‘సూర్య ఘర్’తో ప్రతి ఇంటికీ ఆర్థిక స్వావలంబన
ABN, Publish Date - Dec 22 , 2024 | 01:05 AM
ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి ఇంటా సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ పథకంతో ఆర్థిక స్వావలంబన వెలుగులు నిండాలని, పఽథకాన్ని సద్వినియోగం చేసుకుని భావితరాలకు ఆరోగ్యకర పర్యావరణాన్ని వారసత్వ సంపదగా అందిద్దామని ప్రజలకు కలెక్టర్ జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు.
పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పిలుపు
వన్‌టౌన్, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి ఇంటా సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ పథకంతో ఆర్థిక స్వావలంబన వెలుగులు నిండాలని, పఽథకాన్ని సద్వినియోగం చేసుకుని భావితరాలకు ఆరోగ్యకర పర్యావరణాన్ని వారసత్వ సంపదగా అందిద్దామని ప్రజలకు కలెక్టర్ జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డీఆర్డీయే, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలకు పీఎం సూర్య ఘర్ పథకంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ పథకం కింద రూ.2లక్షల విలువైన 3 కేడబ్ల్యూ సోలార్ ప్యానెల్‌ను రూ.78వేల రాయితీతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రూ.20 వేలు లబ్ధిదారు వాటా పోనూ మిగిలిన మెత్తాన్ని తక్కువ వడ్డీతో బ్యాంకు రుణంగా పొందొచ్చన్నారు. నాలుగైదేళ్లలోనే పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని, 20 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్ పొందొచ్చని తెలిపారు. అవసరాలకు సరిపోయాక, మిగిలిన సౌరవిద్యుత్‌ను గ్రిడ్‌కు ఇవ్వడం ద్వారా యూనిట్‌కు రూ.2.09 ఆదాయం పొందొచ్చన్నారు. గత మూడు నెలల్లో జిల్లాలో సూర్య ఘర్ కనెక్షన్లకు విద్యుత్ సంస్థలు రూ.22 లక్షలు చెల్లించాయని వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 601 సూర్య ఘర్ కనెక్షన్లు ఉన్నాయని, వీటిని రెండు లక్షలకు చేర్చి పథకం అమల్లో జిల్లాను నంబర్ 1గా నిలపాలని, ఇందులో స్వయం సహాయక సంఘాల మహిళా శక్తి కీలక భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. 200 యూనిట్లలోపు ఉచిత్ విద్యుత్ పొందుతున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సూర్య ఘర్ పథకం కింద ఉచితంగా సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటుకు చేస్తామన్నారు. సొంత ఇల్లు, విద్యుత్ కనెక్షన్ ఉన్నవారెవరైనా సూర్య ఘర్ వెబ్‌సైట్‌లో సులభంగా రిజిస్ర్టేషన్ చేయించుకోవచ్చన్నారు. సమీప సచివాలయం లేదా విద్యుత్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ పథకం కింద రిజిస్ర్టేషన్ చేయించుకునేందుకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డీఆర్డీయే పీడీ కె.శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ జిల్లా ఎస్‌ఈ ఎ.మురళీమోహన్, సూర్య ఘర్ నోడల్ అధికారి ఎం.భాస్కర్ పాల్గొన్నారు.
Updated Date - Dec 22 , 2024 | 01:05 AM