Minister Savita : మూతబడ్డ ఆప్కో దుకాణాలను పునఃప్రారంభిస్తాం
ABN, Publish Date - Jun 29 , 2024 | 05:18 AM
‘రాష్ట్ర వ్యాప్తంగా మూతబడిన ఆప్కో షోరూమ్‌లను పునఃప్రారంభించి, మరింత అభివృద్ధిపరుస్తాం. చేనేతలను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించాలి’ అని చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత పిలుపునిచ్చారు.
వారంలో ఓ రోజు నేత వస్త్రాలు ధరించాలి: మంత్రి సవిత
పెనుకొండ టౌన్, జూన్ 28: ‘రాష్ట్ర వ్యాప్తంగా మూతబడిన ఆప్కో షోరూమ్‌లను పునఃప్రారంభించి, మరింత అభివృద్ధిపరుస్తాం. చేనేతలను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించాలి’ అని చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత పిలుపునిచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నగర పంచాయతీ అత్యవసర కౌన్సిల్ సమావేశంలో శుక్రవారం ఆమె ఎక్స్ అఫీషియో మెంబర్ హోదాలో తొలిసారి పాల్గొన్నారు. సమీపంలోని బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ‘వైసీపీ పాలనలో ఆప్కో హ్యాండ్లూమ్స్ పరిస్థితి దయనీయంగా మారింది.
చేనేత కార్మికులు గడిచిన ఐదేళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుటుంబ పోషణ భారమై పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. చేనేత కార్మికులు బాగుంటేనే ఆప్కో బాగుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కో షోరూమ్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. చేనేతను మరింత అభివృద్ధి చేసేందుకు, అంతర్జాతీయ మార్కెటింగ్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. నేతన్నలకు గతంలోని సంక్షేమ పథకాలను కొనసాగించడంతోపాటు మరింత తోడ్పాటును అందిస్తాం’ అని మంత్రి సవిత తెలిపారు.
Updated Date - Jun 29 , 2024 | 05:18 AM