రేపే పింఛన్ల పంపిణీ
ABN, Publish Date - Dec 29 , 2024 | 11:11 PM
నూతన సంవత్సరం సందర్భంగా పింఛన్‌దారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇక రోజు ముందుగానే పింఛన్ సొమ్ము ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన నిధులను కూడా విడుదల చేసింది.
నూతన సంవత్సరం సందర్భంగా ఒక రోజు ముందే ఇస్తున్న ప్రభుత్వం
జిల్లాకు రూ.122.79 కోట్లు విడుదల
నేడు బ్యాంకుల నుంచి డ్రా
ఒంగోలు నగరం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : నూతన సంవత్సరం సందర్భంగా పింఛన్‌దారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇక రోజు ముందుగానే పింఛన్ సొమ్ము ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన నిధులను కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పింఛన్‌ల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లాలోని ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో పింఛన్‌దారులు అనేక ఇబ్బందులు పడ్డా రు. ఒకటో తేదీ ఆదివారం వస్తే రెండో తేదీన ఇచ్చేవారు. కొన్నిసార్లు ఐదో తేదీ వరకూ పింఛన్ సొమ్ము అందేది కాదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త సంప్రదాయాన్ని తీసుకువచ్చి పింఛన్‌దారుల కష్టాలను తొలగించింది. ఒకటో తేదీ ఆదివారం అయితే ఒకరోజు ముందే పింఛన్ సొమ్ము ఇస్తోంది. ఇప్పటికే రెండుసార్లు అలా చేసింది. ప్రస్తుతం జనవరి 1వ తేదీన ఇవ్వాల్సిన పింఛన్‌ను 31వతేదీనే అందించాలని నిర్ణయించింది.
జిల్లాలో 2,85,438 మంది లబ్ధిదారులు
జిల్లాలో 2,85,438 మంది వివిధ రకాల పింఛన్‌దారులు ఉన్నారు. వీరికోసం ప్రభుత్వం రూ.122.79 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను 30వ తేదీన అంటే సోమవారమే సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుంచి డ్రా చేయనున్నారు. 31వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటలకు ముందే పంపిణీని ప్రారంభించనున్నారు. జిల్లాలో గత రెండు నెలల నుంచి పింఛన్ తీసుకోని వారికి మూడు నెలలకు కలిసి ఒకేసారి ఇవ్వనున్నారు.
పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు...
గతంలో ఏప్రభుత్వం చేయని విధంగా పింఛన్ తీసుకునే వ్యక్తి చనిపోతే ఆ మరుసటి నెల నుంచే భార్యకు మంజూరు చేసే విధానాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. నవంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు జిల్లాలో 237 మంది మృతి చెందారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈనెల నుంచి వారి భార్యలకు పింఛన్ సొమ్ము ఇవ్వనున్నారు. గతంలో పింఛన్‌దారుడు చనిపోతే ఆ కుటుంబంలో ఇంకొకరికి రావాలంటే ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. ఇప్పుడు మరుసటి నెలలోనే ఇచ్చి కూటమి ప్రభుత్వం ఆదుకొంటోంది.
Updated Date - Dec 29 , 2024 | 11:11 PM