Share News

pension : పింఛన్ల పండగ నేడే అవ్వాతాతల చేతికి 7 వేలు

ABN , Publish Date - Jul 01 , 2024 | 04:45 AM

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం లబ్ధిదారులకు పెంచిన పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.

pension : పింఛన్ల పండగ నేడే అవ్వాతాతల చేతికి 7 వేలు

ఉదయమే లబ్ధిదారుల ఇళ్ల వద్ద పంపిణీ

టీడీపీ కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్ల పంపిణీలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్కో పెన్షన్‌దారుకు నెలకు రూ.4 వేలు ఇవ్వనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్‌ 4 వేలతో పాటు గత మూడు నెలలకు 3 వేలు (నెలకు 1000) బకాయి కలిపి ఒకేసారి 7 వేలు అందజేయనుంది.

ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా నెలకు 4 వేల పెన్షన్‌

గత 3 నెలల 3 వేలు కలిపి ఒకేసారి 7 వేలు

రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల పంపిణీ

ప్రభుత్వంలో సరికొత్త అధ్యాయం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం లబ్ధిదారులకు పెంచిన పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. మొత్తం 1,20,097 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటిరోజే చాలావరకు పెన్షన్లు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్‌జెండర్లు వంటి వారికి ఇకపై ప్రతినెలా రూ.4 వేలు పెన్షన్‌ ఇవ్వనున్నారు. దివ్యాంగులకు రూ.3 వేల నుంచి ఒకేసారి రూ.6 వేలకు పెంచారు. తీవ్ర అనారోగ్యంతో ఉండే వారికి రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పెంచారు. ఈ విభాగంలో పెన్షన్‌ పొందే వారు 24,318 మంది ఉన్నారు. పింఛన్ల పెంపువల్ల ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్లు అదనపు భారం పడనుంది. ఒక్క రోజులో రూ.4408 కోట్లు పంపిణీ చేయనున్నారు. గడచిన మూడు నెలలకు కలిపి పెంచిన మొత్తం ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1,650 కోట్లు అదనపు భారం పడనుంది. గత ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీకి నెలకు రూ.1,939 కోట్లు ఖర్చయ్యేది. చంద్రబాబు ప్రభుత్వం ప్రతి ఏటా పింఛన్ల కోసం రూ.34 వేల కోట్లు ఖర్చు చేయనుంది.

పండుగ వాతావరణం

మూడు నెలల బకాయితో కలిపి ఒకేసారి రూ.7 వేలు పెన్షన్‌ ఇస్తుండటంతో అవ్వాతాతలు సంబరపడుతున్నారు. పెన్షన్ల పంపిణీని పండుగలా నిర్వహించేలా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రాజకీయ నేతలు ఈ పండుగను నిర్వహిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఐదు హామీలపై మొదటి ఐదు సంతకాలు చేసిన చంద్రబాబు వాటి అమలుకు శ్రీకారం చుట్టారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పెన్షన్లు పంపిణీకి శ్రీకారం చుట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో సచివాలయ ఉద్యోగులకు పెన్షన్ల పంపిణీ బాధ్యత అప్పగించకుండా అకౌంట్లలో జమచేసి పెన్షన్‌దారులను ఇబ్బందులు పెట్టారు. 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నప్పటికీ అప్పట్లో అధికారులు అంగీకరించలేదు. సచివాలయ ఉద్యోగుల ద్వారా పకడ్బందీగా పెన్షన్ల పంపిణీ చేపట్టవచ్చని నిరూపించేందుకు కూటమి సర్కార్‌ చర్యలు ప్రారంభించింది.

రూ.75తో ప్రారంభం

ఒకప్పుడు రూ.75తో ప్రారంభమైన సామాజిక పెన్షన్‌ ఇప్పుడు ఏకంగా రూ.4 వేలకు పెరిగింది. పెన్షన్‌ పెంపుపై ప్రతిసారీ టీడీపీ ప్రభుత్వమే చొరవ తీసుకుంది. మొదట్లో ఎన్టీఆర్‌ రూ.75తో పెన్షన్‌ ప్రారంభించారు. తర్వాత వైఎస్‌ హయాంలో రూ.200 చేశారు. 2014లో చంద్రబాబు ఐదు రెట్లు అంటే రూ.1000కు పెంచారు. 2019 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు పెన్షన్‌ మొత్తాన్ని రూ.2 వేలకు పెంచారు. వైసీపీ సర్కార్‌ వచ్చాక ఐదేళ్లలో విడతల వారీగా రూ.3 వేలు చేసింది. టీడీపీ కూటమి ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఏకంగా రూ.4 వేలు లభిస్తోంది.

Updated Date - Jul 01 , 2024 | 04:45 AM