TDP: పేదలకు పక్కా ఇల్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌ది: దేవినేని ఉమా
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:23 AM
విజయవాడ: నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా గురువారం ఉదయం గొల్లపూడి వన్ సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, కేశినేని శివనాథ్ (చిన్ని), పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
విజయవాడ: నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా గురువారం ఉదయం గొల్లపూడి వన్ సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, కేశినేని శివనాథ్ (చిన్ని), పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ కారణజన్ముడు, యుగపురుషుడని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పంతో కిలో బియ్యం రెండు రూపాయల పధకం తీసుకువచ్చారని కొనియాడారు. పేదలకు పక్కా ఇల్లు ఇచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్‌దని, సంక్షేమ పథకాల ఆరాధ్యుడు నందమూరి తారక రాముడని వ్యాఖ్యానించారు. ఎనిమిదిన్నర ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్.. 14 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు నాయుడు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారన్నారు.
తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడిగా యువగళం ద్వారా నారా లోకేష్ యువతరాన్ని కదిలిస్తున్నారని దేవినేని ఉమా అన్నారు. దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వైఫల్యం చేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. త్వరలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఒక పెద్ద బహిరంగ సభలో ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటిస్తారన్నారు. తెలుగుదేశం, జనసేన కలిసి ముందుకెళ్లాలని, చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రాన్ని మళ్లీ కాపాడగలరని దేవినేని ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు.
కేశినేని శివనాద్ (చిన్ని) మాట్లాడుతూ ఎన్టీ రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు గర్వపడతారని, కార్యకర్తలు, నాయకులు ఉండంతో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలిచిన పార్టీ తెలుగుదేశమని అన్నారు. అన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గ్రామ గ్రామాన ఆ యుగపురుషుడికి నివాళులర్పిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ మొదలు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు కొనసాగించారని, మరో మూడు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రానికి పూర్వవైభవం తెలుగుదేశం, జనసేనతోనే సాధ్యమని అన్నారు. పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో దేవినేని ఉమా కృషి మరిచిపోలేనిదని కొనియాడారు. ఈ ప్రాంత ప్రజలకు మూడు పంటలకు నీళ్ళిచ్చి రైతులకు సిరులు కురిపించిన గొప్ప నాయకుడు దేవినేని ఉమా అని కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు.
Updated Date - Jan 18 , 2024 | 11:23 AM