వినాయక చవితి సందడి
ABN, Publish Date - Sep 07 , 2024 | 12:15 AM
చవితి ఉత్సవాలకు పందిళ్లు సిద్ధమయ్యాయి. ఎక్కడికక్కడ ఉత్సవ కమిటీలు నవరాత్రుల పూజాధికాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
నందికొట్కూరు, సెప్టెంబరు 6: చవితి ఉత్సవాలకు పందిళ్లు సిద్ధమయ్యాయి. ఎక్కడికక్కడ ఉత్సవ కమిటీలు నవరాత్రుల పూజాధికాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీపాలంకరణలు చేశారు. సర్వ విఘ్నాలను తొలగించే ఆదిదేవుడు గణపతి పూజకు ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు. పూజాదికాల నిమిత్తం వస్తు సామగ్రి కొనుగోలుకు నందికొట్కూరు పట్టణానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చేరుకున్నారు. దీంతో పట్టణంలోని పాతబస్టాండు, పటేల్ సెంటర్ కొత్తబస్టాండ్ తదితర ప్రాంతాల్లో పండ్లు, గణపతి విగ్రహాలు, పత్రులు, పువ్వులు, దుకాణాలు ప్రజలతో నిండాయి. పట్టణంలోని కేంద్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పందిళ్లు వీధివీధిలో వెలిశాయి. ప్రజలు వినాయ చవితికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తుండడంతో రద్దీగా మారింది. పట్టణంలోని ఆవుల సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఆత్మకూరు: వినాయక చవితిని పురస్కరించుకుని ఆత్మకూరు ప్రాంతంలో ఒక్కరోజు ముందుగానే చవితి సంబరాలు ఊపందుకున్నాయి. శనివారం జరిగే వినాయకుడి పండుగను సంతోషంగా జరుపుకొనేందుకు ఆయా మంటపాల నిర్వాహకులతో పాటు భక్తులు శుక్రవారం ఉత్సాహంగా ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నారు. ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో సుమారు 35దాకా గణనాధులు కొలువుతీరనున్నారు. అదేవిధంగా చుట్టు పక్కల గ్రామాల్లో కూడా విగ్రహాల సంఖ్య అంచనాలకు మించి పెరిగాయి. అలాగే ఉత్సవాన్ని సంబరంగా జరుపుకొనేందుకు మంటపాల నిర్వాహకులు పోటీపడుతున్నారు. ఆయా మంటపాల వద్ద కాషాయపు జెండాలతో, విద్యుత్ అలంకరణతో సుందరంగా తీర్చిదిద్దారు. కాగా వినాయక ఉత్సవాన్ని పురస్కరించుకుని సంప్రదాయబద్ధంగా వినాయకుడి పూజలో ఉపయోగించి గరిక గడ్డి, ఎలక్కాయాలు, మొక్కజొన్న కంకులు, పుష్పాల తదితర పూజా సామాగ్రిని కొనుగోలు చేసేందుకు గౌడ్‌సెంటర్‌లో ప్రజలు పోటెత్తారు. ఈ నెల 9న జరిగే నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.
మట్టి విగ్రహాల పంపిణీ
నంద్యాల క్రైం/కల్చరల్: మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించు కోవాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్ సూచించారు. బాల అకాడమీ, రవీంద్ర విద్యాసంస్థల అధినేత రవీంద్ర ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరై మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కార్యదర్శి బింగుమళ్ల శ్యాంసుందర్ గుప్తా, వన్‌టౌన్ సీఐ సుధాకర్‌రెడ్డి, 6వ వార్డు టీడీపీ ఇన్‌చార్జి పల్లె వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. నంద్యాల లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు చంద్రమోహన్ సౌజన్యంతో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు లయన్స్ క్లబ్ సభ్యులు, డాక్టర్ రవికృష్ణ పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ నంద్యాల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేశారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరై వెయ్యి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. గంగిశెట్టి దీపక్ సహకారంతో కార్యక్రమం చేపట్టారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది తులసిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ గంగిశెట్టి విజయ్, గణేష్ ఉత్సవ కమిటి అధ్యక్షుడు డా.రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహానంది: మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడదామని టీడీపీ శ్రీశైల నియోజకవర్గ సమన్వయకర్త రామలింగారెడ్డి తెలిపారు. శుక్రవారం మహానందిలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ హైమావతి సహకారంతో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేపట్టారు. తహసీల్దార్ రమాదేవి, ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి, టీడీపీ నాయకులు మౌళీశ్వరరెడ్డి, గంగిశెట్టి మల్లికార్జున, వెంకటేశ్వర్లు, ఉమాదేవి, గణేష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మట్టి వినాయక విగ్రహాలనే పూజించడం శుభప్రదమని ఆత్మకూరు అర్బన్, రూరల్ సీఐలు ఓబులేసు, సురేష్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక గౌడ్‌సెంటర్‌లోని ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి నాయకులు శేగు కిరణ్‌కుమార్ సహకారంతో భక్తులకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానం వినాయక చవితిని పురస్కరించుకుని శుక్రవారం వినాయకస్వామి మట్టివిగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసింది. డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్.రమణమ్మ, స్వామివార్ల ప్రధానార్చకులు వీరయ్యస్వామి, ఆలయ ఏఈవో హరిదాసు, పీఆర్‌వో శ్రీనివాసరావు, పర్యవేక్షకులు అయ్యన్న, గిరిజామణి పాల్గొన్నారు. అలాగే శ్రీశైలం హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా 500 మట్టి వినాయక విగ్రహాలను స్థానికులకు పంపిణీ చేశారు.
Updated Date - Sep 07 , 2024 | 12:15 AM