ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆస్తులున్నా.. అమ్ముకోలేరు!

ABN, Publish Date - Dec 24 , 2024 | 01:28 AM

దేవదాయశాఖ అధికారుల నిర్లక్ష్యం మర్రిపూడి ప్రజలకు శాపంగా మారింది. గ్రామంలోని మొత్తం భూమిని దేవదాయ శాఖకు చెందినదిగా నమోదు చేయించడంతో ఆస్తి ఉన్నా వారు అమ్ముకోలేని దుస్థితి నెలకొంది. పదేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.

మర్రిపూడి గ్రామం వ్యూ

దేవదాయశాఖ అధికారుల నిర్లక్ష్యం.. మర్రిపూడి ప్రజలకు నష్టం

ఊరు మొత్తం ఆలయ భూమిగా నమోదు

పదేళ్లుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు

అవసరాలకు ఇళ్లు, స్థలాలు విక్రయించుకోలేక అల్లాడుతున్న గ్రామస్థులు

పిల్లల చదువులు, వివాహాలకు ఇక్కట్లు

ప్రస్తుత రెవెన్యూ సదస్సుల్లోనైనా సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి

మర్రిపూడి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : దేవదాయశాఖ అధికారుల నిర్లక్ష్యం మర్రిపూడి ప్రజలకు శాపంగా మారింది. గ్రామంలోని మొత్తం భూమిని దేవదాయ శాఖకు చెందినదిగా నమోదు చేయించడంతో ఆస్తి ఉన్నా వారు అమ్ముకోలేని దుస్థితి నెలకొంది. పదేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. దీంతో ఎంత అవసరం, కష్టం వచ్చినా... ఇల్లు, స్థలం ఉన్న వారు వాటిని అమ్ముకోలేకపోతున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోలేక కొందరు ప్రాణాలు కోల్పోయారు. పిల్లల విద్య, వివాహాలకు సైతం ఉన్న ఆస్తిని అమ్ముకోలేక అనేక మంది అవస్థపడుతున్నారు.

ఏం జరిగిందంటే..

2014వ సంవత్సరంలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీభూమి పేరుతో గ్రామ సభలు నిర్వహించింది. ఆసమయంలో దేవదాయశాఖ అధికారులు చేసిన తప్పిదం గ్రామస్థులను ఇబ్బందుల్లోకి నెట్టింది. మర్రిపూడి గ్రామం 545 సర్వేనంబర్‌లో 43.70 ఎకరాల్లో విస్తరించి ఉంది. గ్రామంలో రాజుల కాలంలో నిర్మించిన వేణుగోపాలస్వామి, రామలింగేశ్వరస్వామి దేవాలయాలు కేవలం 40 సెంట్ల స్థలంలో ఒకే ప్రాంగణంలో నిర్మితమై ఉన్నాయి. అయితే దేవదాయశాఖ అధికారులు అప్పట్లో ఆ దేవాలయాలు విస్తరించిన ఉన్న స్థలాన్ని సబ్‌ డివిజన్‌ చేయించుకోకుండా మీభూమి గ్రామసభలో 545 సర్వే నంబర్‌ మొత్తాన్ని తమ శాఖకు చెందినట్లుగా నమోదు చేయించుకున్నారు. దీంతో రిజిస్ట్రేషన్‌లు ఆగిపోయాయి. దశాబ్దకాలంగా గ్రామంలోని స్థలాలు, గృహాల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. స్థానిక బీసీ కాలనీకి చెందిన ఓమహిళ తీవ్రఅనారోగ్యానికి గురై ఇల్లు అమ్ముకోవాలని ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో చికిత్స చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయింది. ఇది మచ్చుకు ఉదాహరణ మాత్రమే. ఇలాంటి వారు మరికొంత మంది ఉన్నారు. చాలా మంది సదరు సర్వేంబర్‌తో సబందం లేకుండా ఆస్తి హద్దులు చూపిస్తూ వేరే సర్వే నంబర్‌తో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు.


రెవెన్యూ సదస్సుల్లోనైనా సమస్య పరిష్కరించాలని గ్రామస్థుల వేడుకోలు

సమస్యపై ఇప్పటికే అనేక సార్లు అటు రెవెన్యూ, ఇటు దేవదాయశాఖ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రెవెన్యూ సదస్సులు జరుగుతున్న తరుణంలో దేవదాయశాఖ అధికారులు చేసిన తప్పును సరిదిద్దాలని వేడుకొంటున్నారు. సబ్‌డివిజన్‌ చేసి దేవాలయాలను విడగొట్టి నిషేధిత జాబితా నుంచి గ్రామాన్ని తొలగించాలని కోరుతున్నారు. ఈసారి రెవెన్యూ సదస్సుల్లో పరిష్కారం చూపకపోతే ప్రత్యక్ష ఆందోళనుకు దిగేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు.

Updated Date - Dec 24 , 2024 | 01:28 AM