2027 మార్చి నాటికి పోలవరం తొలిదశ పూర్తి
ABN, Publish Date - Oct 06 , 2024 | 03:12 AM
పోలవరం సాగునీటి ప్రాజెక్టు తొలిదశ 41.15 మీటర్ల కాంటూరులో నీటిని నిల్వ చేసే పనులు 2027 మార్చినాటికి పూర్తి చేయాల్సిందేనని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అతుల్ జైన్ స్పష్టం చేశారు.
ఒకే సీజన్‌లో డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం
ఈసీఆర్‌ఎ్‌ఫతో సహా పూర్తిచేసేలా ప్రణాళిక
జలవనరుల శాఖకు పోలవరం ప్రాజెక్టు సీఈవో దిశానిర్దేశం
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): పోలవరం సాగునీటి ప్రాజెక్టు తొలిదశ 41.15 మీటర్ల కాంటూరులో నీటిని నిల్వ చేసే పనులు 2027 మార్చినాటికి పూర్తి చేయాల్సిందేనని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అతుల్ జైన్ స్పష్టం చేశారు. పీపీఏ సీఈవోగా బాధ్యతలు చేపట్టాక శనివారం ఆయన తొలిసారిగా ప్రాజెక్టు పరీశీలనకు వచ్చారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర పర్యటనలోనే ఉన్నారు. గురు, శుక్రవారాల్లో క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. శనివారం సహాయ పునరావాస కార్యక్రమాలు, ఆర్‌అండ్‌ఆర్ కాలనీలను పరిశీలించారు.
తొలి పర్యటనలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను అర్థం చేసుకున్నారు. శనివారం రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యే సమయంలో పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు నరసింహమూర్తి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకే సీజన్(నవంబర్ నుంచి జూలై)లో డయాఫ్రంవాల్ పూర్తి చేయాలని, ప్రధాన డ్యామ్ పనుల్లోని ఎర్త్ కం రాక్‌ఫిల్(ఈసీఆర్‌ఎఫ్) డ్యాం సహా అన్ని పనులూ పూర్తిచేసేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు.
నిధుల విడుదల బాధ్యత పీపీఏదే
పోలవరం ప్రాజెక్టులో ముఖ్య ఘట్టాలైన డయాఫ్రమ్ వాల్, ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ డ్యామ్, నిర్వాసితులకు సహాయ పునరావాస కార్యక్రమాలపై కేంద్ర సహకారం చాలా అవసరమని, ఎప్పటికప్పుడు నిధులను విడుదల చేస్తే తప్ప పనులు పూర్తికాబోవని పీపీఏ సీఈవో అతుల్ జైన్‌కు చీఫ్ ఇంజనీరు నరసింహమూర్తి వివరించారు. ఇప్పటికే డయాఫ్రమ్ డిజైన్లను కేంద్రం ఆమోదించినందున వచ్చే నెలలో నిర్మాణ పనులు చేపడతామని వెల్లడించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు ప్రారంభించేలోగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణను వెల్లడించేలా వర్క్‌షా్‌పను నిర్వహిస్తామని చెప్పారు. పోలవరం నిర్మాణ పనులకు సరిపడా నిధులు ఎప్పటికప్పడు అందేలా సహకరించాల్సిన బాధ్యత పీపీఏదేనని స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది మార్చి నెలాఖరునాటికి రూ.7200 కోట్లను విడుదల చేయాలని పీపీఏను కోరారు. ఈ నిధులను విడుదల చేస్తేనే ఎక్కడా ఆటంకం లేకుండా డయాఫ్రమ్‌వాల్, ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ పనులు పూర్తి చేయగలుగుతామని స్పష్టం చేశారు. కాగా, పీపీఏ సీఈవో అతుల్ జైన్ పర్యటించాక పోలవరం నిర్మాణ పనులకు కేంద్ర సహకారం అందుతుందన్న ఆశాభావం రాష్ట్ర జల వనరుల శాఖలో వ్యక్తమవుతోంది. ఈ నెలాఖరులోపు పోలవరం హెడ్‌వర్క్స్ పనులపై కేంద్ర ప్రతినిధులు, రాష్ట్ర జల వనరులశాఖ అధికారులు, పోలవరం నిర్మాణ సంస్థలతో వర్క్‌షాపును నిర్వహించేందుకు పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు యోచిస్తున్నారు. ఈ వర్క్ షాపు అనంతరం కేంద్రం ఇస్తానన్న రూ.12567 కోట్లకు సంబంచిన నిధుల విడుదల కోసం ఢిల్లీకి వెళ్లి జల శక్తి శాఖ కార్యదర్శితో సమావేశం కావాలని నిర్ణయించారు.
Updated Date - Oct 06 , 2024 | 03:12 AM