ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శివార్పణం

ABN, Publish Date - Dec 21 , 2024 | 01:10 AM

దక్షిణ కాశీగా వెలుగొందుతూ, కోట్లాది రూపాయల ఆస్తులున్న ఆలయాన్ని దేవదాయ శాఖ దత్తత ఇవ్వటం అనుమానాలను రేకెత్తిస్తోంది. జగ్గయ్యపేట సమీపంలోని ముక్త్యాల కోటిలింగ క్షేత్రాన్ని దత్తత పేరుతో గుంటూరు జిల్లా తాళ్లయపాలేనికి చెందిన శైవక్షేత్రానికి అప్పగించటం పట్ల భక్తులు అవాక్కవుతున్నారు.

ముక్త్యాల ఆలయం

ముక్త్యాల కోటిలింగ క్షేత్రం ధారాదత్తం

తాళ్లయపాలెంకు చెందిన శైవక్షేత్రానికి అప్పగించటంపై విమర్శలు

కోట్లాది రూపాయల ఆస్తులు... దండిగా కానుకలు

ఉత్తర కాశీగా ప్రాచుర్యం

వైసీపీ హయాంలో అప్పటి ఏసీ శాంతి సహకారంతో స్కెచ్‌

కూటమి ప్రభుత్వం వచ్చాక ఆచరణ

(ఆంధ్రజ్యోతి-జగ్గయ్యపేట రూరల్‌) : దక్షిణ కాశీగా వెలుగొందుతూ, కోట్లాది రూపాయల ఆస్తులున్న ఆలయాన్ని దేవదాయ శాఖ దత్తత ఇవ్వటం అనుమానాలను రేకెత్తిస్తోంది. జగ్గయ్యపేట సమీపంలోని ముక్త్యాల కోటిలింగ క్షేత్రాన్ని దత్తత పేరుతో గుంటూరు జిల్లా తాళ్లయపాలేనికి చెందిన శైవక్షేత్రానికి అప్పగించటం పట్ల భక్తులు అవాక్కవుతున్నారు. 2006లో కంచికచర్లకు చెందిన దాత గద్దె ప్రసాద్‌ 46 ఎకరాల విస్తీర్ణంలో కోట్ల వ్యయంతో కామాక్షి సమేత పంచముఖ అమృతలింగేశ్వరస్వామి, విఘ్నేశ్వరస్వామి ఆలయాలతో పాటు భారీ ముఖ మండపం, నాలుగు ధ్వజస్తంభాలను నిర్మించారు. దానికి అనుసంధానంగా 108 ఉపాలయాలను ఏర్పాటుచేశారు. సమీపంలోనే కోనేటి రాయుడు, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. కృష్ణానది ఉత్తరవాహిని క్షేత్రం ముక్త్యాలకు మణిహారంగా ఉన్న ఈ ఆలయం గద్దె ప్రసాద్‌ హయాంలో నిర్వహణ కష్టంగా మారటంతో 2009లో దేవదాయ శాఖకు అప్పగించారు. నేటి వరకు ఆలయం ఆ శాఖ ఆధీనంలో ఉంది. రూ.45 లక్షల వార్షిక ఆదాయం, రూ. 1.60 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, 46 ఎకరాల సువిశాల ప్రాంగణాన్ని.. దత్తత పేరుతో ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేయటంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఆలయాలను నిర్వహించే దేవదాయ శాఖ ఈ ఆలయాన్ని అభివృద్ధి పరచలేదా, నిర్వహించలేదా అని చర్చించుకుంటున్నారు.

రూ.కోట్ల విలువైన క్షేత్రంపై కన్ను?

ముక్త్యాలలోని కోటిలింగ హరిహర మహాక్షేత్రం ప్రారంభ తొలిదశలో గద్దె ప్రసాద్‌, శివస్వామి పర్యవేక్షణలోనే శంకుస్థాపన జరిగింది. అనంతరం శివస్వామి తాళ్లాయపాలెంలో సొంత క్షేత్రం ఏర్పాటు చేసుకున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముక్త్యాల కోటిలింగ క్షేత్రంపై కన్నేసిన వ్యక్తులు తమకున్న లావాదేవీలతో అప్పటి ఏసీ, సస్పెండ్‌ అయిన శాంతి సహకారంతో రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా వివిధ మార్గాల్లో ఆలయాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదని సమాచారం. తాజాగా కూటమి ప్రభుత్వం రాగానే అంగ, అర్ధబలంతో ఈ ఆలయాన్ని దత్తత పేరుతో స్వాధీనం చేసుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దత్తత కార్యక్రమం జరిగేందుకు రూ.లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు సైతం నెలకొన్నాయి. దేవదాయ శాఖ ఇంతకన్నా అధ్వానంగా ఉన్న ఆలయాలను నిర్వహిస్తున్నా... మంచి రాబడి ఉండి ఉత్తర కాశీగా వెలుగొందుతున్న ఈ క్షేత్రాన్ని దత్తత ఇవ్వటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దత్తత అంశంపై పాలకులు, అధికారులు పునరాలోచన చేయాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - Dec 21 , 2024 | 01:10 AM