తేమ 25 శాతం ఉన్నా కొంటాం : మనోహర్
ABN, Publish Date - Nov 28 , 2024 | 04:21 AM
‘రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితులతో చేతికొచ్చిన పంటను అమ్ముకోలేమనే భయంతో రైతులు ఉన్నారు. ఎవరికీ ఆ భయం అవసరం లేదు. ప్రతి గింజా కొంటాం. మీ ఇబ్బందులు చూసి కొనుగోలు నిబంధనల్లో మార్పులు చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆదేశించారు.
వాహనాలకు జీపీఎస్ నిబంధన తీసేశాం
ధాన్యం కొనుగోలులో వెసులుబాట్లు కల్పించాం: మనోహర్
ఆరబెట్టిన ధాన్యం పరిశీలించి..
కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసిన మంత్రి
తెనాలి, కొల్లూరు, దుగ్గిరాల, కొల్లిపర, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితులతో చేతికొచ్చిన పంటను అమ్ముకోలేమనే భయంతో రైతులు ఉన్నారు. ఎవరికీ ఆ భయం అవసరం లేదు. ప్రతి గింజా కొంటాం. మీ ఇబ్బందులు చూసి కొనుగోలు నిబంధనల్లో మార్పులు చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆదేశించారు. దీంతో వాటిని సవరించి, తేమ శాతం పెంచాం. ధాన్యం కొన్న 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు వేస్తున్నాం’ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. బుధవారం ఆయన గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అనంతరం గుంటూరు జిల్లా తెనాలిలో విలేకరులతో మాట్లాడారు. రైతుల్లో ధైర్యం నింపేలా వారి దగ్గరకు వెళ్లాలని చంద్రబాబు, పవన్ ఆదేశించడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నామన్నారు. 17శాతానికి మించి తేమ ఉంటే ధాన్యం కొనక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న సమాచారంతో వాటిలో మార్పులు చేశామన్నారు. కోస్తా ప్రాంతంలోని 5 జిల్లాల్లో ధాన్యంలో 24-25 తేమ శాతం ఉన్నా కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చామన్నారు.
కేవలం ఐదు కిలోల తరుగు మాత్రమే తీసుకుని ధాన్యం కొనుగోళ్లకు వెసులుబాటు కల్పించామన్నారు. ఇప్పటి వరకు కోసిన ధాన్యాన్ని రెండు రోజుల్లో కొనేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ధాన్యం కొనుగోలు వాహనాలకు జీపీఎస్ ఉండాలనే నిబంధన కూడా మార్చామని చెప్పారు. గోతాలు, కూలీల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఇప్పటివరకు రూ.1100 కోట్ల విలువైన ధాన్యాన్ని కొన్నామని చెప్పారు. కాగా బాపట్ల జిల్లా కొల్లూరు మండలం ఈపూరు, క్రాప, గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం గొడవర్రు ప్రాంతాల్లో రైతులు రోడ్లపై ఆరబెట్టుకున్న ధాన్యాన్ని మంత్రి పరిశీలించారు. వల్లభాపురం, మున్నంగిల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ధాన్యం ఎంతకు, ఎవరికి అమ్ముతున్నారని రైతులను ప్రశ్నించగా తేమ శాతం, ఈకేవైసీతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు మంత్రికి చెప్పగా.. ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - Nov 28 , 2024 | 04:21 AM