Nara Lokesh: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మంత్రి లోకేశ్
ABN, Publish Date - Oct 27 , 2024 | 03:36 PM
అట్లాంటాలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని మంత్రి లోకేశ్ ఆవిష్కరించనున్నారు. దీపావళి పర్వదినం గురువారం (అక్టోబర్ 31) నాడు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా, ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అట్లాంటా: అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేశ్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతున్నారు. మరోవైపు తనను కలిసేందుకు వస్తున్న టీడీపీ కార్యకర్తలు, తెలుగు ఎన్నారైలను ఆయన ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఇదిలావుండగా అట్లాంటాలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని మంత్రి లోకేశ్ ఆవిష్కరించనున్నారు. దీపావళి పర్వదినం గురువారం (అక్టోబర్ 31) నాడు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా, ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్‌తో పాటు ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కాకర్ల సురేష్ , యార్లగడ్డ వెంకటరావు పాల్గొననున్నారు. స్థానికంగా అందుబాటులో ఉండేవారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. కాగా ఏపీ మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు, దిగ్గజ సినీ నటుడు నందమూరి తారక రామారావు తెలుగుజాతి గర్వించే వ్యక్తి. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విలువలు పాటించడంతో పాటు నూతన సంస్కరణలకు నాంది పలికిన ఆయన విగ్రహాన్ని అట్లాంటాలో ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా, ఎన్టీఆర్ అభిమానులు నిర్ణయించి నిర్మించారు.
ఈక్వెనెక్స్ డేటా సెంటర్ సందర్శన
మంత్రి నారా లోకేశ్ శాన్‌ఫ్రాన్సి్స్కోలో ఈక్వెనెక్స్ డాటా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఆ సంస్థ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలికారు. కంపెనీ అందిస్తున్న డాటా సేవలు, కార్యకలాపాలను సంస్థ గ్లోబల్ ఎండీ కౌషిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజనీర్ రాబర్ట్ ఎలెన్ వివరించారు. ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన, సురక్షితమైన డాటా సేవలను అందిస్తున్న సంస్థగా ఈక్వెనెక్స్‌కు మంచి పేరుంది. ప్రపంచవ్యాప్తంగా 260కి పైగా ఇంటర్నేషనల్ బిజినెస్ ఎక్స్చేంజి డాటాసెంటర్ల నెట్ వర్క్ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో డాటాసెంటర్ ఏర్పాటుకు గల అనుకూలతలను మంత్రి లోకేష్ వారికి వివరించారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ పాలసీలో పవర్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ ప్రకటించిన విషయం తెలిసిందే.
Updated Date - Oct 27 , 2024 | 03:38 PM