తొలిరోజు సజావుగా..
ABN, Publish Date - Dec 22 , 2024 | 12:57 AM
ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం తొలిరోజు శనివారం సజావుగా సాగుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ
భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యం
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా నిరంతర పర్యవేక్షణ: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
వన్‌టౌన్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం తొలిరోజు శనివారం సజావుగా సాగుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్ లక్ష్మీశ భవానీ దీక్షల విరమణల కార్యక్రమాన్ని పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా చేసిన ఏర్పాట్లు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఆయన తెలిపారు. మోడల్ గెస్ట్‌హౌ్‌సలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించి, సీసీటీవీలు, డ్రోన్ విజువల్స్‌ను పరిశీలించారు. క్యూలైన్లను పరిశీలించి, భవానీ భక్తులతో ఏర్పాట్లపై మాట్లాడారు. చిన్నారులు తప్పిపోతే జాడను వెంటనే తెలుసుకునేందుకు దుర్గమ్మ ఆలయం అందుబాటులోకి తెచ్చిన చైల్డ్ మానిటరింగ్ సిస్టమ్(సీఎంఎస్) పనితీరును ఆయన పరిశీలించారు. స్వయంగా చిన్నారుల చేతికి క్యూ ఆర్ కోడ్ బ్యాండ్ వేశారు. ఘాట్లు, క్యూలైన్లు, హోమగుండాలు, గిరిప్రదక్షిణ, అన్నప్రసాదం పంపిణీ పాయిం ట్ల వద్ద రద్దీని, భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని, జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. డ్రోన్ దృశ్యాలను నిరంతరం పరిశీలిస్తూ పరిస్థితులను చక్కదిద్దుతున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సూచిక బోర్డులు, పబ్లిక్ అడ్రెసింగ్ వ్యవస్థ ద్వారా నిరంతర సూచనలు ఇస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
భవానీలకు సకల ఏర్పాట్లు
భవానీపురం: సుదూర ప్రాంతాల నుంచి భవానీ దీక్షల విరమణకు వచ్చిన భక్తులకు దేవాదాయశాఖ, వీఎంసీ అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. తొలిరోజు రద్దీ తక్కువగా ఉండడంతో పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం కృష్ణవేణి, పద్మావతి ఘాట్ల వద్ద భవానీల రద్దీ లేదు. జల్లుస్నానాలను భక్తులు సాఫీగా చేశారు. ఘాట్ల వద్దనే పిల్లర్ నుంచి పిల్లర్‌కు 100 అడుగుల నుంచి 200 అడుగులకు ఒక శానిటరీ ఇన్‌స్పెక్టర్, 15 మందికిపైగా పారిశుధ్య సిబ్బందిని నియమించారు. ఘాట్లలో వ్యర్థాలను ప్లాస్టిక్ డబ్బాల్లోకి నింపి, వెంటనే మెయిన్‌రోడ్డుపై సిద్ధంగా ఉంచిన ట్రాక్టర్లలో నింపి, డంప్ యార్డుల్లోకి తరలించారు. ఎక్కడక్కడే ఎరుపురంగు దుస్తులను వదిలేయడంతో వాటిని పారిశుధ్య సిబ్బంది ప్లాస్టిక్ డబ్బాల్లోకి ఎత్తి మరో ట్రాక్టర్లలోకి ఎక్కిస్తున్నారు. ఘాట్ల వద్ద హోంగార్డు, మహిళా సిబ్బంది, ఎస్‌ఐలు అడుగడుగనా జల్లెడ పడుతుండటంతో భక్తుల రాకపోకలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఘాట్ల వద్ద, ప్రకాశం బ్యారేజీ, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, బస్టాండ్, రైల్వేస్టేషన్, మార్కెట్ల వద్ద రూట్లను తెలిపే సూచికలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయడంతో భవానీలు గమ్యస్థానాలకు చేరుకోవడం సులభం అయ్యింది.
Updated Date - Dec 22 , 2024 | 12:57 AM