Prakasham Barrage: ప్రకాశం బ్యారేజీపై కుట్ర.. ప్రభుత్వానికి పోలీసులు నివేదిక..
ABN, Publish Date - Sep 09 , 2024 | 08:12 AM
కృష్ణా నది వరద పోటుపై ఉన్న సమయంలోనే ప్రకాశం బ్యారేజీని మూడు ఇనుప బోట్లు ‘కలిసికట్టు’గా ఢీకొట్టడం వెనుక భారీ కుట్ర దాగిఉందా? బ్యారేజీ గేట్లను దెబ్బతీసేందుకే... ఉద్దేశపూర్వకంగా బోట్లను అలా ‘వదిలేశారా?’ ఈ అనుమానాలను బలపరిచే అనేక అంశాలు బయటపడుతున్నాయి. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ...
విజయవాడ: ప్రకాశం బ్యారేజ్ (Prakasam Barrage) గేట్లను పడవలు ఢీ (Boats Collided) కొట్టిన ఘటనపై కుట్రకోణం దాగి ఉందా? వైసీపీ నేతలు (YCP Leaders) ఉద్దేశపూర్వకంగానే వరద ఉధృతిలో బోట్లు వదిలేశారా? ఒకే గొలుసుతో మూడు పడవలను కట్టి ఉండడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటన్నింటిపై పోలీసులు (Police) సమగ్ర విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటపడతాయని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) అన్న విషయం తెలిసిందే. ఈ కుట్ర కోణంలో ఎంతమంది ఉన్నా శిక్షించి తీరుతామని హోంమంత్రి వంగలపూడి అనిత (Anitha) స్పష్టం చేశారు. ఇప్పుడు మిష్టరీ చేధించేందుకు పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు.
ఈ నెల ఒకటో తేదీ రాత్రి ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో 11.47 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అదే సమయంలో... బ్యారేజీకి ఎగువన గొల్లపూడి నుంచి ఐదు ఇనుప బోట్లు కొట్టుకొచ్చాయి. ఇందులో మూడు బోట్లు బ్యారేజీ గేట్ల వెనుక ఉండే కౌంటర్ వెయిట్లను బలంగా ఢీ కొట్టాయి. అవి ప్రస్తుతం బ్యారేజీ 67, 69వ ఖానాల వద్ద చిక్కుకుని ఉన్నాయి. ఈ మూడు బోట్ల యజమాని పేరు... ఉషాద్రి. ఆయన... తలసిల రఘురామ్‌కు సన్నిహితుడైన రామ్మోహన్ అనుచరుడు. రామ్మోహన్, ఉషాద్రి కలిసే బోట్ల ద్వారా కృష్ణా నదిలో ఇసుక డ్రెడ్జింగ్ చేస్తున్నారు.
అనుమానాలు ఎందుకంటే...
ఐదు బోట్లలో మూడింటిపై వైసీపీ రంగులు వేసి ఉన్నాయి. అందులోనూ... ఒకదానికొకటి ఇనుప గొలుసులతో అనుసంధానించారు. సాధారణంగా బోట్లను ఇలా ఒకదానికొకటి కట్టరు. ఎందుకంటే... కొటి కొట్టుకుపోతే మిగిలినవీ కొట్టుకుపోతాయి. పైగా... ఇలా ఒకదానికొకటి కట్టేసిన మూడు బోట్లను ఒక ప్లాస్టిక్ తాడుతో గొల్లపూడి శ్మశానం వద్ద ఉన్న ఒక చెట్టుకు కట్టి ఉంచారు. ఒక్కోటి 40-50 టన్నులున్న బోట్లు... పైగా మూడింటిని ఇనుప గొలుసులతో కట్టి... అసలైన లంగరు మాత్రం ప్లాస్టిక్ తాడుతో వేయడం అనుమానాలకు తావిస్తోంది. దీనికి బలమైన తాడు కూడా వాడలేదు. కృష్ణా నదిలో వరద పెరుగుతోందని, బోట్లను పకడ్బందీగా కట్టి ఉంచాలని స్థానికులు హెచ్చరించినా పట్టించుకోలేదు. చివరికి... మూడు బోట్లు ‘కలిసికట్టు’గా వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. మరో రెండు బోట్లు కొట్టుకు రావడానికి కారణం ఈ మూడు బోట్లేనని, ఇవి ఢీకొనడంతో అవి కూడా నదిలోకి కొట్టుకు వచ్చాయని పోలీసులు నిర్ధారించారు.
ఇసుక దందాలో...
ఈ ఘటనలో రామ్మోహన్, ఉషాద్రి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని పోలీసులు నిర్ధారించారు. వీరిద్దరికీ నందిగం సురేశ్, తలసిల రఘురామ్‌లతో సంబంధాలున్నాయని తేల్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి బాపట్ల ఎంపీ నందిగం సురేశ్, జగన్‌కు అత్యంత సన్నిహితుడు, ఎమ్మెల్సీ తలశిల రఘురాం కృష్ణా నదిలో ఇసుక దందాను బాగా కొనసాగించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇనుప బోట్లను నదిలో తిప్పుతూ ఇసుకను ఒడ్డుకు చేర్చేవారు. ఈ వ్యవహారాలు నందిగం సురేశ్, తలశిల రఘురాం కనుసన్నల్లో జరిగాయన్నది బహిరంగ రహస్యం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ బోట్లు నదికి ఆవలన ఉద్దండరాయనిపాలెం వైపు నిలిపి ఉండేవి. అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించేవి. ఇటీవలే ఇవి గొల్లపూడి వైపు వచ్చాయి. దీనిపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి. కౌంటర్ వెయిట్లకు జరిగిన నష్టంపై కేఆర్‌సీ (కృష్ణా రివర్ కన్జర్వేషన్) ఈఈ పీవీఆర్ కృష్ణారావు విజయవాడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ గురుప్రకాశ్ ఈ ఫిర్యాదుపై క్రైం నంబరు 171/2024తో ఐపీసీ 336(రాష్ అండ్ నెగ్లిజన్స్), పీడీపీపీ యాక్ట్‌లోని సెక్షన్ 3 కింద కేసు నమోదు చేశారు.
ముందు నుంచే అనుమానాలు...
బ్యారేజీ వద్ద కౌంటర్ వెయిట్ల ఏర్పాటును పరిశీలించిన జలవనరుల శాఖ మంతి నిమ్మల రామానాయుడు... బోట్లు ఢీ కొన్న ఘటన వెనుక కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. దర్యాప్తులో అన్ని విషయాలు బయట పడతాయని అభిప్రాయపడ్డారు. నదిలో చేపల వేట సాగించడానికి మత్స్యకారులు చెక్క బోట్లను ఉపయోగిస్తారు. ఇసుకను తరలించడానికి ఇనుప బోట్లను ఉపయోగిస్తారు. ఈ రెండు రకాల బోట్లు నదిలో సంచరించాలంటే బోట్స్ అసోసియేషన్‌లో సభ్యత్వం ఉండాలి. దీంతో పాటు మత్స్యశాఖ, జలవనరుల శాఖ అనుమతులు ఉండాలి. ప్రతి ఏడాది రెన్యువల్ చేయించుకోవాలి. ఈ మూడు బోట్లకు చెందిన యజమానులకు బోట్స్ అసోసియేషన్‌లో సభ్యత్వం, ప్రభుత్వ అనుమతులు లేవని గొల్లపూడి బోట్ల యజమానులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల ముందుకు యజమానులు
ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లను బోట్లు ఢీ కొట్టిన ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కోమటి రామ్మోహన్, ఆయన సన్నిహితుడు ఉషాద్రిని పోలీసులు స్టేషన్‌కు రప్పించారు. ఏడీసీపీ జి.రామకృష్ణ ఆధ్వర్యంలో వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ గురుప్రకాశ్ విచారించారు. ఈ బోట్లకు, తనకు ఎలాంటి సంబంధం లేదని రామ్మోహన్ వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. బ్యారేజీ వద్దకు వచ్చిన బోట్లలో మూడు తనవేనని ఉషాద్రి అంగీకరించారు. వాటికి అనుమతులు ఉన్నాయని, లైసెన్స్‌ను రెన్యువల్ చేయించానని కొన్ని ధ్రువీకరణ పత్రాలు చూపించినట్లు తెలిసింది.
Updated Date - Sep 09 , 2024 | 08:16 AM