ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Complaint against Pinnelli : మా పరిధి కాదు!

ABN, Publish Date - May 27 , 2024 | 04:03 AM

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఎన్నికల రోజు తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా పాల్పడిన అకృత్యాల గురించి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడు నోముల మాణిక్యరావును పోలీసులు ఫిర్యాదు స్వీకరించకుండా వేధింపులకు పాల్పడ్డారు.

పిన్నెల్లిపై ఫిర్యాదు స్వీకరించకుండా పోలీసుల వేధింపులు

మంగళగిరి రూరల్‌ పోలీసుస్టేషన్‌కు బాధితుడు మాణిక్యరావు

పల్నాడు జిల్లాలోనే ఫిర్యాదు చేసుకోవాలని ఎస్‌ఐ సలహా

జీరో ఎఫ్‌ఐఆర్‌ గురించి ఎస్‌ఐకి వివరించిన న్యాయవాది

అయినా.. ఫిర్యాదు తీసుకునేందుకు ఎస్‌ఐ ససేమిరా

డీజీపీ దృష్టికి తీసుకెళ్లడంతో ఎట్టకేలకు ఫిర్యాదు స్వీకరణ

మంగళగిరి సిటీ, మే 26: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఎన్నికల రోజు తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా పాల్పడిన అకృత్యాల గురించి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడు నోముల మాణిక్యరావును పోలీసులు ఫిర్యాదు స్వీకరించకుండా వేధింపులకు పాల్పడ్డారు. పిన్నెల్లి స్వగ్రామం కండ్లకుంటకు చెందిన టీడీపీ పోలింగ్‌ ఏజెంట్‌ నోముల మాణిక్యరావు ఆదివారం సాయంత్రం తన న్యాయవాది, టీడీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడపాటి లక్ష్మీనారాయణతో కలిసి మంగళగిరి రూరల్‌ పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో గంటల తరబడి ఎదురుచూశారు. ఫోన్‌ చేయగా, అది తమ పరిధి కాదని పోలీసులు ఫోన్‌లోనే సమాధానమిచ్చారని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఫిర్యాదు ఇచ్చే తీరుతామని మాణిక్యరావు, న్యాయవాది భీష్మించడంతో కొద్దిసేపటికి ఎస్‌ఐ క్రాంతికిరణ్‌ స్టేషన్‌కు వచ్చారు. బాధితుడు ఫిర్యాదు ఇచ్చేందుకు ప్రయత్నించగా.. పల్నాడు జిల్లా సమీపంలోనే ఉన్నందున అక్కడే ఫిర్యాదు చేయాలని ఎస్‌ఐ ఉచిత సలహా ఇచ్చారు. బాధితులు ఎక్కడైనా ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉందంటూ జీరో ఎఫ్‌ఐఆర్‌ గురించి న్యాయవాది లక్ష్మీనారాయణ వివరించారు. గతంలోని పలు కేసులను ఉదహరించారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ కింద కేసు నమోదు చేసి, సంబంధిత పోలీసుస్టేషన్‌కు బదిలీ చేయాలని కోరారు. అయినప్పటికీ ఫిర్యాదు స్వీకరించేందుకు ఎస్‌ఐ నిరాకరించారు. దీంతో మాణిక్యరావు న్యాయవాదితో కలిసి ఆదివారం రాత్రి డీజీపీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. వారి వెంట టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, గుంటూరు మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు, స్థానిక టీడీపీ నేతలు కూడా ఉన్నారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించలేదని డీజీపీ హరీ్‌షకుమార్‌ గుప్తాకు వారు వివరించారు. తక్షణమే స్పందించిన డీజీపీ జిల్లా ఎస్పీతో మాట్లాడి ఫిర్యాదు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో మాణిక్యారావు తిరిగి మంగళగిరి రూరల్‌ పోలీసు స్టేషన్‌కు వచ్చి ఎస్‌ఐ క్రాంతికిరణ్‌కు ఫిర్యాదు అందజేశారు.

2 వారాలుగా అజ్ఞాతం

పిన్నెల్లి సోదరుల అకృత్యాలను మాణిక్యరావు ఆదివారం మీడియాకు వివరించారు. పోలింగ్‌ రోజు పిన్నెల్లి సోదరులు దారుణంగా హింసించడంతో మాణిక్యరావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రాణభయంతో రెండు వారాలపాటు హైదరాబాద్‌లో తలదాచుకుని ఆదివారం మీడియా ముందుకు వ చ్చారు. కండ్లకుంటలోని 114వ నెంబరు పోలింగ్‌ బూత్‌లో పోలింగ్‌ రోజు తాను టీడీపీ ఏజెంట్‌గా కూర్చున్నానని, ఉదయం 11 గంటలకు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కర్రలు, రాడ్లు చేతపట్టి పోలింగ్‌ బూత్‌లోకి వచ్చి బీభత్సం సృష్టించారని తెలిపారు. ‘వెంకట్రామిరెడ్డి ముఖ్య అనుచరుడు దేశిరెడ్డి నాసర్‌రెడ్డి నన్ను పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు ఈడ్చేశాడు. కాపాడాలని అక్కడున్న పీవో, ఏపీవోలను అభ్యర్థించగా కనీసం స్పందించలేదు. అదే సమయంలో పిన్నెల్లి అనుచరులు సుమారు 300 మంది మారణాయుధాలతో మా ఇంటికి వెళ్లారు. నా భార్య ఎల్లేశ్వరి, కుమారులు చందు, సాల్మన్‌రాజులపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆ హింసాత్మక దృశ్యాలను పిన్నెల్లి అనుచరులు పోలింగ్‌ బూత్‌లో ఉన్న నాకు వీడియో కాల్‌ ద్వారా చూపించి పైశాచికానందం పొందారు’ అని మాణిక్యరావు వివరించారు.

Updated Date - May 27 , 2024 | 05:20 AM

Advertising
Advertising