ఐక్య సంఘాలను ప్రక్షాళన చేస్తాం: ఎమ్మెల్యే
ABN, Publish Date - Nov 09 , 2024 | 12:39 AM
మెప్మా విభాగంలోని ఐక్య సంఘాలను పక్షాళన చేసి తీరుతామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు.
ఆత్మకూరు, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): మెప్మా విభాగంలోని ఐక్య సంఘాలను పక్షాళన చేసి తీరుతామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక మార్కెట్ యార్డులో పొదుపు మహిళలతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో 40 వరకు ఐక్య సంఘాలు ఉండాల్సినప్పటికీ ప్రస్తుతం కేవలం 24 సంఘాలు మాత్రమే ఉన్నాయని అందులో కూడా సభ్యులు ఎవరున్నారో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. వీటన్నింటిని పక్షాళన చేసి అర్హులైన సంఘాలను కొనసాగిస్తామని వివరించారు. మహిళా సంఘాలకు రాజకీయాలతో పనేంటని ప్రశ్నించారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి తమ సంఘాలను బలోపేతం చేసుకోవాలే తప్ప రాజకీయాల జోక్యం సరికాదని అన్నారు. గతంలో తప్పులు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మెప్మా అధికారులు అర్బన్‌కాలనీలో ఉన్న మెప్మా భవనాన్ని మరమ్మత్తులు చేసి తమకు అప్పగించాలని ఎమ్మెల్యే బుడ్డాను కోరడంతో అందుకు సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశానికి మెప్మా టీఎంసీ వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు వంగాల శివరామిరెడ్డి, వేణుగోపాల్, శివప్రసాద్‌రెడ్డి, కలిముల్లా, అబ్దుల్లాపురం బాషా, నూర్‌బేగ్ ఉన్నారు.
దోబీ ఘాట్ స్థలాలను పరిరక్షించాలి
ఆత్మకూరులోని కొత్తపల్లి రస్తాలో పడేవాగు పక్కన దోబీ ఘాట్ స్థలం ఆక్రమణకు గురికాకుండా రియల్ ఎస్టేట్ వ్యక్తుల నుంచి పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు రామకృష్ణ కోరారు. శుక్రవారం ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే వెంటనే తహసీల్దార్ రత్నరాధికకు ఫోన్ చేసి దోబీ ఘాట్ స్థలం ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంఘం నాయకులు శివుడు, వెంకటస్వామి, శివ, నాగార్జున తదితరులు ఉన్నారు.
కార్యకర్త కుటుంబానికి చేయూత
ఆత్మకూరు పట్టణానికి చెందిన టీడీపీ కార్యకర్త, లారీ కట్ట మెస్త్రీ ఇటీవల ఆకస్మిక మరణం పొందడంతో ఆటోనగర్ యూనియన్ తరుపున రూ.లక్ష బాధిత కుటుంబానికి అందజేశారు. శుక్రవారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా సాయం అందించారు.
Updated Date - Nov 09 , 2024 | 12:39 AM