చిట్‌చాట్
గంగూరులోని ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో హెలిప్యాడ్ వద్ద ఏర్పాటుచేసిన బసలో సీఎం మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ఈ ఏడాది ఐదు కోట్ల సంచులు సమకూర్చాల్సి ఉందని, కానీ 3.83 కోట్ల సంచులే అధికారులు సమకూర్చారని, దీంతో సంచుల కొరత ఏర్పడినట్లు తాను గ్రహించానన్నారు. ధాన్యం రవాణాలో జీపీఎస్ పద్ధతిని పూర్తిస్థాయిలో అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో 394 డ్రయ్యర్ సౌకర్యం ఉన్న మిల్లులు మాత్రమే ఉన్నాయని, దీంతో యంత్రాలతో కోసిన ధాన్యం ఒకేసారి మిల్లులకు వస్తే సామర్థ్యం చాలక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. హార్వెస్టర్‌తో రైతులు అధికంగా వరికోతలు కోస్తున్నారని, కోత సమయంలోనే ధాన్యంలో తేమశాతం తగ్గించేలా నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందో లేదో పరిశీలిస్తామన్నారు. మొబైల్ డ్రయ్యర్లను అందుబాటులోకి తెచ్చి ధాన్యంలో తేమశాతం తగ్గించేందుకు ప్రయత్నిస్తామన్నారు. 1262 రకం ధాన్యాన్ని మిల్లర్లు కొనట్లేదని, గత ఏడాది కృష్ణాజిల్లాలో 3,800 హెక్టార్లలో ఈ రకం సాగుచేస్తే ఈ ఏడాది 31,862 హెక్టార్లలో సాగు చేశారని, ఈ రకం వరి వంగడాలను సాగుచేసే అంశంపై రైతులు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. డ్రోన్‌ల ద్వారా వరిలో పురుగు మందుల పిచికారీని త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు.
పట్టిసీమ ద్వారా ముందే సాగునీరందిస్తాం
వాతావర ణ పరిస్థితులు, సాగుకు అనుకూలమైన కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్‌లో ముందే వరినాట్లు వేసేందుకు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణాడెల్టాకు సాగునీటిని అందిస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. తుఫాన్లు, భారీవర్షాలు సంభవించినప్పుడు వరి నేలవాలుతోందని, దీంతో దిగుబడులు తగ్గుతున్నాయన్నారు. ఇక నుంచి వరి పైరుకు తెగులు సోకితే సెల్‌ఫోన్‌లో ఫొటో తీస్తే ఏ రకం పురుగుమందు వాడాలో తెలిపే సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందన్నారు.
Updated Date - Dec 21 , 2024 | 01:07 AM