పత్తి కొనుగోళ్లకు సాకులు
ABN, Publish Date - Dec 24 , 2024 | 11:45 PM
ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులు సాగు చేసిన పత్తిని కొనుగోలులో సీసీఐ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
రైతుల వద్ద భారీగా పత్తి నిల్వలు
కర్నూలు అగ్రికల్చర్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులు సాగు చేసిన పత్తిని కొనుగోలులో సీసీఐ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం ఏదో ఒక కారణం చూపుతూ కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు. గత వారం కోడుమూరు మార్కెట్ కమిటీ పరిధిలోని పెంచికలపాడులో యంత్రాలు పనిచేయలేదంటూ పత్తి కొనుగోళ్లను నిలిపివేశారు. అదేవిధంగా సోమవారం ఆదోని కొనుగోలు కేంద్రాల్లో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి దాకా ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం కోడుమూరు మార్కెట్ కమిటీల పరిధిలో 13,890 మంది రైతులతో కేవలం 3.24 లక్షల పత్తిని సీసీఐ కొనుగోలు చేసినట్లు వారికి రూ.237.22 కోట్లు చెల్లించినట్లు మార్కెటింగ్ శాఖ ఏడీఎం నారాయణమూర్తి తెలిపారు. అయితే మొత్తం ఉమ్మడి జిల్లాలో సాగైన పత్తి పంట వివరాలను పరిశీలిస్తే దాదాపు 2లక్షల హెక్టార్లలో పత్తి పంటను రైతులు సాగు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పత్తి దిగుబడి భారీగా పెరిగింది. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దాకా చేతికందింది. ఈ పత్తిని కొనుగోలు చేసేందుకు ఎప్పటి నుంచో సీసీఐ అధికారులు ప్రకటనలు జారీ చేస్తూనే ఉన్నారు. రైతుల ఆగ్రహావేశాలను గుర్తించి అధికారులు ఈ నెల మొదటి వారం నుంచి పత్తి కొనుగోళ్లను వేగవంతం చేశారు. వాస్తవంగా రూ.48 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి రైతుల చేతికి అందితే ఇప్పటి దాకా కేవలం రూ.3.26 లక్షల క్వింటాళ్లను మాత్రమే సీపీఐ కొనుగోలు చేసింది. బహిరంగ మార్కెట్‌లోనే ఇప్పటి దాకా రూ.30లక్షల క్వింటాళ్ల పత్తిని దళారులు, వ్యాపారులే రైతుల నుంచి క్వింటాకు రూ.6వేల నుంచి రూ.6,500 చెల్లించి కొనుగోలు చేశారు. గోరుచుట్టుపై రోకటి పోటులా వానలు, ముసురు, చల్లని గాలులతో తేమ శాతం ఏ మాత్రం తగ్గకపోవడంతో గిట్టుబాటు ధర అందే అవకాశం లేదని, చాలా మంది రైతులు ఇంకా ఇళ్లలోనే పత్తిని నిల్వ చేసుకున్నారు. సీసీఐ అధికారులు పత్తి కొనుగోలును వేగవంతం చేయాలని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - Dec 24 , 2024 | 11:45 PM