నవలా రచయిత, కథకుడు, కవి.. కాశీభట్ల వేణుగోపాల్ కన్నుమూత
ABN, Publish Date - Aug 20 , 2024 | 05:47 AM
తెలుగు సాహితీ వినీలాకాశంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆధునిక సాహితీదిగ్గజం... కవి, కథకుడు, నవలా రచయిత కాశీభట్ల వేణుగోపాల్(72) సోమవారం కన్నుమూశారు.
కర్నూలు స్వగృహంలో అనారోగ్యంతో మృతి
12కుపైగా నవలలు, 100కుపైగా కథలు, మూడు కథా, కవితా సంపుటాలతో ప్రసిద్ధి
1996లో తానా పురస్కారం
కర్నూలు(కల్చరల్), ఆగస్టు 19: తెలుగు సాహితీ వినీలాకాశంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆధునిక సాహితీదిగ్గజం... కవి, కథకుడు, నవలా రచయిత కాశీభట్ల వేణుగోపాల్(72) సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్నూలు నగరంలోని రెవెన్యూ కాలనీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1974లో ఆంధ్రపత్రికలో ‘రంగనాయకి లేచిపోయింది’ అనే కథతో కాశీభట్ల తన సాహితీ ప్రస్థానం ప్రారంభించారు.
తర్వాత అనేక కవితలు రాశారు. ‘నేను-చీకటి’ అనే నవలతో వెలుగులోకి వచ్చారు. ఆయన రచనలు ‘ఘోష’, ‘తపన’, ‘దిగంతం’ ‘మంచు-పువ్వు’, ‘తెరవని తలుపులు’, ‘అసత్యానికి ఆవల’, ‘సంగతం’ వంటివి విమర్శకుల ప్రశంసలు పొందాయి.
వినూత్న కథనాలు, కొత్తదనంతో కనిపించే పాత్రలు, ఆకట్టుకునే రచనా శైలి ఆయన స్వంతం. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆయన రచనలు నవ్య కెరటాల్లా ఉవ్వెత్తున ఎగిశాయి. ఆయన తన కలం ద్వారా మానవ సంబంధాలను, మనుషుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న కోణాలను, మనుషుల మధ్య ఉన్న అంతరాలను సునిశితంగా పరిశీలించి రాసేవారు. సుమారు 12కు పైగా నవలలు, వం దకు పైగా కథలు రాశారు.
కర్నూలులోనే చదువు, సాహితీ శోధన...
కాశీభట్ల వేణుగోపాల్ 1952 జనవరి 2న కర్నూలులో జన్మించారు. తండ్రి ఎల్లప్ప శాస్త్రి, తల్లి హనుమాయమ్మలకు ఇద్దరు మగ, నలుగురు ఆడ సంతానం. వారిలో కాశీభట్ల అందరికన్నా చిన్నవారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు నుంచి కర్నూలుకు వచ్చి స్థిరపడిన కుటుం బం వారిది. కర్నూలు బీక్యాంపు బాలుర పాఠశాల్లో హైస్కూల్ విద్య, ఉస్మానియా కళాశాలలో కళాశాల విద్య పూర్తి చేశారు. ‘మొదట్లో అభ్యుదయ, విప్లవ సాహిత్యాలకు ఆకర్షితుడినైనా... విశ్వసాహిత్యాన్ని చదివే క్రమంలో వాటి నుంచి బయటపడ్డాను’ అని ఒక సందర్భంలో ఆయన చెప్పుకొచ్చారు. విస్తృతంగా చదివే అలవాటుతో పాటు కొత్త ప్రదేశాల సందర్శనపై ఆయనకున్న మక్కువతో మూడుసార్లు దేశాటన చేశారు. గాఢమైన అనుభూతున్ని ఒడిసిపట్టే నైపుణ్యం అబ్బడానికి, తాను రచయితను కావడాని కి ఆ పర్యటనలే కారణమని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయిన కాశీభట్ల... జీ వితాన్వేషణలో వారణాసి, లక్నోలో కొంతకాలం ఉన్నారు. ఆ సమయంలో సంగీత సాధన కూడా చేశారు.
ముగిసిన అంత్యక్రియలు
కాశీభట్ల వేణుగోపాల్ మృతి విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, సాహిత్యాభిమానులు ఆయన స్వగృహానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు. జిల్లా ఒక గొప్ప సాహితీ దిగ్గజాన్ని కోల్పోయిందని శ్రద్ధాంజలి ఘటించారు. సోమవారం సాయంత్రం కాశీభట్ల అం త్యక్రియలు నిర్వహించారు. బంధువులు, స్నేహితులు కదలివచ్చి, చివరిసారిగా ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు.
భిన్నత్వంతో కూడిన రచనలు...
పదునైన భాషతో కూడిన కాశీభట్ల రచనా శైలి అన్ని వర్గాలను ఆకట్టుకునేది. ఆయన రచనల్లోని పాత్రలు ఆధునిక మానవుని అంతరంగంలో కల్లోలాన్ని రేపుతాయి. పెద్దగా ఎవరూ స్పృశించని, సాహసించని స్త్రీ పురుష సంబంధాల్ని, పురుషుడి చీకటి ఆలోచనల్నీ, నిషేధిత సంబంధాలను తెలుగు సాహిత్యంలోకి తెచ్చి తనకంటు ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. మూడు కథా సంపుటాలు, మూడు కవిత్వ సంపుటాలు వెలువరించారు. ‘ఒక బహుముఖం’ అనే కవితా సంపుటికి మంచి ప్రాచుర్యం లభించింది. 1996లో కర్నూలులో ‘తానా’ సంస్థ నుంచి పురస్కారం అందుకున్నారు. కర్నూలు కథా సమయం, రాయలసీమ ప్రచురణలు తదితర సంస్థలు ప్రచురించిన కథా సంపుటాలకు ఆయన ముందుమాట రాశారు. ఎందరో ఔత్సాహిక కవులు, రచయితలను ఆయన ప్రోత్సహించారు. సినీ నటులు తనికెళ్ల భరణి, దర్శకుడు వంశీ వంటి వారితో సన్నిహితంగా ఉండే ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వేలాది అభిమానులను తన రచనల ద్వారా సంపాదించుకున్నారు. ఆయన చివరిగా రాసిన ‘అసత్యానికి ఆవల’ నవలతోపాటూ పాత నవలలన్నింటినీ ‘అన్వీక్షికి’ సంస్థ ఇటీవలే ప్రచురించింది.
Updated Date - Aug 20 , 2024 | 05:47 AM