దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం
ABN, Publish Date - Oct 04 , 2024 | 12:58 AM
నంద్యాల పట్టణంలో దసరా ఉత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
నంద్యాల (కల్చరల్), అక్టోబరు 3: నంద్యాల పట్టణంలో దసరా ఉత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని పలు ఆలయాల్లో పత్యేక అభిషేకాలు, ఆకుపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవోలు లక్ష్మీనారాయణ, రామాంజనేయశర్మ, భగవత్ సేవాసమాజ్ కమిటీ అధ్యక్షుడు సముద్రాల సూరయ్య, తదితరులు పాల్గొన్నారు. నంద్యాలలోని జగజ్జననీ ఆలయంలో జగజ్జననీ మాత మండల దీక్షను భక్తులు స్వీకరించారు.
బండిఆత్మకూరు: ఓంకార క్షేత్రంలో ఉమామహేశరి అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిచ్చారు. గురువారం దేవి శన్నవరాత్రి ఉత్సవాలను మొదటి రోజున దేవస్థానం తరపున ఈవో నాగప్రసాద్ నిర్వహించారు. అర్చకులు ఉమామహేశ్వరీదేవిని రాజరాజేశ్వరీదేవిగా అలంకరించి అర్చనలు చేశారు. అలాగే సాధు సిద్దయ్య ఆశ్రమంలో అమ్మవారు లర్మీదేవిగా పూజలు అదుకున్నారు. కార్యక్రమంలో ఈశ్వరరెడ్డి, మల్లేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డి, కాశీ, రాజు, నారాయణ, జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
పాణ్యం: శరన్నవరాత్రుల్లో భాగంగా గురువారం అమ్మవారు గౌరీదేవి అలంకారంలో దర్శనమిచ్చినట్లు దేవదాయ శాఖ ఈవో సువర్ణ తెలిపారు. ఆంజనేయ స్వామి ఆలయంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కనకదుర్గా ఆలయం వద్ద అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిచ్చారు. బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహానికి భక్తులు పూజ లు నిర్వహించారు. కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో గురువారం ఆలయ ఈవో రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పూజలు చేసి హోమం నిర్వహించారు. అర్చకులు నారాయణస్వామి, సురేష్‌శర్మ, వేదపండితులు గుంతనాల సురేష్, రోహిత్ శర్మ, వెంకటేశ్ స్వామి, జనార్దన్ స్వామి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
గడివేముల: మండల కేంద్రంలోని అమ్మవారిశాలలో గురువారం పతాకావిష్కరణ చేసి దసరా నవరాత్రుల వేడుకలు ప్రారంభించారు. నవరాత్రుల్లో మొదటి రోజు భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌గుప్త, ఉపాధ్యక్షుడు సతీష్‌కుమార్, మల్లికార్జున, సీవీ రమణయ్య పాల్గొన్నారు.
ఆత్మకూరు: పట్టణంలోని ఆలయాలు దసరా శరన్నవరాత్రులతో శోభిల్లుతున్నాయి. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అనఘాదేవీ, చౌడేశ్వరిఅమ్మవారు శాంకరీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. అలాగే అన్ని ఆలయాల్లో కూడా స్వామి, అమ్మవార్లకు కుంకుమార్చనలు, అభిషేకాలు తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. కిషన్‌సింగ్ వీధి ధ్యానంజనేయ స్వామి, అంబాభవానీ ఆలయాల ఆవరణలో ప్రతిష్టించిన దుర్గాదేవీ అమ్మవారు బాలత్రిపురదేవీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఆత్మకూరు రూరల్: వెంకటాపురం గ్రామంలో రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో మొదటి రోజు అమ్మవారు బాలత్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పురోహితులు సుందరరాజశర్మ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక అలంకరణ గావించి, విశేష పూజలు చేపట్టారు. కురుకుందలో కురుకులాంబ అమ్మవారి ఆలయంలో, కరివేన గ్రామంలో అమ్మమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వెలుగోడు: వెలుగోడులోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు త్రిపుర బాల సుందరిదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆర్యవైశ్య మహిళలు సాముహిక కుంకుమార్చన నిర్వహించారు.
నందికొట్కూరు: పట్టణంలోని శ్రీ చక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మొదటి రోజు పతాకావిష్కరణతో నవరాత్రుల మహోత్సవాలను ఆర్యవైశ్య సంఘం, మిత్ర సంఘాల సభ్యులు ప్రారంభించారు. మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భవనాశి నాగ మహేష్, గౌరవ అధ్యక్షుడు కండె శ్యామ్‌సందర్ లాల్, నంద్యాల జిల్లా వాసవి సేవాదళ్ అధ్యక్షులు బింగుమళ్ల శ్యాంసుందర్, జిల్లా సంఘం సభ్యులు, పట్టణ మిత్ర సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
పాములపాడు: పాములపాడులోని చౌడేశ్వరీదేవి ఆలయంలో మొదటిరోజు అమ్మవారు గాయత్రీమాతగా భక్తులకు దర్శనమిచ్చారు. పురోహితులు కోదండరామయ్య అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
మిడుతూరు: మిడుతూరులోని కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆలయ కమిటీ పెద్దలు కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గరువారం అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
పగిడ్యాల: మండలంలోని నెహ్రూనగర్ గ్రామంలో దుర్గామాత గురువారం బాలత్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి భజన బృందం సభ్యులతో దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
కొత్తపల్లి: మండలంలోని కొలనుభారతి సరస్వతి అమ్మవారు మొదటి రోజు గురువారం బాలత్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. విచ్చేసిన భక్తులు తమ చిన్నారులకు తల్లిదండ్రులు అక్షరాభ్యాసక్రతువులు చేయించుకున్నారు. విచ్చేసిన భక్తులకు స్థానిక ఆర్యవైశ్య సత్ర నిర్వహకులు అన్నదానం ఏర్పాటు చేశారు.
Updated Date - Oct 04 , 2024 | 12:58 AM