Pawan Kayan : పల్లెలకివ్వకుండా ప్యాలెస్‌కు 500 కోట్లా?
ABN, Publish Date - Oct 22 , 2024 | 04:46 AM
‘రుషికొండలో ప్యాలెస్‌లు కట్టడానికి 500 కోట్లు ఖర్చుచేశారు.
జలజీవన్ మిషన్ కింద గత ఐదేళ్లు కేంద్రం నిధులు మంజూరు చేసినా రాష్ట్రం తన వాటా నిధులు ఇవ్వలేదు. 15వ ఆర్థిక సంఘం, పంచాయతీల నిధులను గత పాలకులు దారిమళ్లించారు. దీంతో పంచాయతీల నిర్వహణ కష్టతరంగా మారింది. అప్పటి పాపాలు ఇప్పుడు ప్రజలను పూర్తి స్థాయిలో చుట్టు ముడుతున్నాయి.
- డిప్యూటీ సీఎం పవన్
అవి మంచినీటికి కేటాయిస్తే బావుండేది.. జగన్ సర్కారుపై డిప్యూటీ సీఎం ఫైర్
డయేరియా ప్రబలిన గుర్లలో పర్యటన.. ఆస్పత్రిలో బాధితులకు పరామర్శ
మృతుల కుటుంబాలకు భరోసా.. సొంతంగా రూ.లక్ష సాయం ప్రకటన
కలుషిత నీటితో పది మంది చనిపోవడం బాధాకరం
గత ఐదేళ్లలో ఆర్థిక సంఘం, పంచాయతీల డబ్బు దారిమళ్లించారు
పారిశుధ్యంపై నిర్లక్ష్యం చేశారు.. ఆ ప్రభుత్వంపై నెట్టేసి బాధ్యత నుంచి తప్పించుకోం
సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టిపెట్టారు.. నివేదిక రాగానే ఎక్స్‌గ్రేషియాపై నిర్ణయం: పవన్
రుషికొండ ప్యాలెస్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
విజయనగరం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘రుషికొండలో ప్యాలెస్‌లు కట్టడానికి 500 కోట్లు ఖర్చుచేశారు. కానీ... గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, మంచినీటి సరఫరా కోసం నిధులిచ్చేందుకు మాత్రం నాటి వైసీపీ పాలకులకు మనసు రాలేదు. ఆ నిధులు సద్వినియోగం చేసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చి ఉండేవి కాదు’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. డయేరియా ప్రబలిన విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో సోమవారం ఆయన పర్యటించారు. ఆ తర్వాత కలెక్టరేట్‌లో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, అక్కడే మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు ప్రాథమిక హక్కు అని, గుర్లలో డయేరియాతో 10 మంది వరకు చనిపోవడం బాధాకరమని అన్నారు. మృతుల సంఖ్య విచారణలో తెలుస్తుందన్నారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను వారసత్వంగా తీసుకోకూడదని, ఇప్పుడు ఎవరినీ నిందించే సమయం కాదని తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఈ సమస్యను లోతుగా విశ్లేషిస్తే.. గత ఐదేళ్లు ప్రభుత్వం పంచాయతీ నిధులు సద్వినియోగం చేయలేదని, పారిశుధ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. అలాగని గత ప్రభుత్వం మీద నెట్టేసి తాము బాధ్యతల నుంచి తప్పుకోలేదన్నారు. గుర్ల ఘటనపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని, ఇందుకోసం సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్‌ను నియమించార ని, దీనిపై ఆయన నివేదిక ఇస్తారని చెప్పారు. ఆ తర్వాత మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. తాను మానవతా కోణంలో మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం అందిస్తానని ప్రకటించారు. ఇటీవల గుడివాడలోని వెలుగొండలో పల్లె పండగలో కలుషిత నీటి సమస్యపై ప్రజలు చెప్పారని, వెంటనే నీటి పరీక్షలు జరిపించి నిధులు కేటాయించామని చెప్పారు. గుర్లలో చంపావతి తాగునీటి సోర్స్ పాయింట్ పరిశీలించామని, ఒక లైన్ గుర్లకు.. మరో లైన్ గరివిడికి వెళ్తున్నాయని, గుర్ల వెళ్లే లైన్‌లో నీరు కలుషితమైనట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలో వాగులు, గెడ్డలను పరిశభ్రంగా ఉండేలా చేస్తామన్నారు. ఈ నెల 18వ తేదీన జలజీవన్ మిషన్ పనులకు సంబంధించి రూ.580 కోట్లు విడుదల అయ్యాయని, ఆ నిధులను పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నామని తెలిపారు. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కిమిడి కళా వెంకట్రావు, కోళ్ల లలిత కుమారి, పూసపాటి అదితి గజపతిరాజు, లోకం మాధవి, జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్, మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీలో వైద్యసేవలపై పవన్ ఆరా
డిప్యూటీ సీఎం పవన్ చంపావతి నదిలోని పంపుహౌస్‌ను కూడా పరిశీలించారు. అక్కడి నుంచి గుర్ల పీహెచ్‌సీకి వచ్చి డయేరియా బాధి తులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించారు. అక్కడి నుంచి గ్రామంలోకి వెళ్లారు. రామమందిరం వద్ద ఉన్న కలిశెట్టి సీతమ్మ ఇంటి వద్దకు వెళ్లారు. బాధితులు, మృతుల కుటుంబ సభ్యులను అక్కడకు పిలిపించి మాట్లాడారు. ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తాను సొంతంగా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు.
డిప్యూటీ సీఎం రుషికొండ సందర్శన
విశాఖపట్నం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం పర్యాటకం పేరుతో రుషికొండపై రూ.500 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన భవన సముదాయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం సాయంత్రం పరిశీలించారు. గుర్లలో డయేరియా బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఆయన తిరుగుప్రయాణంలో ఆకస్మికంగా రుషికొండను సందర్శిం చారు. విశాఖపట్నం టీడీపీ ఎంపీ ఎం.శ్రీభరత్, ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, కూటమి నాయకులతో కలిసి.. లోపలకు వెళ్లకుండా బయటి నుంచే ఆ భవనాన్ని ఆమూలాగ్రం చూశారు. భవనం నిర్మాణంలో ఉన్నప్పుడు నిరుడు ఒకసారి ఆయన దానిని చూడడానికి వెళ్లగా అప్పటి ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఆయన బయట రోడ్డు పైనుంచే చూసి వెళ్లిపోయారు. తాజాగా ‘రుషికొండ.. గుదిబండ’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించడంతో ఆ ప్యాలెస్‌ను ఏ విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుందో అంచనా వేయడానికి పవన్ వచ్చినట్లు జనసేన నాయకులు తెలిపారు. పూర్తి సమాచారం తెప్పించుకుని దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. దీనిపై తర్వాత మాట్లాడతానని పవన్ విలేకరులకు తెలిపారు. రుషికొండ భవన ప్రాంగణం సమీపంలో కూలిపనులు చేసుకుంటున్న వారు రాగా ఆయన వారితో మాట్లాడి ఫొటోలు దిగారు. ఈ పర్యటనలో పవన్ అభిమాని ఒకరు కారుకు అడ్డుపడగా పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
దివ్యాంగురాలికి పవన్ భరోసా
విజయనగరం అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): గుర్ల గ్రామానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసేందుకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మెయిద గ్రామానికి చెందిన దివ్యాంగురాలు బి.రమాదేవి మండుటెండలో రోడ్డుపక్కన కూర్చుంది. ఆమెను చూసి కారు ఆపిన పవన్ సమస్య తెలుసుకున్నారు. తనకు రూ.6 వేలు మాత్రమే ఫించన్ ఇస్తున్నారని, 90 శాతం వైకల్యం ఉన్నవారికి రూ.15 వేలు ఇవ్వాల్సి ఉందని రమాదేవి కోరిది. అధికారుల తో మాట్లాడతానని పవన్ ఆమెకు భరోసా ఇచ్చారు.
Updated Date - Oct 22 , 2024 | 04:47 AM