Nandigam Suresh: హైదరాబాద్‌లో మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్..
ABN, Publish Date - Sep 05 , 2024 | 07:13 AM
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో మంగళగిరి రూరల్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్‌పై కేసు నమోదు చేయడం జరిగింది.
గుంటూరు: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. కొన్నిరోజులుగా ఆయన్ను వేటాడుతున్న పోలీసులు గురువారం నాడు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. మంగళగిరి రూరల్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. సురేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో నందిగం సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నం చేస్తున్నారని సమాచారం అందుకున్న హైదరాబాద్‌కు వెళ్లి పోలీస్ ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయి. సురేష్‌ను గుంటూరు జిల్లాకు పోలీసులు తరలిస్తున్నారు. ముందుగా ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు.
పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడిన నందిగం సురేష్ కోర్టు తీర్పు రావడమే ఆలస్యం.. అబ్‌స్కాండ్ అయిపోయారు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో రాష్ట్రం దాటి వెళ్లిపోయారంటూ టాక్ నడిచింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ కూడా నిందితుడు కావడంతో తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నందిగం సురేష్‌ను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి పోలీసులు వెళ్లగా.. ఆయన ఇంట్లో లేరని అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో సురేష్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. మొత్తానికి పక్కా సమాచారంతో హైదరాబాద్‌లో నందిగం సురేష్‌ను అరెస్ట్ చేయడం జరిగింది.
వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన హైకోర్టు..
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, నందిగాం సురేష్, తలశిల రఘురామ్ సహా మరో 14 మంది నిందితులుగా ఉన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని అప్పట్లో వీరంతా ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడటమే కాకుండా ఆ ప్రాంతంలో వీరంగం సృష్టించారు. టీడీపీ అధికారంలోకి రాగానే.. వీరంతా తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని, అరెస్ట్ నుంచి రక్షించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించే ప్రసక్తే లేదని ఏపీ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Updated Date - Sep 05 , 2024 | 07:28 AM