ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేంద్ర అనుమతుల కోసం వెయిటింగ్‌

ABN, Publish Date - Dec 28 , 2024 | 04:47 AM

కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి భారీ పారిశ్రామిక సంస్థలు వరుసగా తరలివస్తున్నాయి. రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఆర్సెలార్‌ మిట్టల్‌- నిప్పన్‌ స్టీల్‌ ఉక్కు కర్మాగారం, గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ సిద్ధంగా ఉన్నాయి.

ఏపీలోభారీ పెట్టుబడులకు ఆర్సెలార్‌-నిప్పన్‌ సిద్ధం

డేటా సెంటర్‌ ఏర్పాటుకు గూగుల్‌ రెడీ.. అనుమతులకు కేంద్రానికి ప్రతిపాదనలు

అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి భారీ పారిశ్రామిక సంస్థలు వరుసగా తరలివస్తున్నాయి. రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఆర్సెలార్‌ మిట్టల్‌- నిప్పన్‌ స్టీల్‌ ఉక్కు కర్మాగారం, గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ సిద్ధంగా ఉన్నాయి. వీటి ఏర్పాటుకు కేంద్రం నుంచి కొన్ని అనుమతులు కావాల్సి ఉంది. దాని కోసం ఆ కంపెనీలు తమ ప్రతిపాదనలు ఇప్పటికే ఢిల్లీకి అందచేశాయి. ఈ అనుమతులు త్వరగా సాధించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తరచూ కేంద్రంలోని సంబంధిత శాఖలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు అమల్లోకి వస్తే అవి రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిపై బలమైన ముద్ర వేస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

పెండింగ్‌లో పైప్‌లైన్‌ నిర్మాణం అనుమతి

ఆర్సెలార్‌- నిప్పన్‌ సంయుక్త సంస్థ విశాఖ సమీపంలోని నక్కపల్లిలో లక్షా నలభై వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో అతి పెద్ద ఉక్కు కర్మాగారం నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అంగీకారం కూడా కుదుర్చుకొంది. ఈ కంపెనీకి అవసరమైన ముడి ఇనుప ఖనిజం ఛత్తీస్‌గఢ్‌ నుంచి రావాల్సి ఉంది. ద్రవ (స్లర్రీ) రూపంలో పైప్‌ లైన్‌ ద్వారా దానిని తెప్పించాలని ఆ కంపెనీ భావిస్తోంది. గతంలో ఎస్సార్‌ స్టీల్‌ కంపెనీ కిరండోల్‌ నుంచి విశాఖకు ఓ పైప్‌లైన్‌ నిర్మించింది. 267 కిమీ పొడవు ఉన్న ఈ పైప్‌ లైన్‌ దేశంలోనే స్లర్రీ రవాణాలో అతి పెద్దది. కానీ ఇది ఎక్కువగా అటవీ ప్రాంతం నుంచి వస్తోంది. అందువల్ల పైప్‌లైన్‌లో కొంత భాగాన్ని మార్చి జాతీయ రహదారుల పక్క నుంచి వేసుకొంటూ రావాలని తాజాగా ప్రతిపాదించారు. దీనివల్ల పైప్‌లైన్‌కు రక్షణ ఉంటుందని భావిస్తున్నారు. కొంత కాలం క్రితం ఆర్సెలార్‌- నిప్పన్‌లో ఎస్సార్‌ స్టీల్‌ విలీనమైంది. దీంతో ఎస్సార్‌ నిర్మించిన పైప్‌లైన్‌ కూడా కొత్త కంపెనీ ఆధీనంలోకి వచ్చింది. అయితే పైప్‌లైన్‌ కొంత భాగాన్ని మార్చడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాల్సి ఉంది. అది వస్తే పైప్‌లైన్‌ నిర్మాణం, ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం రెండూ ఒకేసారి ప్రారంభించవచ్చన్న అంచనాలో ఆ కంపెనీ ఉన్నట్లు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. సూత్రప్రాయంగా కేంద్రం కూడా ఆమోదానికి సుముఖత వ్యక్తం చేసింది. అధికారికంగా అనుమతులు వస్తే పనులు వెంటనే ప్రారంభించే అవకాశం ఉంది. పైప్‌లైన్‌ మార్పుకు సుమారు రూ. వెయ్యి కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు.


గూగుల్‌ డేటా సెంటర్‌కు రక్షణ..

విశాఖ నగరంలో ఎఐ డేటా సెంటర్‌ ఏర్పాటుకు గూగుల్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఇటీవల ఎంఓయూ కుదుర్చుకొంది. గూగుల్‌కు ఇప్పటికే ముంబై, ఢిల్లీలో డేటా సెంటర్లు ఉన్నాయి. ఐటీలో వేగంగా దూసుకువెళ్తున్న వైజాగ్‌లో కృత్రిమ మేధస్సు (ఏఐ)కు ప్రత్యేకంగా ఒక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని గూగుల్‌ సంస్థ నిర్ణయించినట్లు సమాచారం. విదేశాలతో సమాచార మార్పిడికి విశాఖ నుంచి సముద్రం అడుగున కేబుళ్లు వేసే యోచనలో కూడా గూగుల్‌ ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్‌ డేటా సెంటర్‌ రాకతో రాష్ట్రానికి మరిన్ని ఐటీ సంస్థలు వచ్చే వీలుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ డేటా సెంటర్‌ విషయంలో గూగుల్‌ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని అనుమతుల కోసం ఎదురు చూస్తోంది. డేటా సెంటర్‌కు కేంద్రం ప్రత్యేక రక్షణ కల్పించాలని ఆ సంస్థ కోరుతున్నట్లు సమాచారం. గూగుల్‌ దరఖాస్తు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అయితే దీనికోసం కొన్ని చట్టాలను మార్చాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గూగుల్‌కు అనుమతులన్నీ త్వరగా రాబట్టడానికి సీఎం చంద్రబాబు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ఏడాదిలో ఇవన్నీ సాకారం అవుతాయన్న నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి.

Updated Date - Dec 28 , 2024 | 04:47 AM