మండలి ముద్దు.. సభ వద్దు
ABN, Publish Date - Nov 12 , 2024 | 05:18 AM
శాసనమండలి ముద్దు, శాసనసభ వద్దు అన్నట్లుగా వైసీసీ వ్యవహరిస్తోంది. శాసనమండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఉన్నారు.
శాసనమండలికి హాజరైన వైసీపీ.. శాసనసభకు మాత్రం దూరం
పార్టీ భిన్న వైఖరిపై విమర్శలు.. తాడేపల్లిలో ఎమ్మెల్యేలతో జగన్ భేటీ
అమరావతి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): శాసనమండలి ముద్దు, శాసనసభ వద్దు అన్నట్లుగా వైసీసీ వ్యవహరిస్తోంది. శాసనమండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. శాసనసభలో ప్రతిపక్ష హోదాకు తగినంత మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి లేరు. దీంతో శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదన్న సాకుతో వైసీసీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సభకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, వైసీపీ ఎమ్మెల్సీలు ఉదయం పది గంటల కల్లా శాసనమండలికి చేరుకున్నారు. కాగా జగన్ తాడేపల్లి నివాస ప్రాంగణంలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 10 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 3గంటలకు మరోసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. సోమవారం ఉదయం మాక్ అసెంబ్లీని నిర్వహిస్తారని భావించినా ఆయన ఆ ఊసెత్తలేదు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు, సభలో మైకు ఇచ్చేందుకు కూడా కూటమి ప్రభుత్వం భయపడుతోందని ఎమ్మెల్యేలతో జగన్ వాఖ్యానించారు. అసెంబ్లీకి రాకపోవడంపై విమర్శలు రావడంతో తాను పదవి కోసం పట్టుబట్టడం లేదని, ప్రతిపక్షనేత హోదా ఉంటేనే ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అడిగినప్పుడల్లా మైకు ఇస్తారని జగన్ వివరణ ఇచ్చుకుంటున్నారు. అయితే శాసనసభకు వెళ్లనప్పుడు ఎమ్మెల్యే పదవి ఎందుకని, రాజీనామా చేయాలని విమర్శలు వస్తున్నాయి.
Updated Date - Nov 12 , 2024 | 05:18 AM