AP: పులివెందులలో ఇంటి పన్ను దొంగలు.. ఎమ్మెల్సీ షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Nov 28 , 2024 | 04:12 PM
గత ప్రభుత్వంలో ఏమాత్రం అవినీతి జరగనట్టు కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో కనీసం ఐదు వేల రూపాయలు కూడా ఖర్చు చేసే పరిస్థితి లేదని వివరించారు.
కడప: పులివెందుల మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం రెండు నెలల తర్వాత నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఐదు సంవత్సరాల కాలంలో ఏమాత్రం అవినీతి జరగనట్టు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో జగన్ ప్రభుత్వం సుందరీకరణ పేరిట 650 కోట్లు రూపాయలు ఖర్చు చేసిందని..సీసీరోడ్లు అండర్ డ్రైనేజీ కోసం 125 కోట్ల రూపాయలు ఇంకా కావాలంటున్నారని తెలిపారు.
రూ. 5 వేలు కూడా లేదు..
పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్ప టికీ సిసి రోడ్లు అండర్ డ్రైనేజీలు చెయ్యకపోగా కూటమి ప్రభుత్వమే నిధులు విడుదల చేయాలంటున్నారని అన్నారు. అయితే, మున్సిపాలిటీ పరిధిలో ఐదు వేల రూపాయలు కూడా ఖర్చు చేసే పరిస్థితి లేదంటున్నారని వివరించారు. కనీసం వీధి కుక్కలను, పందులను పట్టేందుకు కూడా నిధులు లేవంటున్నారని చెప్పుకొచ్చారు. తన ఇంటికి సంబంధించిన ఇంటి పన్ను 6000 రూపాయలు కట్టినప్పటికీ మున్సిపాలిటీలో జమ చేయలేదని తెలిపారు.
దొంగ రిసిప్ట్‌లు..
ఒక ఎమ్మెల్సీ పరిస్థితి ఇలా ఉంటే సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు. పులివెందుల పట్టణంలో ఇంటి పన్నుకు సంబంధించి దొంగ రిసిప్ట్ లు చలామణి అవుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టణ అభివృద్ధికి ఆ శాఖ మంత్రితో మాట్లాడి నిధులను తీసుకొని వస్తామని వ్యాఖ్యానించారు. టిడ్కొ ఇండ్లకు 2018-19 సంబంధించి డబ్బులు వసూలు చేశారని వాటిని వెంటనే ప్రజలకు అందజేయాలని హెచ్చరించారు.
Updated Date - Nov 28 , 2024 | 04:13 PM