ప్రాజెక్ట్ కమిటీ ఎన్నికలు ప్రశాంతం
ABN, Publish Date - Dec 21 , 2024 | 11:57 PM
తొమ్మిదేళ్ల తరువాత టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల ప్రక్రియ శనివారంతో ముగిసింది. మూడు దశల్లో చేపట్టిన ఎన్నికల్లో భాగంగా ఎంతో కీలకమైన ప్రాజెక్టు కమిటీ (పీసీ) ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
టీబీపీ ఎల్లెల్సీ చైర్మన్ టిప్పుసుల్తాన్, జీడీపీ చైర్మన్ కేఈ మల్లికార్జునగౌడ్
ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు
రాత్రికి రాత్రే మారిన రాజకీయ సమీకరణాలు
హొళగుంద డీసీ అధ్యక్షుడు శివప్రసాద్‌కు చేజారిన పీఠం
ముగిసిన సాగునీటి ఎన్నికల ప్రక్రియ
తొమ్మిదేళ్ల తరువాత టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల ప్రక్రియ శనివారంతో ముగిసింది. మూడు దశల్లో చేపట్టిన ఎన్నికల్లో భాగంగా ఎంతో కీలకమైన ప్రాజెక్టు కమిటీ (పీసీ) ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పీసీ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠం దక్కించుకున్నవారు సంబరాల్లో మునిగితేలితే.. పదవి ఆశించి భంగపడిన నాయకులు ఎన్నిక ముగియగానే నిరుత్సాహంతో వెనుదిరిగారు. ఎల్లెల్సీ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పదవి కోసం నలుగురు పోటీ పడడంతో నిర్ణయం అధిష్టానానికి వదిలేశారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ యువనేత, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ఆశీస్సులతో మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన పి. టిప్పుసుల్తాన్ జిల్లాలోనే అతిపెద్ద టీబీపీ ఎల్లెల్సీ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పీఠం దక్కించుకున్నారు. ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్య నాయకుల సహకారంతో గాజులదిన్నె ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా కోడుమూరుకు చెందిన కేఈ మల్లికార్జునగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కర్నూలు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ), గాజలదిన్నె ప్రాజెక్టు, హంద్రీనీవా కాలువ, టీబీపీ హెచ్చెల్సీ ఆలూరు బ్రాంచి కాలువ సహా చిన్ననీటి పారుదల చెరువుల నిర్వహణ, ఆయకట్టు రైతులకు సాగునీటి సేవలు అందించాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నిర్వహణకు సై అంది. రాష్ట్రంలో సాగునీటి సంఘాల ఎన్నికలకు అక్టోబరు 9న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అదే నెల 21న కలెక్టరు పి. రంజిత్‌బాషా నోటిఫికేషన్ జారీ చేశారు. 41 రోజుల్లో మూడు దశల్లో డబ్ల్యూయూఏ, డీసీ, పీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాలు, ఆ తరువాత డిసెంబరు 5న నోటిఫికేషన్ జారీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో రెండోసారి కూడా వాయిదా పడ్డాయి. మూడో దఫా ఈ నెల 11న జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా జారీ చేశారు. 14న డబ్ల్యూయూఏ, 17న డిస్ట్రిబ్యూటరీ కమిటీ (డీసీ) ఎన్నికలు పూర్తి చేశారు. శనివారం కీలకమైన ప్రాజెక్ట్ కమిటీ (పీసీ) ఎన్నికలు ప్రశాంతంగా ముగియంతో మూడు దశల సాగునీటి ఎన్నికల ప్రక్రియకు తెరపడింది. జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఈ ఎన్నికలు ముగియడంతో జిల్లా యంత్రాంగం, ఇంజనీరింగ్ అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఏకగ్రీవంగా ప్రాజెక్ట్ కమిటీ ఎన్నికలు:
కర్నూలు నగరంలోని జల మండలి కేంద్రంగా జరిగిన తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ), గాజులదిన్నె ప్రాజెక్ట్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. జల మండలి సమావేశ భవనంలో ఎన్నికల నోడల్ అధికారి, ఇరిగేషన్ కర్నూలు సర్కిల్ ఎస్‌ఈ బి. బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎల్లెల్సీ ప్రాజెక్ట్ కమిటీ(పీసీ) ఎన్నిక నిర్వహించారు. పీసీ పరిధిలో పది డీసీ అధ్యక్షులు సభ్యులుగా ఉన్నారు. పీసీ చైర్మన్ పదవి ఆశించి భంగపడిన హొళగుంద డీసీ-1 అధ్యక్షుడు మిక్కిలినేని వెంకట శివప్రసాద్ ఎన్నికకు గైర్హాజరయ్యారు. కౌతాళం డీసీ-2 అధ్యక్షుడు పి. టిప్పు సుల్తాన్, కోసిగి డీసీ-3 అధ్యక్షుడు జంపాపురం అనంతసేనారెడ్డి, పెద్దకడబూరు డీసీ-4 అధ్యక్షుడు నరవ రమాకాంతరెడ్డి, ఎమ్మిగనూరు డీసీ-6 అధ్యక్షుడు ఎన్. గోవర్ధన్‌రెడ్డి, గోనెగండ్ల డీసీ-7 అధ్యక్షుడు బావిగడ్డ హుశేన్‌సాబ్, కోడుమూరు డీసీ-8 అధ్యక్షుడు కురవ చంద్రశేఖర్ కర్నూలు డీసీ-9 అధ్యక్షుడు కె.మహేశ్వరరెడ్డి, కర్నూలు డీసీ-10 అవిజ ధర్మారెడ్డి హాజరు కాగా.. టీడీపీ అధిష్ఠానం పంపిన కౌతాళం డీసీ-3 అధ్యక్షుడు టిప్పుసుల్తాన్ నామినేషన్ వేశారు. అలాగే వైస్ చైర్మన్ పదవికి గోనేగండ్ల డీసీ-7 అధ్యక్షుడు బావిగడ్డ హుసేన్‌సాబ్ ఒక్కడే నామినేషన్ పత్రం ఇచ్చారు. మిగిలిన ఎనిమిది మంది సభ్యులు ఏకగీవ్రంగా ఆమోదించడంతో.. ఆథరైజ్డ్ అధికారి, ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి ఏకగ్రీంగా ఎన్నికైనట్లు ప్రకటించి చైర్మన్, వైస్ చైర్మన్లు టిప్పుసుల్తాన్, బావిగడ్డ హుసేన్‌సాబ్‌లకు ధ్రువీకరణ పత్రం అందజేశారు.
జల మండలిలో సంబరాలు
టీబీపీ ఎల్లెల్సీ పీసీ చైర్మన్, వైస్ చైర్మన్లు పి.టిప్పుసుల్తాన్, బావిగడ్డ హుసేన్‌సాబ్, జీడీపీ పీసీ చైర్మన్, వైస్ చైర్మన్లు కేఈ మల్లికార్జునగౌడ్, కొడిదెల చిన్నమద్దయ్యలను టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి ఎన్.రాఘవేంద్రరెడ్డి, తెలుగురైతు సంఘం రాష్ట్ర నాయకుడు సాయిబాబా తదితరులు అభినందించారు. పూలమాలలు వేసిన సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఎల్లెల్సీ, జీడీపీ పీసీ చైర్మన్, వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకుందుకు సభ్యులకు అభినందనలు తెలియజేశారు. పదవులు చేపట్టిన నాయకులు కాలువల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు చివరి ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేందుకు కృషి చేయాలని కోరారు. అంతకుందు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలలు వేసి నివాళులర్పించారు.
గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ) పీసీ ఎన్నిక జలవనరుల శాఖ ఎస్‌ఈ ఛాంబర్‌లో ఆథరైజ్డ్ అధికారి, ఆదోని సబ్ కలెక్టరు ఎం.మౌర్యభరద్వాజ్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ పీసీలో సభ్యులైన హెచ్.కైరవాడి, కోడుమూరు, ఒంటెడుదిన్నె, తిప్పనూరు, ఎ.లింగందిన్నె, కుర్నూరు, ముడుమలగుర్తి, పోతుగల్లు, మొన్నెంకుంట, గోరంట్ల, ఎర్రగుడి, తొగరచేడు డబ్ల్యూయూఏల అధ్యక్షులు రామాంజనేయులు, కేఈ మల్లికార్జునగౌడ్, బీటీ బడేసాబ్, బోయ కౌలుట్ల, కె.పెద్ద కృష్ణయ్య, అన్నం పురుసోత్తంరెడ్డి, ఇ.సోమలింగడు, కొడిదెల చిన్న మద్దయ్య, పి.రాధకృష్ణ, బి.మౌళాలి, బిఎన్ నడిపి భాస్కర్ హాజరయ్యారు. చైర్మన్ పీఠం కోసం కోడుమూరు డబ్ల్యూయూఏ-2 అఽధ్యక్షుడు కేఈ మల్లికార్జునగౌడ్, వైస్ చైర్మన్ పదవికి మన్నెంకుంట డబ్ల్యూయూఏ-9 అధ్యక్షుడు కొడిదెల చిన్న మద్దయ్యలు నామివేషన్ పత్రాలు అందజేశారు. మిగిలిన సభ్యులు ఆమోదం తెలపడం, పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆదోని సబ్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ ప్రకటించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
శివప్రసాద్‌కు చేజారిన చైర్మన్ పీఠం
ఎల్లెల్సీ పీసీ చైర్మన్ పీఠం కోసం ఆలూరు నియోజకవర్గానికి చెందిన హొళగుంద డీసీ-1 అధ్యక్షుడు మిక్కిలినేని వెంకట శివప్రసాద్, కౌతాళం డీసీ-2 అధ్యక్షుడు పి.టిప్పు సుల్తాన్, పెద్దకడబూరు డీసీ-4 అధ్యక్షుడు నరవ రమాకాంతరెడ్డి, ఎమ్మిగనూరు డీసీ-6 అధ్యక్షుడు ఎన్.గోవర్ధన్‌రెడ్డి పోటీ పడ్డారు. రెండు రోజుల క్రితం పీసీ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు సమావేశమై శివప్రసాద్ పేరును ప్రతిపాదించారు. తెల్లారేసరికి అధిష్ఠానం నుంచి టి. టిప్పుసుల్తాన్ పేరు వచ్చింది.
Updated Date - Dec 21 , 2024 | 11:57 PM