ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: నిస్సహాయంగా మారొద్దు

ABN, Publish Date - Dec 12 , 2024 | 04:29 AM

రాష్ట్రంలో అక్రమాలను అడ్డుకునే క్రమంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు నిస్సహాయంగా మారొద్దని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హితవు పలికారు.

ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు డిప్యూటీ సీఎం హితవు

అక్రమాలను మీరు అడ్డుకుంటే మంత్రులు వెళ్లక్కర్లేదు

మూలాలు కదిలించే స్థాయిలో వైసీపీ విధ్వంసం

అధికారులతో సినిమా టికెట్లు అమ్మించింది

అయినా ఐఏఎస్‌లు అభ్యంతరం చెప్పలేదు: పవన్‌

వైసీపీ పాలకులు ఎంత తెలివిగా వ్యవహరించారంటే... రాబోయే రెండేళ్ల ఆర్థిక సంఘం నిధులు కూడా వాడేశారు. అంటే కొత్త ఆర్థిక సంఘం ఏర్పడేవరకు నిధుల్లేని పరిస్థితి. 14వ ఆర్థిక సంఘం కాలంలో మేము రూ.22,112 కోట్లు తీసుకుంటే, 15వ ఆర్థిక సంఘం కాలంలో వైసీపీ ప్రభుత్వం ఏకంగా రూ.62 వేల కోట్లు డ్రా చేసింది. ఇది తెలిసి నేనే ఆశ్చర్యపోయా!

- చంద్రబాబు

అమరావతి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అక్రమాలను అడ్డుకునే క్రమంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు నిస్సహాయంగా మారొద్దని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హితవు పలికారు. వారు అడ్డుకుంటే ప్రత్యేకంగా మంత్రులు వెళ్లి తనిఖీలు చేయాల్సిన అవసరం ఉండదన్నారు. బుధవారం కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ.. ఇటీవల కాకినాడ ప్రాంతంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ చేపట్టిన తనిఖీలను ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం.. వ్యవస్థ మూలాలను కదిలించే స్థాయిలో విధ్వంసం చేసిందన్నారు. అందుకే విభేదాలు పక్కనపెట్టి ఎన్నికల్లో కూటమిగా పోటీ చేశామని. ప్రజలు తమ నుంచి చాలా ఆశిస్తున్నారని చెప్పారు. అయితే తాము ఎన్ని చెప్పినా అంతిమంగా క్షేత్ర స్థాయిలో అమలు చేసే బాధ్యత అధికారులదేనన్నారు. ‘గత వైసీపీ ప్రభుత్వం అధికారులను కూడా చాలా ఇబ్బంది పెట్టింది. చివరకు వారితో సినిమా టికెట్లు కూడా అమ్మించారు. అయినా ఇంతమంది ఐఏఎ్‌సలు, సీనియర్‌ అధికారులు ఉండి ఒక్కరూ అభ్యంతరం చెప్పలేదు.

అరాచకాలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇది చూసి మేం ఆశ్చర్యపోయాం. అందుకే అప్పట్లో రోడ్లపైకి రావలసి వచ్చింది’ అని తెలిపారు. గత ప్రభుత్వంలో పాలన గుడ్డిగా సాగిందన్నారు. అప్పులు రూ.10 లక్షల కోట్లకు చేరాయని.. ఇప్పటికీ డబ్బుల్లేని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఇటీవల శ్రీసత్యసాయి జిల్లాలో కొందరు ఉద్యోగులకు నిధుల లేమితో జీతాలు ఇవ్వలేకపోయామని.. సీఎంతో మాట్లాడి రూ.30 కోట్లు విడుదల చేయించుకున్నామని గుర్తుచేశారు. కాకినాడలో మూడు చెక్‌పోస్టులు పెట్టినా బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. ఇది కలెక్టర్‌, ఎస్పీల బాధ్యత. స్మగ్లింగ్‌ను వదిలేయకూడదు. మేం డబ్బుల కోసం ఇక్కడికి రాలేదు.. ప్రజల కోసం అధికారంలోకి వచ్చాం. అక్రమాల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని సీఎం హెచ్చరించారు. పాలనలో ఆంధ్రప్రదేశ్‌ మోడల్‌ కావాలి. గత ప్రభుత్వంలో పాలన ఎలా ఉండకూడదో చూశాం. ఇప్పుడు ఎలా ఉండాలో చూపించాలి’ అని సూచించారు.


ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంటున్నాయి: సీఎస్‌

ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల పరిష్కారంలో వేగం లేదని సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ తెలిపారు. చాలా ఫిర్యాదులు పెండింగ్‌లోనే ఉంటున్నాయన్నారు. స్వర్ణాంధ్ర-2047లో 10 సూత్రాలు ఉన్నాయని, అమరావతి, పోలవరం అత్యంత కీలక అంశాలని తెలిపారు. జిల్లాల పాలన చాలా ముఖ్యమన్నారు.

శాఖలు బాధ్యతాయుతంగా ఖర్చుచేయాలి: పయ్యావుల

‘‘ఎక్సైజ్‌, వాణిజ్య పన్నులు, రిజిస్ర్టేషన్ల శాఖల ద్వారా ఆదాయం సమకూరుతోంది. మిగిలిన శాఖలు పథకాలు, కార్యక్రమాల ద్వారా నిధులు వినియోగిస్తాయి. ఆ ఖర్చుల విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలి’ అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. గత ప్రభుత్వం రూ.10లక్షల కోట్లు అప్పులు చేసిందని.. వాటికి వడ్డీలు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. గత ప్రభుత్వంలో వచ్చిన ఆదాయం జీతాలకు కూడా చాల్లేదన్నారు. ఇంకా ఇప్పుడు 1.3 లక్షల కోట్లు చెల్లించాల్సిన బిల్లులున్నాయని తెలిపారు.

7.85 లక్షల ఇళ్ల లబ్ధిదారులు పత్తా లేరు: అనగాని

గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల పంపిణీలో అక్రమాలు జరిగాయని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చెప్పారు. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల్లో 7.85 లక్షల మంది ఆచూకీ లేదన్నారు. అలాగే కొంతమంది ఇళ్ల పట్టాలు అమ్ముకుంటున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫ్రీహోల్డ్‌ పేరుతో 4లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములు లాక్కున్నారని.. రాబంధుల్లా భూములు ఆక్రమించుకున్నారని, అందుకే రెవెన్యూ సదస్సుల్లో భూవివాదాలపై 98వేల ఫిర్యాదులు అందాయని తెలిపారు. వీటిని అరికట్టేందుకే ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం తెచ్చామన్నారు. కబ్జా చేస్తే 10 నుంచి 15 ఏళ్ల వరకు శిక్ష పడుతుందన్నారు.

Updated Date - Dec 12 , 2024 | 04:29 AM