AP Politics: జనసేనతో టచ్‌లోకి వైసీపీ మాజీ మంత్రులు.. పవన్ రిప్లైతో కంగుతిన్న నేతలు..!
ABN, Publish Date - Jul 22 , 2024 | 07:59 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం తీవ్ర ఆందోళన చెందుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో కొందరు వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ (YSRCP) నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం తీవ్ర ఆందోళన చెందుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో కొందరు వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన(Janasena)లో చేరేందుకు కొందరు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించడం లేదట. ఎన్నికలు ప్రక్రియ పూర్తై రెండు నెలలు కూడా కాకపోవడంతో.. చేరికల కోసం మరికొంత సమయం వేచి చూడాలని పార్టీ నేతలకు జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ సూచించారట. కొంతమంది వైసీపీ నాయకులు జనసేన నేతలకు టచ్‌లోకి వెళ్లడంతో.. ఈ విషయాన్ని కొందరు సీనియర్లు పార్టీ అధినేతకు తెలియజేయగా.. చేరికలకు మరింత సమయం ఉందని చెప్పారట.
టచ్‌లోకి మాజీ మంత్రులు..
వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన విడుదల రజిని, ఉషా శ్రీ చరణ్, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు వంటి నేతలు జనసేనలో చేరేందుకు ఆసక్తిచూపిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు జనసేన నేతలతో సంప్రదింపులు జరిపారట. అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో కొద్ది రోజులు వెయిట్ చేయాలని అంటూనే.. చేరికలకు సంబంధించి కొన్ని కండీషన్స్ పెట్టారట. ఈ షరతులను వైసీపీ నాయకులకు చెప్పడంతో చేసేదేమిలేక జనసేనలో చేరాదమనుకుంటున్న కొందరు బీజేపీ నేతలకు టచ్‌లోకి వెళ్లారనే చర్చ జరుగుతోంది. కేవలం మాజీ మంత్రులు మాత్రమే కాకుండా మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఉభయగోదావరి జిల్లాలకు చెందిన కొందరు వైసీపీ నేతలు జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారట. మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కాకుండా క్షేత్రస్థాయిలో క్లీన్ ఇమేజ్ ఉండి.. భూఆరోపణలు లేకుండా, గతంలో జనసేన, టీడీపీలపై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేయని జిల్లా, మండల స్థాయి నాయకులను చేర్చుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు సూచించారట. ఎవరిని పడితే వారిని చేర్చుకోవడం ద్వారా పార్టీలో ఎప్పటినుంచో ఉంటున్న కార్యకర్తలు, నాయకులు నష్టపోయే అవకాశం ఉంటుందని.. ఈ నేపథ్యంలో స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకున్నతర్వాతనే ఇతర పార్టీల నేతలను చేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
పవన్ ఏమన్నారంటే..
ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులను చేర్చుకునేందుకు మరికొంత సమయం ఉందని పార్టీ సీనియర్ల వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడే చేరికలకు అవకాశం కల్పిస్తే పార్టీ క్యాడర్‌లో అనేక అనుమానాలు తలెత్తే అవకాశం ఉందని.. ఎప్పటినుంచో పార్టీ కోసం కష్టపడిన నేతలకు నామినేటెడ్ పదవుల పంపకం పూర్తైన తర్వాత మాత్రమే చేర్చుకోవాలనే ఆలోచనలో పవన్ ఉన్నారట. ఇప్పుడే అవకాశం కల్పిస్తే.. నామినేటెడ్ పదవులు పార్టీ నాయకులకు కాకుండా.. వలసవాదులకు ఇస్తారనే ప్రచారం జరుగుతుందని.. ఆ ప్రచారానికి అవకాశం లేకుండా చేసే ఉద్దేశంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పదవుల పంపకం పూర్తైన తర్వాత.. పార్టీ విధివిధానాలు నచ్చి.. పదవులపై ఆశ లేకుండా వచ్చేందుకు ఎవరు ముందుకు వస్తారో వాళ్లను మాత్రమే పార్టీలో చేర్చుకోవాలని జనసేనాని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News
Updated Date - Jul 22 , 2024 | 07:59 AM