Supreme Court: తిరుమల లడ్డూపై నేడు సుప్రీం కోర్టు విచారణ
ABN, Publish Date - Oct 04 , 2024 | 09:41 AM
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తునే కొనసాగించాలా.. లేక కేంద్రం విచారణ జరిపించాలా అన్న అంశంపై సస్పెన్స్ శుక్రవారం వీడనుంది.
అమరావతి: తిరుమల లడ్డూ (Tirumala laddu) కల్తీ నెయ్యి వ్యవహారంపై శుక్రవారం సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, (Justice BR Gavai) జస్టిస్ కేవీ విశ్వనాథన్ (Justice KV Viswanathan) ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రచయిత సంపత్ విక్రమ్, ఓ టీవీ ఛానల్ ఎడిటర్ సురేష్ ఖండేరావు చౌహాన్కే దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. సిట్ దర్యాప్తు కొనసాగాలా లేక కేంద్ర దర్యాప్తు సంస్థలకు విచారణ అప్పగించాలా అన్న విషయంపై కేంద్రం తన వైఖరి తెలియజేయనుంది. గురువారం నాడు జరిగిన విచారణ సందర్భంగా శుక్రవారం వరకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమయం కోరారు.
కాగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తునే కొనసాగించాలా.. లేక కేంద్రం విచారణ జరిపించాలా అన్న అంశంపై సస్పెన్స్ శుక్రవారం వీడనుంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని శుక్రవారం చెబుతామని, అప్పటివరకు సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టును కోరారు. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఇందుకు అంగీకరించింది. శుక్రవారం దీనిని తొలి కేసుగా విచారిస్తామని తెలిపింది. వాస్తవానికి గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ కేసు విచారణకు రావలసింది. దానికి కొద్ది నిమిషాల ముందు తుషార్ మెహతా హాజరై ధర్మాసనం అనుమతిస్తే శుక్రవారం ఉదయం కచ్చితంగా 10.30 గంటలకు తన స్పందన తెలియజేస్తానని అన్నారు.
రాష్ట్రం వేసిన సిట్‌ను మరికొందరు అధికారులతో విస్తరించాలా.. లేక సీబీఐ తరహాలో కేంద్ర ప్రభుత్వంతో దర్యాప్తు జరిపించాలా అన్న అంశంపై మెహతా తన అభిప్రాయం వెల్లడించనున్నారు. సుప్రీంకోర్టు ఏ రకమైన దర్యాప్తునకు ఆదేశించినా తమకు అభ్యంతరం లేదనే ఆయన చెప్పే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో తలమునకలై ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను గురువారం రాత్రి సంప్రదించిన తర్వాత మెహతా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిర్ధారిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కాగా తిరుపతి లడ్డూ వివాదంపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ (Prajashanti party Chief KA paul) సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్ దాఖలు చేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ (CBI) విచారణ జరిపించాలని, తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ఆయన పిటిషన్ వేశారు. 740 మంది క్యాథలిక్స్ కోసం వాటికన్ ప్రత్యేక దేశంగా ఉందని.. కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుమల తిరుపతిని యూనియన్ టెర్రిటరీగా చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు ముఖ్యమంత్రి ఈ లడ్డూ వివాదం తీసుకొచ్చారని విమర్శించారు. జూలై నెలలో నివేదిక వస్తే సెప్టెంబర్‌లో దీని గురించి మాట్లాడారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గాయత్రీ దేవి అలంకారంలో కనకదుర్గ అమ్మవారు..
భద్రాచలంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 04 , 2024 | 09:41 AM