AP Elections: నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో వైసీపీ పరిస్థితి ఏంటో తెలుసా?
ABN, Publish Date - Apr 18 , 2024 | 04:49 PM
ముచ్చటగా మూడోసారి మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడుతుందా? అంటే సందేహమేననే ఓ చర్చ అయితే నియోజకవర్గంలో హల్‌చల్ చేస్తోంది. వరుసగా జరిగిన గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో దిగి.. గెలిచారు. కానీ ఈ సారి నియోజకవర్గంలో ఆ పార్టీకి ప్రతికూల ఉన్నాయనే ప్రచారం నడుస్తుంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024లో రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతున్న నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో ఇక్కడ గెలిచారు. కానీ ఈ సారి నియోజకవర్గంలో ఆ పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయనే ప్రచారం నడుస్తుంది. మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నారా లోకేశ్‌ను ఓడించేందుకు అధికార వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
మంగళగిరిలో తొలుత నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు గంజి చిరంజీవికి వైసీపీ అధిష్ఠానం కట్టబెట్టింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలకబూనారు. వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. అనంతరం వైయస్ షర్మిల సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన మళ్లీ జగన్ పార్టీలో చేరారు.
AP Elections: మళ్లీ కుప్పం బయలుదేరిన భువనమ్మ
గంజి చిరంజీవి అభ్యర్థిత్వాన్ని ఆళ్ల రామకృష్ణా రెడ్డి వ్యతిరేకించడంతో నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి చిరంజీవిని తప్పించి.. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలకు అప్పగించారు. ఆ కొద్ది రోజులకే అమె కోడలు కాండ్రు లావణ్యను బరిలో దించారు. మరోవైపు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. అంతలో మరో కొత్త వైసీపీ అభ్యర్థిని బరిలో దింపినా అందులో ఆశ్చర్య పడనక్కర్లేదనే ఓ చర్చ సైతం నియోజకవర్గంలో నడుస్తోంది.
ఇంకోవైపు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నారా లోకేశ్ ఓడిపోయారు. అయినా నాటి నుంచి ఆయన నియోజకవర్గ ప్రజల మధ్యే ఉంటూ వస్తున్నారు. నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మొబైల్ వైద్య సేవలు సైతం అందజేస్తున్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా నేనున్నానంటూ... ప్రజల మధ్యకు ఆయన వస్తున్నారు.
ఈ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటూ బీజేపీ, జనసేన, టీడీపీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఆ కూటమి అభ్యర్థిగా నారా లోకేశ్ బరిలో దిగుతున్నారు. ఇక ప్రతిపక్షనేతగా వైయస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి మద్దతు ప్రకటించారు.
YS Sharmila: వైయస్ జగన్ అవసరమా?
కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రకటన చేశారు. దీంతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని భూములే కాకుండా... ఆ పక్కనే ఉన్న రాజధాని భూముల ధరలు సైతం పాతాళంలోకి పడిపోయాయి. అదికాక జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ అయిదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఎంత అని ప్రశ్నిస్తే.. చెప్పే వారు వైసీపీలోనే లేరనే ఓ చర్చ సైతం నియోజకవర్గంలో సాగుతోంది.
ఇటువంటి పరిస్థితుల్లో మంగళగిరిలో ఫ్యాన్ పార్టీ గెలుపునకు అవకాశాలు లేవనే ఓ చర్చ సైతం వాడి వేడిగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో నారా లోకేశ్‌ను ఓడించేందుకు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. కానీ ఆయన అంత క్రియాశీలకంగా వ్యవహరించడం లేదనే ఓ ప్రచారం సైతం నడుస్తుంది.
ఇటువంటి పరిస్థితుల్లో మంగళగిరిలో ముచ్చటగా మూడోసారి ఫ్యాన్ గాలీ వీచేనా అంటే సందేహమేనని సదరు నియోజకవర్గంలో ఓ చర్చ సైతం వాడి వేడిగా హల్‌చల్ చేస్తోంది. ఇక మంగళగిరి నియోజకవర్గంలో వైసీసీ నుంచి టీడీపీలోకి చేరికలు నేటికి భారీగా కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం...
Updated Date - Apr 18 , 2024 | 05:07 PM