ఏఎంసీలపై కసరత్తు
ABN, Publish Date - Dec 29 , 2024 | 11:10 PM
వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల చైర్మన్ పదవుల రిజర్వేషన్‌పై కసరత్తు జరుగుతోంది. 50శాతం కమిటీల పగ్గాలను వివిధ వర్గాలకు కేటాయించాలన్న కూటమి ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే టీడీపీ శాసనసభ్యులు, ఇన్‌చార్జిలతో ఆమె మౌఖికంగా చర్చించినట్లు సమాచారం.
చైర్మన్ పదవుల్లో 50శాతం రిజర్వేషన్
కూటమి ప్రభుత్వం నిర్ణయం
కలెక్టర్‌కు బాధ్యత
కసరత్తు ప్రారంభించిన అన్సారియా
టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలతో చర్చలు
ససేమిరా అంటున్న నేతలు
రంగంలోకి ఇన్‌చార్జి మంత్రి ఆనం
వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల చైర్మన్ పదవుల రిజర్వేషన్‌పై కసరత్తు జరుగుతోంది. 50శాతం కమిటీల పగ్గాలను వివిధ వర్గాలకు కేటాయించాలన్న కూటమి ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే టీడీపీ శాసనసభ్యులు, ఇన్‌చార్జిలతో ఆమె మౌఖికంగా చర్చించినట్లు సమాచారం. మన జిల్లాతోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇన్‌చార్జి మంత్రులను ప్రభుత్వం రంగంలోకి దించింది. దీంతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవైపు దృష్టి సారించారు. జిల్లాలోని టీడీపీ శాసనసభ్యులు, ఇన్‌చార్జులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు అయోమయంలో పడ్డారు. కిందిస్థాయి నాయకులతో చర్చలు ఆరంభించగా ఏఎంసీ చైర్మన్ పదవుల విషయంలో రాజీపడేది లేదని వారు తేల్చిచెప్తున్నట్లు తెలిసింది. దీంతో ఈ పదవుల రిజర్వేషన్ల ఖరారు విషయంలో అయోమయ పరిస్థితి నెలకొంది.
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
నామినేటెడ్ పోస్టుల భర్తీని ఇప్పటికే చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్రస్థాయిలోని అత్యధిక పదవులను భర్తీ చేసింది. తాజాగా జిల్లా, నియోజకవర్గ, ఆకింది స్థాయి పోస్టులపై దృష్టి సారించింది. అందులో భాగంగా నియోజకవర్గస్థాయిలో కీలకమైన వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) పాలక మండళ్ల నియామకాన్ని జనవరిలో పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఆవైపు దృష్టి సారించింది. ఆ పదవుల నియామకాలకు సంబధించి రిజర్వేషన్లు ఖరారు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. పూర్వపు రోజుల్లో ఏఎంసీ చైర్మన్‌లకు సామాజికవర్గాల వారీ రిజర్వేషన్లు ఉండేవి కాదు. గత వైసీపీ ప్రభుత్వం ఈవిధానాన్ని అమలు చేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం కూడా అదే పద్ధతిని కొనసాగించాలని నిర్ణయించింది. ఆ మేరకు జిల్లాల వారీ ఏఎంసీ చైర్మన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు 50 శాతం కేటాయించింది. వాటిని ఖరారు చేసే అధికారం గతంలో కలెక్టర్లకు ఇచ్చారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆమేరకు కలెక్టర్లు ఆయా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, టీడీపీ ఇన్‌చార్జులతో మౌఖిక చర్చలు ప్రారంభించారు.
ఇన్‌చార్జి మంత్రి ఆనం సమాలోచన
ముఖ్యమంత్రి సూచించిన మేరకు చైర్మన్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఎమ్మెల్యేలు చేస్తున్న డిమాండ్లకు అనుగుణంగా సాధ్యం కాకపోవచ్చని కలెక్టర్ భావించారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. దీంతో కలెక్టర్లు విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రులను ఆదేశించినట్లు తెలిసింది. తదనుగుణంగా మన జిల్లాకు ఇన్‌చార్జి అయిన రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి రామనారాయణరెడ్డి రంగంలోకి దిగారు. జిల్లాలోని టీడీపీ శాసనసభ్యులు, ఇన్‌చార్జులకు ఆయన ఫోన్ చేసి రిజర్వేషన్‌ల విషయమై చర్చిస్తున్నారు. ఎక్కువ మంది శాసనసభ్యులు ఎన్నికల సందర్భంగా తాము హామీ ఇచ్చామని, తదనుగుణంగా రిజర్వేషన్ల విషయంలో మా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిసింది. ఆ ప్రకారం రిజర్వేషన్లు చేపడితే 80 శాతం చైర్మన్ పదవులు జనరల్ కేటగిరీలో ఉంచాల్సి వస్తుంది. దీంతో ఇన్‌చార్జి మంత్రి రామనారాయణరెడ్డి.. జిల్లా యూనిట్‌గా చైర్మన్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉన్నందున మీరు అందుకు అంగీకరించాల్సిందేనని సూచిస్తున్నట్లు సమాచారం.
టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలతో కలెక్టర్ చర్చలు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 15 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. విభజన అనంతర జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా గిద్దలూరు, మార్కాపురం సెగ్మెంట్ల పరిధిలో రెండేసి ఏఎంసీలు కలిసి కమిటీల సంఖ్య పదిగా ఉంది. దీంతో కలెక్టర్ అన్సారియా ఆయా మార్కెట్ కమిటీల రిజర్వేషన్లపై చర్చించారు. ఎక్కువ మంది టీడీపీ శాసనసభ్యులు, ఇన్‌చార్జులు తమ నియోజకవర్గాల్లోని ఏఎంసీ చైర్మన్ పదవులను జనరల్ కేటగిరీలో ఉంచాలని కోరినట్లు తెలుస్తోంది. కలెక్టర్ చర్చలు ప్రారంభించగానే అసెంబ్లీ స్థానాలు దళితులకు రిజర్వు అయిన కొండపి, సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు తమ పరిధిలోని ఏఎంసీ చైర్మన్ పదవులను జనరల్ కేటగిరీకి రిజర్వు చేయాలని కోరినట్లు తెలిసింది. ఎమ్మెల్యే, ఇన్‌చార్జి రిజర్వు కేటగిరీలో ఉన్నందున అది సమంజసంగానే భావించారు. ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడిని గుర్తించి మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఒక్కోచోట రెండేసి ఏఎంసీలు ఉన్నందున ఒకటి జనరల్ కేటగిరీలో ఉంచి మరొకటి రిజర్వు చేయాలని యోచించారు. అందుకు సదరు ఎమ్మెల్యేలు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. మిగిలిన శాసనసభ్యులు ఎవరికి వారు తమ నియోజకవర్గాల్లోని ఏఎంసీ చైర్మన్ పదవిని జనరల్ కేటగిరీలో ఉంచాలని కోరినట్లు సమాచారం.
అయోమయంలో ఎమ్మెల్యేలు
ఇన్‌చార్జి మంత్రి ఒత్తిడితో ఎమ్మెల్యేలు అయోమయంలో పడ్డారు. కిందిస్థాయి నాయకులతో చర్చలు ఆరంభించారు. అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలకు అనుగుణంగా కిందిస్థాయి నాయకులు ఏఎంసీ పదవుల విషయంలో రాజీపడేది లేదని తేల్చిచెప్తున్నట్లు తెలిసింది. దీంతో ఈ పదవులు, రిజర్వేషన్ల ఖరారు విషయంలో అయోమయ పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేల డిమాండ్లకు అనుగుణంగా ప్రభుత్వం రిజర్వేషన్ల విధానంలో వైఖరిని మార్చుకుంటుందా? తొలుత తీసుకున్న నిర్ణయం మేరకే ముందడుగు వేస్తుందా? అన్నది చర్చనీయాంశమైంది.
Updated Date - Dec 29 , 2024 | 11:10 PM