కవ్విస్తున్న వైసీపీ శ్రేణులు
ABN, Publish Date - Dec 25 , 2024 | 11:47 PM
పొన్నలూరు మండలంలోని పలు గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతూ పలు గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్న వైసీపీ శ్రేణులపై పోలీసులు కేసులు నమోదు చేస్తుండటంతో రూటు మార్చి ఫ్లెక్సీలపై తప్పుడు రాతలు రాసి రెచ్చగొట్టే కార్యక్రమాలకు తెరదీశారు.
జగన్ బర్త్‌డే సందర్భంగా ‘రాక్షస మూకలను అంతమొందిస్తాం’ అని హెచ్చరికలతో ఫ్లెక్సీలు
పొన్నలూరులో మీసాలు మెలేస్తూ ఫొటోలు
నిలువరించి తొలగించిన ఎస్సై
కేసు నమోదు చేస్తామని హెచ్చరిక
పొన్నలూరు, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పలు గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతూ పలు గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్న వైసీపీ శ్రేణులపై పోలీసులు కేసులు నమోదు చేస్తుండటంతో రూటు మార్చి ఫ్లెక్సీలపై తప్పుడు రాతలు రాసి రెచ్చగొట్టే కార్యక్రమాలకు తెరదీశారు. గతంలో వైసీపీ పాలనలో ప్రెస్ మీట్ పెట్టిన అప్పటి తెలుగు మహిళా సంఘం నాయకురాలు, ఇప్పటి హోం మంత్రి వంగలపూడి అనితపై కూడా ఫేస్‌బుక్ లైవ్‌లో ఈ మండలానికి చెందిన వైసీపీ ప్రజాప్రతినిధి అసభ్య పదజాలంతో పోస్టు పెట్టిన సందర్భం కూడా ఉంది. అప్పట్లో టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తాజాగా మాజీ సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా మండలంలోని వేంపాడుకు చెందిన వైసీపీకి చెందిన యువకులు అధికార పార్టీ నాయకులను ఉద్దేశించి ‘రాక్షసమూకలను అంతమొందిస్తాం’ అంటూ ఫ్లెక్సీలపై రాసి, మీసాలు మెలేస్తూ రెచ్చగొట్టే విధంగా ఫొటోలు వేసుకుని ఫ్లెక్సీలను పొన్నలూరులో అంటించబోయారు. సమాచారం అందుకున్న ఎస్సై అనూక్ ఫ్లెక్సీలను తీసేయించారు. పదిహేను రోజుల కిందట కూడా మండలంలోని చవటపాలెంలో వైసీపీ నాయకులు ‘నేడు మీది - రేపు మాది’ అంటూ రెచ్చగొట్టే రాతలు రాసి ఫ్లెక్సీలు తయారు చేయగా ఎస్సై వాటిని తీసేయించారు. ఇలా మండలంలో పలు గ్రామాల్లో వైసీపీ శ్రేణులు రెచ్చగొడుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండటాన్ని అధికార పార్టీ కార్యకర్తలు ఆక్షేపిస్తున్నారు. ఆర్నెల్ల క్రితం వరకు తమ పార్టీ రాష్ట్ర నాయకుల నుంచి, స్థానిక నాయకుల వరకు అందరినీ సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టి, ప్రత్యక్షంగా దాడులకు పాల్పడిన వైసీపీ శ్రేణులకు ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పినా వారిలో మార్పు రాలేదంటూ టీడీపీ శ్రేణులు దుమ్మెత్తిపోస్తున్నాయి.
రెచ్చగొట్టే ఫ్లెక్సీలు కడితే కఠిన చర్యలు
గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా రెచ్చగొడుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఉపేక్షించేది లేదని, కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై అనూక్ ఒక ప్రకటనలో తెలిపారు. పొన్నలూరులో ఒక పార్టీకి చెందిన వ్యక్తులు రెచ్చగొడుతూ ఫ్లెక్సీలు కడుతున్నారన్న సమాచారం రావడంతో వాటిని తొలగించామని చెప్పారు. అందుకు బాధ్యులైన మండలంలోని వేంపాడుకు చెందిన దాసరి రవి, ఎర్రగోపాల్ మరో పదిమందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Updated Date - Dec 25 , 2024 | 11:47 PM