Peethala Sujatha : మాట ఇచ్చాం.. నిలబెట్టుకొన్నాం
ABN, Publish Date - Oct 20 , 2024 | 05:15 AM
ప్రభుత్వ పాఠశాలలను భ్రష్టు పట్టించిన జీవో 117ను రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నామని మాజీ మంత్రి, టీడీపీ నేత పీతల సుజాత పేర్కొన్నారు.
జీవో 117 రద్దుపై పీతల సుజాత
అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలను భ్రష్టు పట్టించిన జీవో 117ను రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నామని మాజీ మంత్రి, టీడీపీ నేత పీతల సుజాత పేర్కొన్నారు. శనివారం ఆమె ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జీవో 117 రద్దు నిర్ణయం తీసుకొన్న మంత్రి లోకేశ్‌కు అభినందనలు తెలిపారు. ‘వైసీపీ సర్కార్ హయాంలో తెచ్చిన జీవో విద్యార్ధుల పాలిట శాపంగా మారింది. లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి వెళ్లిపోయారు. జగన్మోహన్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో విద్యారంగం సర్వనాశనం అయింది. ఇష్టానుసారం చేసి పాఠశాల విద్యను పనికి రాకుండా చేశారు’ అని సుజాత విమర్శించారు. ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద కాపలా పెట్టడం, మరుగుదొడ్లు శుభ్రం చేయించడం వంటి చర్యలతో జగన్ వారిని తీవ్రంగా అవమానించారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీచర్లపై ఒత్తిడి తగ్గించామని, ఒకటో తేదీన జీతాలు ఇవ్వడంతోపాటు మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచామని చెప్పారు. రానున్న కాలంలో విద్యా రంగాన్ని మరింత తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
Updated Date - Oct 20 , 2024 | 05:15 AM