Nellore: నెల్లూరుకు మహర్దశ.. మంత్రి నారాయణ ఏం చెప్పారంటే..
ABN, Publish Date - Dec 17 , 2024 | 03:00 PM
గత ఐదేళ్లపాటు నెల్లూరు ప్రజలు కట్టిన పన్నులు రూ.3,200 కోట్లను వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టేసిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. అప్పటి ప్రభుత్వం చట్టం, నిబంధనలు, జీవోలను పక్కన పెట్టేసిందని ఆయన ధ్వజమెత్తారు.
నెల్లూరు: గత టీడీపీ ప్రభుత్వం 14 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడితే, గత ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైసీపీ వాటిని నిర్వీర్యం చేసిందని ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) ఛైర్మన్‌గా శీనయ్య(శ్రీనివాసులు రెడ్డి) రెండోసారి బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. ప్రభుత్వం తరఫున నుడా అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని నారాయణ చెప్పారు. ఈ సందర్భంగా నుడా ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. " అర్బన్ పాపులేషన్ శరవేగంగా పెరుగుతోంది. 24 శాతం నుంచి 36 శాతానికి అర్బన్ పాపులేషన్ పెరిగింది. 2030 నాటికి 50 శాతం వరకూ పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో 14 అర్బన్ అథారిటీలను టీడీపీ ప్రభుత్వమే తీసుకొచ్చింది. వాటిని అభివృద్ధి చేసేందుకు అనేక చర్యలు చేపట్టింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఐదేళ్లపాటు నిర్లక్ష్యం వహించి పనులను నిర్వీర్యం చేసింది. ఐదేళ్లపాటు నుడా నిధులను వైసీపీ వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యింది. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 365 రోజులూ తాగునీరు అందించే పథకాలను త్వరలో పూర్తి చేయనున్నాం.
లేఅవుట్ వేయాలంటే12 మీటర్లు వెడల్పు ఉన్న రోడ్డు ఉండాలి, కానీ కొంతమంది 9 మీటర్ల రోడ్లు వేసి విక్రయిస్తున్నారు. అయిదు అంతస్తుల వరకూ డిజైన్ చేసిన వారికి లైసెన్స్ ఉన్న ఇంజనీర్ అనుమతులు కోరితే వెంటనే మంజూరు చేస్తాం. ఈనెలాఖరు లోపు ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మార్పులు, నిబంధనలను విడుదల చేస్తుంది. ముంబై సిక్కో అర్బన్ అథారిటీని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అర్బన్ అథారిటీ అభివృద్ధి చెందాలంటే భూములు కావాలి. ముందుగా ల్యాండ్స్‌ని తీసిపెట్టుకుంటే భవిష్యత్తులో జరిగే అభివృద్ధికి దోహదపడతాయి. డబ్బులు జనరేట్ చేయాలనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లోని అర్బన్ అథారిటీల పర్యటించి చూస్తున్నాం.
ప్రజలు కట్టిన పన్నులు రూ.3,200 కోట్లను గత వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది. అప్పటి ప్రభుత్వం చట్టం, నిబంధనలు, జీవోలను పక్కన పెట్టేసింది. నుడా ఛైర్మన్ శ్రీనివాసులు రెడ్డికి అందించాల్సిన సహకారం అందిస్తాం. గతంలో ఆయన నెల్లూరు నగరంలో నెక్లెస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. త్వరలో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని తిరిగి చేపడుతాం. టిడ్కో లబ్ధిదారులకు లోన్లు ఇప్పించి అర్హులకు గత ప్రభుత్వం ఇళ్లు ఇవ్వలేదు. చేతివృత్తులు చేసుకునే విధంగా టిడ్కో ఇళ్ల ప్రాంగణంలో పది శాతం స్థలం కేటాయించాలని మెప్మాకి ఆదేశాలు ఇచ్చా. నుడా పరిధిలో ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్స్ వేసి విక్రయించి, తద్వారా నుడాకు నిధులు సమకూర్చే ప్రయత్నం చేస్తున్నామని" చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
YSRCP : సజ్జల భార్గవ్ కేసుల వివరాలన్నీ ఇవ్వండి
Political Conflict : వైసీపీ నేతల ఆగడాలు అడ్డుకోండి
AP Skill Development : ఏపీలో 532 స్కిల్ హబ్‌లు
Read Latest AP News and Telugu News
Updated Date - Dec 17 , 2024 | 03:02 PM