అధికారులు ఏం చేస్తున్నారు..?
ABN, Publish Date - Dec 20 , 2024 | 12:13 AM
‘జిల్లా వ్యాప్తంగా భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
భూ సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం
15 ఏళ్ల నుంచి పెండింగ్‌లోనే
రెవెన్యు సదస్సులో కలెక్టర్ రాజకుమారి అసహనం
ప్యాపిలి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘జిల్లా వ్యాప్తంగా భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు. 15 సంవత్సరాల నుంచి కూడా సమస్యలు అలాగే ఎందుకు ఉండిపోయాయి..’ అంటూ కలెక్టర్ రాజకుమారి అధికారులను ప్రశ్నించారు. గురువారం ప్యాపిలి మండలంలోని బూరుగుల గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన కలెక్టర్ రాజకుమారి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాను పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించానన్నారు. అయితే నంద్యాల జిల్లాలో ఉన్న భూ సమస్యలు ఎక్కడా చూడలేదన్నారు. స్థానిక అధికారుల నిర్లక్ష్యం వల్లే భూ సమస్యలు పేరుకుపోయాయన్నారు. దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించడానికే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందన్నారు. సమస్యల కోసం ప్రభుత్వ కార్యాలయాల వద్దకు ప్రజలు తిరగాల్సిన అవసరం లేదన్నారు. వారి వద్దకే అధికారులు వెళ్లి సమస్యలు పరిష్కరించడానికే ప్రభుత్వం సదస్సులకు శ్రీకారం చుట్టిందన్నారు. రెవెన్యు సదస్సుల్లో వచ్చిన ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి 45 రోజుల్లో పరిష్కారం చూపుతామన్నారు. అలాగే రైతుల అభిప్రాయాల ప్రకారం ప్రభుత్వం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌బుక్‌లను రైతులకు అందజేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భువనేశ్వరిదేవి, తహసీల్దారు భారతి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఈవోఆర్డీ బాలకృష్ణుడు, ఏఓ రాజేష్, ఏఈ వినయ్‌కుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావుయాదవ్, ఎంపీటీసీ శివకుమారి, వీఆర్వో సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 20 , 2024 | 12:13 AM