ఢిల్లీ చేరిన వెస్ట్ బైపాస్
ABN, Publish Date - Dec 24 , 2024 | 12:53 AM
విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు వెంబడి ల్యాంకో ట్రాన్స్‌మిషన్ టవర్ల మార్పిడి వివాదం పెద్ద దుమారంగా మారుతోంది. ఇప్పటికే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేసి, సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేయగా, తాజాగా ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సీరియస్ కావడంతో వెస్ట్ బైపాస్ కథ కీలక మలుపులు తిరుగుతోంది.
ముదురుతున్న ల్యాంకో టవర్ల మార్పిడి వివాదం
ప్రధాని, కేంద్రమంత్రి , సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు రైతుల ఫిర్యాదు
లైసెన్స్ లేని కంపెనీతో పనులపై కేంద్రం సీరియస్
విచారణకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖకు ఆదేశాలు
ఎన్‌హెచ్ విజయవాడ ఆర్వో ఆఫీసు అధికారులపై గడ్కరీ కనె ్నర్ర
తక్షణం వివరణ ఇవ్వాలంటూ లేఖ
ఎన్‌హెచ్ ఉన్నతాధికారుల వివరణ కోరిన సెంట్రల్ విజిలె న్స్ కమిషన్
మరోవైపు హైకోర్టు సీరియస్.. 13 కేసులపై 11 స్టేలు
ఇప్పటికే సమగ్ర విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు వెంబడి ల్యాంకో ట్రాన్స్‌మిషన్ టవర్ల మార్పిడి వివాదం ఢిల్లీకి చేరింది. జక్కంపూడి , నైనవరానికి చెందిన రైతులు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రధానికి ఆన్‌లైన్ గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా.. సాక్ష్యాధారాలు సహా ఫిర్యాదు చేశారు. వెంటనే ప్రధాని కార్యాలయం నుంచి రైతులకు సమాధానం కూడా అందింది. ఈ అంశంపై ఫాలో అప్ చేస్తామని రిప్లై వచ్చింది. అంతేకాదు.. విచారణ జరపాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖకు ఆదేశాలు కూడా అందాయి. రైతుల ఫిర్యాదు అందుకున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా స్పందించారు. జాతీయ రహదారుల సంస్థ విజయవాడ ఆర్వో కార్యాలయ ఉన్నతాధికారులపై సీరియస్ అయ్యారు. తక్షణం వివరణ కోరారు. కాగా, రైతులు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయటంతో ఆ సంస్థ కూడా స్పందించింది. దీనిపై కేంద్ర జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులను వివరణ కోరింది. ఎన్‌హెచ్ ఉన్నతాధికారులు విజయవాడ ఆర్వో కార్యాలయ అధికారులను వివరణ కోరారు. ఒకేసారి ప్రధాన మంత్రి కార్యాలయం, నితిన్ గడ్కరీ కార్యాలయం, సెంట్రల్ విజిలెన్స్ కార్యాలయాలు స్పందించటంతో విజయవాడ వెస్ట్ బైపాస్ ల్యాంకో ట్రాన్స్‌మిషన్ టవర్ల అంశం సంచలనంగా మారింది. అయితే, ఇన్నాళ్లూ రైతులను అక్రమంగా అరెస్టులు చేయిస్తూ పనులు చేపట్టిన సంస్థలన్నీ సైలెంట్ అయ్యాయి. తవ్విన గోతులను రాత్రికి రాత్రే పూడ్చేశాయి. కాగా, తమకు జరుగుతున్న అన్యాయాన్ని జక్కంపూడి, నైనవరం రైతులు ఇటీవల సీఎం చంద్రబాబును కలిసి వివరించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వీరిని సీఎం వద్దకు తీసుకెళ్లారు. దీనికి స్పందించిన సీఎం ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
అక్రమాలు ఇలా..
ల్యాంకోకు చెందిన ట్రాన్స్‌మిషన్ లైన్‌కు సెంట్రల్ ఎలక్ర్టికల్ రెగ్యులేషన్ కమిటీ నుంచి లైసెన్స్ (164 లైసెన్స్) లేదు. ఈ లైసెన్స్ లేని సంస్థకు చెందిన టవర్ లైన్లను మారే ్చ అధికారం ఎన్‌హెచ్‌కు కూడా ఉండదు. లైసెన్స్ లేని ఓ ప్రైవేట్ సంస్థ ప్రయోజనాల కోసం టవర్ల మార్పిడి పేరుతో ఎన్‌హెచ్ విజయవాడ ఆర్వో కార్యాలయం అధికారులు రూ.32.58 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ చర్య కేంద్ర ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తుంది. మూతపడిన సంస్థ గతంలో ఇచ్చిన ప్రతిపాదనను దృష్టిలో ఉంచుకుని పనులకు టెండర్లు పిలవటంతో ఆ సంస్థకు సూపర్ వైజేషన్ చార్జీల కింద రూ.44 లక్షల మేర చెల్లించారు. ల్యాంకో సంస్థ నుంచి ఒక యూనిట్‌ను కొనుగోలు చేసిన రాధా టీఎంటీ అనే సంస్థ విద్యుత అంతరాయం పేరుతో రూ.14 కోట్లను ఎన్‌హెచ్ నుంచి డిమాండ్ చేయటం, ఎన్‌హెచ్ కొంతమేర డబ్బు చెల్లించటం గమనార్హం. వాస్తవానికి రాధా టీఎంటీ కేవలం ప్లాంట్‌లోని ఒక యూనిట్‌ను మాత్రమే కొనింది. ట్రాన్స్‌మిషన్ టవర్ల లైన్‌ను మాత్రం మయన్మార్‌కు చెందిన సంస్థ కొనుగోలు చేసింది. మయన్మార్ సంస్థ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాధా టీఎంటీ అనే సంస్థ ఏ అధికారంతో రూ.14 కోట్లు డిమాండ్ చేసిందో తెలియాలి. ఒకవేళ మయన్మార్ కంపెనీ, రాధా టీఎంటీలు అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నా లైసెన్స్ జారీకి అది చెల్లబాటు కాదు. రెండు టవర్లతో పోయే దానిని 11 టవర్లకు పెంచి రోడ్డుకు 105 మీటర్ల దూరంలో అర్ధచంద్రాకారంగా తిప్పుతూ రైతులను ఇబ్బంది పెడుతున్న అలైన్‌మెంట్ వ్యవహారంలో ఎన్‌హెచ్, రాధా టీఎంటీ, పాత ల్యాంకో యాజమాన్యాల హస్తం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.
హైకోర్టు సీరియస్.. 11 స్టేలు విడుదల
మూతపడిన ల్యాంకో పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన ల్యాంకో ట్రాన్స్‌మిషన్ టవర్ల మార్పిడి వెనుక భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని రైతులు హై కోర్టును ఆశ్రయించారు. మూతపడిన ప్రైవేట్ సంస్థ ప్రయోజనాల కోసం వందలాది మంది రైతులను ఇబ్బందులు పెడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై ఇప్పటికే ఐదు స్టేలు ఇచ్చిన నాయస్థానం తాజాగా మరో ఆరు జారీ చేసింది. 13 కేసులకు సంబంధించి ఇప్పటి వరకు 11 స్టేలు వచ్చాయి. ఈ అంశంపై హైకోర్టు సీరియస్‌గా ఉంది. ల్యాంకో లైన్ లైసెన్స్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. తదుపరి విచారణ పూర్తిచేసే వరకు యథాతథ పరిస్థితిని కల్పిస్తూ స్టేలు ఇచ్చింది. మిగిలిన రెండింటికీ స్టేలు వచ్చే అవకాశం ఉంది.
Updated Date - Dec 24 , 2024 | 12:53 AM