జీవితమంతా గణితమే
ABN, Publish Date - Dec 22 , 2024 | 12:58 AM
మనం ఎప్పుడు పుట్టాం? ఈ పుట్టుక తేదీ నుంచి జీవితంలో గణితం ఆరంభ మవుతుంది. ఆ తర్వాత జీవనయానం అంతా లెక్కలతోనే ముడిపడి వుంటుంది. పండితులు, పామరులు ఎవరైనా సరే ఏదో సందర్భంలో లెక్కలతో కుస్తీపట్టక తప్పదు.
మనసుపెట్టి నేర్చుకుంటే చాలా సులువు
నేడు భారతీయ గణిత మేధావి శ్రీనివాస
రామానుజన్ జయంతి
ఆత్మకూరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) మనం ఎప్పుడు పుట్టాం? ఈ పుట్టుక తేదీ నుంచి జీవితంలో గణితం ఆరంభ మవుతుంది. ఆ తర్వాత జీవనయానం అంతా లెక్కలతోనే ముడిపడి వుంటుంది. పండితులు, పామరులు ఎవరైనా సరే ఏదో సందర్భంలో లెక్కలతో కుస్తీపట్టక తప్పదు. జీవితంలో ఇంత భాగమైపోయిన గణితమంటే చాలా మందికి భయం. వామ్మో.. లెక్కలా..? నా వల్ల కాదు బాబోయ్.. అనేవారే అధికం. కానీ కష్టపడి, ఇష్టంతో చేస్తే గణితాన్ని మించిన సులువైన శాస్త్రం మరొకటి లేదన్నది నిపుణుల అభిప్రాయం. జీరో నుంచి ప్రారంభించి హీరోగా ప్రపంచఖ్యాతి పొందిన శ్రీనివాస రామానుజన్ లెక్కలకు చుక్కాని వంటివారు. ఎన్నో లెక్కల తికమకలకు చక్కని పరిష్కారం చూపిన రామానుజన్ భారతీయ గణిత మేధావుల్లో అగ్రగణ్యుడు. ఈయన జయంతి డిసెంబరు 22న ప్రతి ఏటా గణిత దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ.
గణితం సర్వంతర్యామి. ప్రతి అంశంలోనూ గణితానికి భాగస్వామ్యం వుంది. అందుకే విద్యార్థి దశలో గణితానికి అంత ప్రాధాన్యత ఇస్తారు. వాస్తవానికి అన్ని శాస్ర్తాల్లోనూ గణితం మిళితమై వుంటుంది. ఉదాహరణకు సాంఘికశాస్త్రంలో అక్షాంశాలు, రేఖాంశాలు, దేశాల విస్తీర్ణాలు, మ్యాప్‌ల నిర్మాణంలో వున్న నిష్పత్తులు మొదలైనవన్నీ గణితమే. సైన్స్‌లో భారం, ద్రవ్యరాశి, మూలకాల ఆవర్తనం, సమీకరణాలు, జీవక్రియలన్నీ గణిత ప్రస్థావనతోనే సాధ్యం. భాషా వ్యాకణాలలోనూ గణితం వుంటుంది. ప్రస్తుతం అన్ని పోటీ పరీక్షల్లో గణితం తప్పనిసరి అయింది.
మాయా చదరాల మేధావి రామానుజన్
తన పుట్టిన రోజు 22.12.1887తో మాయా చదరాన్ని సృష్టించిన మేధావి శ్రీనివాసరామానుజన్. 16 గడుల చదరంలో ఏ నిలువు వరుస కూడినా, అడ్డువరుస కూడిన మొత్తం 139 వస్తోంది. కర్ణాలు, మూలాలు, మధ్య చదరం, మూల సంఖ్య మొత్తం, మూల చదరాల మొత్తం అన్నీ 139 సంఖ్యనే చూపిస్తాయి. ఇటువంటి మాయా చదరాలు ఎన్నో సృష్టించిన వ్యక్తి రామానుజన్. తన పదో ఏటనే ఉపాధ్యాయుడిని సున్నాతో సున్నాను గుణిస్తే 1 వస్తుందా అని అడిగిన ప్రతిభాశాలి. హైస్కూల్ రోజుల్లో 40 మంది ఉపాధ్యాయులకు టైమ్ టేబుల్ రూపొందించి గుర్తింపు సాధించారు. అధ్యాపకులు సాధించలేని సమస్యలను తాను క్లుప్తంగా సాధించేవారు. మ్యాజిక్‌స్కయర్, కంటిన్యూడ్ ప్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలపై పరిశోధనలు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలోని ఆయన చేతిరాత ప్రతుల ద్వారా ఇది తెలుస్తోంది. ఓ జర్నల్‌లో వచ్చిన సమస్యను సాధించి ఫలితాన్ని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఆచార్యులు జీహెచ్ హర్షికి పంపించడంతో రామానుజన్ ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. త్రికోణమితికి సంబంధించిన సూత్రాలు సాధించడం, మాక్ ఽథీటా ఫంక్షన్స్‌పై పరిశోధనలు నేడు అనేక రంగాల్లో ఉపయోగపడుతున్నాయి. 1729ని రామానుజన్ నంబర్‌గా పిలుస్తారు. ఆ నంబర్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఆ సంఖ్యను 10, 9ల గణాల మొత్తంగా 12, 1 గణాల మొత్తంగా మూడు ప్రధాన సంఖ్యల లబ్దంగా 19, 91ల లబ్దంగా చూపాడు. ఓ కారు నంబర్‌గా ఉన్న ఈ నంబర్‌ను చూసి ఈ విషయాలన్ని కనుగొన్నారు రామానుజన్.
ఇష్టపడి చదివితే గణితం లాంటి సబ్జెక్ మరొకటి లేదు
ఇష్టపడి చదివితే గణితం లాంటి సులువైన సబ్జెక్ట్ మరొకటి లేదు. చాలా మంది లెక్కల సబ్జెక్ట్ అంటేనే భయపడతారు. అలాంటి వారు గణితం మక్కువ చూపితే ఏ సమస్యనైనా సులభంగా సాధించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు గణితంలోని మెలకువలను తెలుసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. - డాక్టర్ ఎస్వీఆర్. శేఖరరెడ్డి, గణిత అధ్యాపకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆత్మకూరు.
Updated Date - Dec 22 , 2024 | 12:58 AM