Municipal Employees : మమ్మల్ని పంపేయండి!

ABN, Publish Date - Sep 13 , 2024 | 04:28 AM

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి నగరానికి వచ్చిన మున్సిపల్‌ ఉద్యోగులు, అధికారులు రిలీవ్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

Municipal Employees : మమ్మల్ని పంపేయండి!

  • ‘వరద’ డ్యూటీలకు వచ్చిన మున్సిపల్‌ సిబ్బంది గగ్గోలు

  • పని పూర్తయినా... రిలీవ్‌ చేయకపోవడంపై ఆందోళన

అమరావతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి నగరానికి వచ్చిన మున్సిపల్‌ ఉద్యోగులు, అధికారులు రిలీవ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. విపత్తు నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో సహాయక చర్యల నిమిత్తం వీరంతా విజయవాడ వచ్చారు. 61, 62, 63, 64 వార్డుల్లో మాత్రం ఇప్పటికీ నీళ్లు ఉండటంతో అక్కడ ఇంకా సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరముంది. ఇందుకోసం ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు సరిపోతారు.

మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సిబ్బందికి వసతి, ఆహార సదుపాయాలు కల్పించడం స్థానిక అధికారులకు కొంత కష్టంగా మారింది. కొన్నిచోట్ల సిబ్బందికి కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాల్లో వసతి ఇచ్చారు. అయితే అక్కడ అంత మందికి సరైన వసతులు అందక కొంత మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల సిబ్బందిని విజయవాడకు తరలించడంతో అక్కడ మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరతతో సమస్యలు నెలకొన్నాయి.. వాస్తవానికి విజయవాడలో ముంపు సహాయక చర్యలు చేపట్టేందుకు తమ అవసరం ఇక పెద్దగా ఉండకపోయినా, మున్సిపల్‌ శాఖ నుంచి ఆదేశాలు రాకపోవడంతో ఇక్కడే ఉండాల్సి వస్తుందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు.

ఇప్పటికే పలు మున్సిపాలిటీల పరిధిలో వర్షాల కారణంగా పారిశుధ్యం మెరుగుపరిచే సిబ్బంది లేకపోవడంతో అక్కడ పరిస్థితులు గాడి తప్పేట్లు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. విజయవాడలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినందున ఇక ఈ ప్రాంతంలో చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలను విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చేసుకోగలదని ఆ అధికారులు పేర్కొంటున్నారు. మంత్రి నారాయణ చొరవ చూపించి ఉద్యోగులను రిలీవ్‌ చేసి మిగతా మున్సిపాలిటీల్లో పారిశుధ్యం మెరుగుపరిచేలా చూడాలని కోరుతున్నారు.

Updated Date - Sep 13 , 2024 | 04:28 AM

Advertising
Advertising