అనుమతుల్లేని వెంచర్లపై ఉక్కుపాదం
ABN, Publish Date - Dec 28 , 2024 | 01:21 AM
మార్కాపురం పట్టణంలో అనధికారిక వెంచర్లపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మూడు రోజులుగా వాటి యజమానులకు నోటీసులు ఇస్తున్నారు. వాటిని అందుకున్న వారు వారంరోజుల్లో అక్రమ వెంచర్లను తొలగించకపోతే తామే చర్యలు తీసుకుంటామని కమిషనర్ నారాయణరావు హెచ్చరించారు.
నోటీసులు జారీ చేస్తున్న మునిసిపల్ అధికారులు
వారంలోపు తొలగించుకోకుంటే కఠిన చర్యలు
కమిషనర్ నారాయణరావు హెచ్చరిక
మార్కాపురం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం పట్టణంలో అనధికారిక వెంచర్లపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మూడు రోజులుగా వాటి యజమానులకు నోటీసులు ఇస్తున్నారు. వాటిని అందుకున్న వారు వారంరోజుల్లో అక్రమ వెంచర్లను తొలగించకపోతే తామే చర్యలు తీసుకుంటామని కమిషనర్ నారాయణరావు హెచ్చరించారు. మార్కాపురం పరిసరాల్లో ఇష్టారీతిన వందల సంఖ్యలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. సరైన రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ తదితర కనీస వసతులు లేకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇష్టారీతిన వెంచర్లు వేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ దందాలో వ్యాపారుల అక్రమాలకు అంతేలేకుండా పోయింది. పట్టా భూములు కొని వాటిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ, అసైన్డ్, ఇరిగేషన్ భూములను సైతం ఆక్రమిస్తున్నారు. వాటిలోనూ యథేచ్ఛగా వెంచర్లు వేసి ప్రజలకు వాటిని అంటగట్టి కోట్ల రూపాయలు యజమానులు పోగేసుకుంటున్నారు. ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు మున్సిపల్ యంత్రాంగం నడుంబిగించింది. ఇప్పటికే అధికారులు 46 అక్రమ వెంచర్లను గుర్తించారు. ఈ అక్రమ వెంచర్లలో 19కి సంబంధించిన యజమానులకు నోటీసులు ఇచ్చారు. త్వరలో మిగిలిన వారికి కూడా నోటీసులు అందించనున్నారు.
అక్రమ లేఅవుట్‌లతోనే వ్యాపారం
మార్కాపురం పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆరు నెలల క్రితం వరకు జోరుగా సాగింది. మున్సిపాలిటీ నిర్ధేశాలకు అనుగుణంగా ఒక్క వెంచర్ కూడా వేయలేదంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి అనుమతులు లేకపోయినా ఎడాపెడా పుట్టగొడుగుల్లా అక్రమ లేఅవుట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. కేవలం సాధారణ, వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాల కోసం రెవెన్యూశాఖ వద్ద ల్యాండ్ కన్‌వర్షన్ మాత్రమే చేస్తున్నారు. మిగిలిన ప్రక్రియ ఏదీ కూడా చేపట్టకుండానే ఇష్టారీతిన లేఅవుట్‌లు వేసి యథేచ్ఛగా అమ్మకాలు చేపడుతున్నారు. వాస్తవానికి ల్యాండ్ కన్‌వర్షన్ చేయించుకున్న తర్వాత లేఅవుట్‌కు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఏ ఒక్కరూ ఆ దిశగా అనుమతి కోసం ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం కొద్దిపాటి వెడల్పుతో మట్టి రహదారులు ఏర్పాటు చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. మార్కాపురం పట్టణాన్ని ఆనుకొని ఐదేళ్ల కాలంలో చిన్నవి పెద్దవి సుమారు 350కి పైగా వెంచర్లు వెలిశాయి. ఇప్పుడు అధికారులు వీటిపైనే దృష్టిసారించారు.
Updated Date - Dec 28 , 2024 | 01:21 AM