ఉపాధి పనుల్లో నిధులు దుర్వినియోగం
ABN, Publish Date - Dec 14 , 2024 | 12:21 AM
వెలుగోడు మండలంలో జరిగిన ఉపాధి పనులలో రూ.65,230 దుర్వినియోగం అయ్యాయని, వాటిని రికవరీ చేయాలని పీడీ జనార్దన్‌రావు ఆదేశించారు.
వెలుగోడు, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): వెలుగోడు మండలంలో జరిగిన ఉపాధి పనులలో రూ.65,230 దుర్వినియోగం అయ్యాయని, వాటిని రికవరీ చేయాలని పీడీ జనార్దన్‌రావు ఆదేశించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 6.25 కోట్లతో జరిగిన పనులపై 18వ విడత సామాజిక తనిఖీలపై ఓపెన్ ఫోరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ఆయా గ్రామాల వారిగా నివేదికలను చదివి వినిపించారు. అబ్దుల్లాపురం గ్రామంలో రూ.9,851, బోయరేవుల గ్రామంలో రూ. 1,484, మాధవరం గ్రామంలో రూ. 4,638, మోతుకూరు గ్రామంలో రూ.7,872, వేల్పనూరులో రూ.1,455, రేగడగూడూరులో రూ.930, వెలుగోడులో రూ.39,000 దుర్వినియోగం అయినట్లు అధికారులు తేల్చారు.
వెలుగోడు పట్టణంలో మరో ఆరు పనుల్లో భారీగా నిధులు దుర్వినియోగం అయినట్లు తనిఖీ బృందం చెప్పగా సిబ్బంది వారితో వాగ్వాదానికి దిగారు. ప్రతిదీ భూతద్దం పెట్టి రికవరీకి ఆదేశిస్తే తాము ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనని ఆగ్రహించారు. దీంతో ఆరు వర్క్ ఐడీలపై త్రీసభ్య కమిటీతో విచారణ చేయాల్సిందిగా పీడీ ఆదేశించారు. కార్యక్రమంలో డీవీవో బాలాజీ నాయక్, ఏవీవో సీబారాణి, ఏపీడీ అన్వరా బేగం, ఎంపీడీవో మధుసూదన్‌రెడ్డి, పీఆర్ ఏఈ శ్రీనివాసులు, హౌసింగ్ ఏఈ శ్రీనివాసులు, ఏపీవో మల్లికార్జున, సీఆర్పీలు, డీఆర్పీలు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Dec 14 , 2024 | 12:21 AM