వైభవంగా ఊయల సేవ
ABN , Publish Date - May 17 , 2024 | 11:57 PM
శ్రీశైలం మహాక్షేత్రంలో లోకకల్యాణార్థం శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ఊయల సేవను ఘనంగా నిర్వహించారు.

శ్రీశైలం, మే 17: శ్రీశైలం మహాక్షేత్రంలో లోకకల్యాణార్థం శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ఊయల సేవను ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ముందుగా మహగణపతి పూజను చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ఊయలలో ఆశీనులనుజేసి శాస్ర్తోక్తంగా షోడశోప చార పూజలు జరిపారు. అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్ర నామపూజలు, స్వామివారికి సహస్రనామార్చన పూజలు నిర్వహించి మంగళ హారతులను ఇచ్చారు.
అంకాలమ్మకు పూజలు: శ్రీశైల క్షేత్ర గ్రామదేవత అంకాలమ్మకు శుక్రవారం లోకకల్యానాన్ని ఆకాంక్షిస్తూ విశేష పూజలను దేవస్థానం నిర్వహించింది. ఈ పూజలలో భాగంగా అమ్మవారికి పంచామృతాభిషేకం, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం, విశేష అలంకరణ, కుంకుమార్చన పూజలు నిర్వహించారు.
అలరించిన గాత్రకచేరి: శ్రీశైల దేవస్థానం ధర్మపథంలో భాగంగా నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమంలో శుక్రవారం కర్నూలుకు చెందిన ఇ.ఆర్.కె.వి ప్రసాదరావు బృందంతో గాత్రకచేరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో మహాగణపతిం, భో..శంభో, శివశంభో, చాలదా ఈ జన్మ చాలదా, శ్రీశైలవాసా, గంగాతరంగా, గౌరీశంకర తదితర గీతాలను ప్రసాదరావు, మునిదాసు, సోమశేఖర్ తదితరులు ఆలాపించారు.