మహిళల ఆర్థిక స్వావలంబనే చంద్రబాబు లక్ష్యం
ABN, Publish Date - Dec 20 , 2024 | 05:07 AM
మహిళల ఆర్థిక స్వావలంబనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఆయన సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు.
ఎన్టీఆర్ ట్రస్టు సేవలు విస్తరిస్తాం: నారా భువనేశ్వరి
కుప్పంలో పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం
కుప్పం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మహిళల ఆర్థిక స్వావలంబనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఆయన సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ట్రస్టు సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరిస్తామని చెప్పారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంలో నాలుగు రోజుల పర్యటన కోసం వచ్చిన ఆమె, మొదటిరోజైన గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో మమేకమై, వారికి దిశానిర్దేశం చేశారు. పట్టుదల, కృషి, క్రమశిక్షణతో ఏదైనా సాధించగలమన్నారు. డ్రగ్స్, సోషల్ మీడియాకు బానిసలు కావద్దని హితవు పలికారు. తానిక్కడకు ముఖ్యమంత్రి భార్యగానో లేదా ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీగానో రాలేదన్నారు. ఒక యువతరం మేలుకోరే తల్లిగా కొన్ని మంచి మాటలు చెప్పిపోవడానికి వచ్చానన్నారు. తాను కూడా హౌస్ వైఫ్‌గా ఉంటూ చంద్రబాబు ఆదేశం మేరకు హెరిటేజ్ ఎండీగా బాధ్యతలు తీసుకునే నాటికి బయటి ప్రపంచమే తెలియదన్నారు. అయితే స్వయంకృషితో, తన శక్తిమీద తనకు నమ్మకంతో, టీం వర్క్‌తో సంస్థను ఉన్నత స్థానానికి తీసుకు రాగలిగానని చెప్పారు. కష్టపడితే ఫలితం దక్కుతుందన్నారు. తన కుమారుడు లోకేశ్‌కు కూడా ఇదే చెబుతానన్నారు. అనంతరం గుడుపల్లె మండలం నలగాంపల్లెలో మహిళలతో మమేకమయ్యారు. వారి సమస్యలు విని, చంద్రబాబుకు చెప్పి పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.
తాను ఎన్నికల ముందు చెప్పినట్టుగా ప్రతి మూడు నెలలకోసారి నియోజకవర్గానికి వస్తున్నానని, భవిష్యత్తులో కూడా వస్తానని తెలిపారు. ప్రతి గ్రామానికీ వచ్చి సమస్యలు వింటానని, ఆ విన్న సమస్యలను చంద్రబాబుకు నివేదించి తీర్చడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. కుప్పాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ట్రస్టు తరఫున కూడా మహిళల ఆర్థిక స్వావలంబనకు అవసరమైన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు. అనంతరం కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్టు తరఫున నడుస్తున్న స్కిల్ డెవలప్ సెంటర్ విస్తరణ తరగతులను ఆమె ప్రారంభించారు. ఇక్కడ మహిళలు ఉత్పత్తి చేసిన జూట్ బ్యాగులు, గాజులు వంటి వాటిని పరిశీలించారు. మార్కెటింగ్ సౌకర్యాన్ని మెరుగు పరుస్తామని హామీ ఇచ్చారు. కుట్టు శిక్షణలో ఉన్న యువతులతో మాట్లాడి వారికి ఉపాధి కూడా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ట్రస్టు తరఫున నడుస్తున్న ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్‌కు వెళ్లి, అక్కడ విద్యార్థులను ఉత్తేజపరిచారు. ఇంకా ఢిల్లీలోని క్రాక్ అకాడమీ తరఫున కుప్పంలో త్వరలోనే సివిల్స్‌కు ఉచిత కోచింగ్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారని చెప్పారు. అనంతరం కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ట్రస్టు తరఫున తోపుడు బండ్లు, మూడు చక్రాల సైకిళ్లు, వినికిడి యంత్రాలు, కుట్టు మిషన్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ కుప్పంలో ట్రస్టు తరఫున ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకా పలు సేవలను ట్రస్టు తరఫున విస్తరిస్తామని చెప్పారు. అంతకుముందు శాంతిపురం మండలం కడపల్లె వద్ద నిర్మిస్తున్న సొంత ఇంటి పనులను ఆమె పరిశీలించారు.
Updated Date - Dec 20 , 2024 | 05:07 AM