ప్లీజ్.. నన్ను విడిచి వెళ్లొద్దు!
ABN, Publish Date - Aug 31 , 2024 | 04:24 AM
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి దెబ్బమీద దెబ్బ తగులుతోంది.
ఎంపీలకు జగన్ వేడుకోలు
రాజ్యసభలో బలం వల్లే ఢిల్లీలో నాకు గౌరవం
మీరు వెళ్లిపోతే ఆ పదవులన్నీ టీడీపీకే
ఇది వెన్నుపోటేనంటూ నిష్ఠూరం
మీడియా ముందుకు అయోధ్య, బోస్
జీవితాంతం జగన్ వెంటే ఉంటామని వెల్లడి
మేడా, బాబూరావూ వెళ్లరని వ్యాఖ్య
అటు మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు గుడ్‌బై
కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి రాజీనామా
అమరావతి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి (YS Jagan Mohan Reddy) దెబ్బమీద దెబ్బ తగులుతోంది. రాజ్యసభకు ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్‌రావు రాజీనామా చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తనకు సన్నిహితులుగా ఉన్న ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభా్‌షచంద్రబోస్, గొల్ల బాబూరావుతో పాటు మేడా రఘునాథరెడ్డి, ఆర్.కృష్ణయ్య కూడా రాజీనామాలు చేయబోతున్నారని భారీఎత్తున ప్రచారం సాగుతుండడంతో కలతచెందిన మాజీ సీఎం.. బుజ్జగింపు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీని, తనను వదిలిపోవద్దని అభ్యర్థించారు. రాజ్యసభలో వైసీపీకి ఉన్న బలం వల్లే ఢిల్లీలో తనను గౌరవిస్తున్నారని.. మీరు రాజీనామా చేస్తే.. ఉప ఎన్నికల్లో ఆ పదవులన్నీ టీడీపీకి వెళ్లిపోతాయని చెప్పారు. రాజీనామా చేయడం తనకు వెన్నుపోటు పొడవడమేనని నిష్ఠూరం ఆడినట్లు సమాచారం. ఈ బుజ్జగింపుల ప్రభావమో ఏమో..అయోధ్యరామిరెడ్డి, బోస్ శుక్రవారం తాడేపల్లి ప్యాలెస్ ప్రాంగణంలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. తాము జీవితాంతం జగన్ వెంటే ఉంటామన్నారు. తనకు వ్యక్తిగతంగా నష్టాలు, కష్టాలూ ఉన్నా వైసీపీని వీడడం లేదని.. రాజ్యసభకు రాజీనామా చేయడం లేదని అయోధ్యరామిరెడ్డి చెప్పారు. గొల్ల బాబూరావు, రఘునాఽథరెడ్డి కూడా పార్టీని వదిలివెళ్లరని అన్నారు. మీడియాకు ఈ విషయం చెప్పాలని జగన్ సూచించారని బోస్ వెల్లడించారు. తాము రాజ్యసభకు రాజీనామా చేస్తే ఆ పదవులు టీడీపీకి వెళ్లిపోతాయని.. అది ఒక విధంగా జగన్‌కు వెన్నుపోటు పొడవడంతో సమానమని వ్యాఖ్యానించారు.
కోలుకోక ముందే మరొకటి..!
ఇదే సమయంలో జగన్‌కు మరో షాక్ తగిలింది. కాకినాడ జిల్లాకు చెందిన కర్రి పద్మశ్రీ (గవర్నర్ కోటా), ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన బల్లి కల్యాణచక్రవర్తి (ఎమ్మెల్యే కోటా) శుక్రవారం మండలికి, పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే పోతుల సునీత (ఎమ్మెల్యే కోటా) కూడా ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మోపిదేవి, మస్తాన్‌రావుల రాజీనామాలను రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ గురువారమే ఆమోదించగా.. సునీత, పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తిల రాజీనామాలను ఆమోదించకుండా మండలి చైర్మన్ మోషేన్‌రాజు పెండింగ్‌లో పెట్టడం గమనార్హం. ఆమోదిస్తే ఇవి టీడీపీ కూటమి ఖాతాలోకి వెళ్లిపోతాయి. కాగా.. కొందరు వైసీపీ ముఖ్య నేతల వ్యవహార శైలినీ జగన్ శంకిస్తున్నట్లు తెలుస్తోంది.
నేడు పులివెందులకు జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం బెంగళూరు నుంచి పులివెందుల రానున్నారు. మూడు రోజులు ఇక్కడే పర్యటించనున్నారు. శనివారం ఉదయం ఆయన బెంగళూరు నుంచి కడప విమానాశ్రయం చేరుకుంటారు. రోడ్డు మార్గాన పెండ్లిమర్రి మండలం మాచునూరు, గొందిపల్లె గ్రామాలకు వెళ్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు బయల్దేరి పులివెందుల ఇంటికి చేరుకుంటారు. సోమవారం (సెప్టెంబరు 2న) తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్‌లో నివాళులు అర్పిస్తారు.
Updated Date - Aug 31 , 2024 | 07:44 AM