అందరి సహకారంతోనే అభివృద్ధి: ఎంపీ
ABN, Publish Date - Aug 29 , 2024 | 12:31 AM
ఇది వైసీపీ కాదని...వర్గపోరు లేకుండా అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే నందికొట్కూరు అభివృద్ధి సాధ్యమని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
నందికొట్కూరు, ఆగస్టు 28: ఇది వైసీపీ కాదని...వర్గపోరు లేకుండా అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే నందికొట్కూరు అభివృద్ధి సాధ్యమని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. బుధవారం నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఎంపీతో పాటు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ ప్రధానంగా తాగునీరు, ఎడ్యుకేషన్, ఆసుపత్రుల కోసం ఎంపీ నిధులను కేటాయిస్తామన్నారు. పట్టణంలో 6 మినరల్ వాటర్ ప్లాం ట్లను మంజూరు చేయిస్తామన్నారు. పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ ఒకటి సరిపోదని అన్నారు. హంద్రీ నీవా కాలువకు అనుసంధానం చేస్తూ మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను నిర్మించాలని ఆమె సూచించారు. దిశ కమిటీలో 42 కేంద్ర పథకాలు ఉన్నాయని, వాటిని ఎన్‌ఆర్‌ఈజీఎస్, జల్‌జీవన్ మిషన్ తదితర పనులను కమిటీ సభ్యుల ఆమోదం తీసుకోవాలన్నారు. గత ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. గతంలో దివ్యాంగులకు ఇంటి స్థలాలు ఇచ్చామని, ఆ స్థలాల్లో ఎవరెవరికి ఇచ్చామో ఆ వివరాలు వారం రోజుల్లో అందజేయాలని ఆదేశించారు. ఆ ప్రదేశంలో దివ్యాంగుల కోసం స్కిల్ డవలప్‌మెంట్ కోర్సును ఏర్పాటు చేసేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారన్నారు. మారుతినగర్, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి నగర్‌లలో ఆక్రమణకు గురైన స్థలాల గురించి సంబంధిత వివరాలు కావాలని ఆమె కమిషనర్‌కు తెలిపారు.
అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం: ఎమ్మెల్యే
ప్రజలు ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా డా. బైరెడ్డి శబరికి అవకాశం కల్పించారని, వారి అభివృద్ధి కోసం అడుగులు వేస్తామని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. టీడీపీ హయాంలో నందికొట్కూరు తాగునీటి శాశ్వత పరిష్కారం కోసం అలగనూరు రిజర్వాయర్ నుంచి ఓ సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ కోసం రూ.120 కోట్లు కేటాయిస్తే... 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ ప్రాజెక్టును తుంగలో తొక్కిందని అన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పోలీసు బందోబస్తు ఏర్పాటు
ఎప్పూడూ లేని విధంగా నందికొట్కూరు కౌన్సిల్ సమావేశం ఈ సారి ఉత్కంఠగా సాగింది. ఓ వైపు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, మరో వైపు ఎంపీ డా.బైరెడ్డి శబరి హాజరు అవుతుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్‌రెడ్డి, రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, నందికొట్కూరు, జూపాడుబంగ్లా ఎస్‌ఐలు చంద్రశేఖర్, సురేష్‌బాబు, లక్ష్మీనారాయణ, స్పెషల్ పార్టీ పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమావేశానికి అధికారులు, కౌన్సిలర్లు, మీడియా ప్రతినిధులను తప్ప మరెవ్వరినీ సమావేశానికి హాజరు కానివ్వలేదు. నందికొట్కూరు పురపాలక సంఘం స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా వెంకటరమణ ఎంపికయ్యారు. చైర్మన్ దాసి సుధాకర్‌రెడ్డి, వైస్ చైర్మన్ రబ్బాని, డీఈ నాయబ్ రసూల్, తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
Updated Date - Aug 29 , 2024 | 12:31 AM