Nilayapalem Vijaykumar : సంపద సృష్టి అంటే ఇదీ!
ABN, Publish Date - Oct 11 , 2024 | 04:18 AM
రాష్ట్రంలో నాలుగు నెలల పాలనలోనే రూ.60 వేల కోట్ల ప్రాజెక్టులు సాధించి.. సంపద సృష్టించామని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ వెల్లడించారు.
4 నెలల్లోనే రూ.60 వేల కోట్ల ప్రాజెక్టులు: నీలాయపాలెం
అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నాలుగు నెలల పాలనలోనే రూ.60 వేల కోట్ల ప్రాజెక్టులు సాధించి.. సంపద సృష్టించామని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ వెల్లడించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి విజయదశమి నాటికి 4 నెలలవుతోందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక రాజధాని విశాఖకు టీసీఎస్ ఐటీ ఫెసిలిటీ వచ్చేస్తోందని, మొదటి దశలో 10 వేల మందితో కార్యాలయం ఏర్పాటు చేయనుందన్నారు. పరిశ్రమలు, ప్రాజెక్టుల ద్వారా సంపద సృష్టించి, కనీస పక్షంలో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నామన్నారు. జగన్ కేంద్రంతో మాట్లాడి అప్పులు చేస్తే, కూటమి ప్రభుత్వం పెట్టుబడులు తెస్తోందన్నారు.
గతంలో టీడీపీ హయాంలో అమరావతిలో 130 కేంద్ర, ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాల కోసం భూములిస్తే, జగన్ హయాంలో వారందరూ పారిపోయారన్నారు. మళ్లీ వాళ్లందరితో సంప్రదించి రిజర్వు బ్యాంకుతో సహా ఇప్పటి దాకా 121 సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు. రాయలసీమలో రెండు మణిహారాలు తామే తీసుకొచ్చామని, రూ.2,137 కోట్లతో కడప జిల్లా కొప్పర్తిలో, రూ.2,400 కోట్లతో కర్నూల్ జిల్లా ఓర్వకల్లులో బృహత్ పారిశ్రామిక హబ్‌లను నెలకొల్పుతున్నామని తెలిపారు. నాలుగు నెలల్లోనే ఇన్ని పనులు చేసిన కూటమి ప్రభుత్వం రాగల నాలుగేళ్ల 8 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఒక మంచి స్థానంలో నిలబెడుతుందనడంలో అతిశయోక్తి లేదన్నారు.
Updated Date - Oct 11 , 2024 | 04:18 AM